ఒక్క మాట.. మూడు జవాబులు!
- Prasad Satyam
- 1 hour ago
- 4 min read
‘మన మూలపేట పోర్టుకు పోదాం’ భారీ సక్సెస్
వైకాపా హయాంలో జరిగిన పనులకు లభించిన ప్రచారం
ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులంతా ఒక్కటేనన్న సందేశం
క్రెడిట్ చోరీని ఆపే ఎత్తుగడ ధర్మానదే
టెక్కలిలో పెరిగిన తిలక్ గ్రాఫ్
మరో నెల రోజుల్లో వంశధారపై ఇదే తరహా యుద్ధం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
దండుగా రావడం.. దండిగా దమ్ము చూపడం ఇప్ప్పుడు వైకాపా కొత్త ఎత్తుగడగా కనిపిస్తుంది. ఆమధ్య తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపించానని, గతంలో జగన్ శ్రీశైలం నుంచి నీరు తోడుకుపోవడానికి చూశారని చేసిన ఒక ప్రకటనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో సీమ వైకాపా నేతలు ఓ పోరాటం చేశారు. ఇందుకు సీమలో ఉన్న నేతలంతా ఒక్కచోటకు చేరారు. శ్రీకాకుళంలో మూలపేట పోర్టును చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించడంతో ఉత్తరాంధ్ర వైకాపా నేతలంతా దండుగా అధికార పక్షం మీద సోమవారం మాటల దాడి చేశారు. సూది కోసం సోదికెళ్తే.. పాత పురాణాలు బయటపడ్డాయన్నట్టు వైకాపా హయాంలో ఉత్తరాంధ్రకు జగన్ చేసిన మేలును ఈ సందర్భంగా వైకాపా నేతలు బయటపెట్టారు. తమ ఎన్నికలకు సైతం వాడుకోని సందర్భాన్ని ఈసారి బలంగా తెర మీదకు తీసుకొచ్చారు. ఒక్క మూలపేటకు పోదాం కార్యక్రమం ద్వారా ఈ జిల్లాకు టీడీపీ ఏమీ చేయలేదన్న సంకేతాలు పంపగలిగారు. అధికార కూటమిని కార్నర్ చేయగలిగారు. దీని వెనుక మంత్రాంగం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు స్థాయిని పార్టీలో మరో మెట్టునెక్కించింది. ఒక్క మూలపేటకు పోదాం కార్యక్రమం ఇటు పార్టీలో బలాన్ని, అటు అధికార పక్షానికి కౌంటర్‌ను ఒకేసారి తయారుచేసింది.
ఒక్క మాట జిల్లాలో వైకాపాకు ఊపిరి పోసింది. 2024లో ఆ పార్టీ ఓటమి తర్వాత మనుగడ కష్టమవుతున్న తరుణంలో ఒకే ఒక్క మాట జిల్లా సీనియర్లను ఏకతాటిపైకి తీసుకువచ్చింది. సోమవారం చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం విజయవంతం కావడంతోపాటు వైకాపా జవసత్వాలు కూడదీసుకుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది. 2024 ఎన్నికల తర్వాత ధర్మాన ప్రసాదరావు స్తబ్ధుగా ఉండటం, కృష్ణదాస్‌కు జిల్లా పార్టీ బాధ్యతలు విషమ పరీక్షగా మారడం, తమ్మినేని సీతారాం స్థానంలో చింతాడ రవికుమార్‌కు ఆమదాలవలస బాధ్యతలు అప్పగించడం, దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త మార్పు వంటి సంస్థాగత సర్దుబాట్లలోనే కొట్టుమిట్టాడిన వైకాపా ఇప్ప్పుడు మూలపేట పోర్టు ఉద్యమం ద్వారా జిల్లాలో తన బలమైన ఉనికిని మరోసారి ప్రభుత్వానికి చాటిచెప్పగలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా తరఫున బహిరంగంగా జెండా మోయడానికి కార్యకర్తలు వెనకడుగేస్తున్న సమయంలో మూలపేటకు పోదాం కార్యక్రమం పార్టీ స్టామినాను రుజువు చేసింది. అన్నిటికీ మించి తాము గతంలో ఐక్యంగా లేకే జిల్లాలో సీట్లన్నీ కూటమికి అప్పగించేశామని, ఈసారి బలంగా ముందుకొస్తామన్న సంకేతాన్ని అందించగలిగింది. ఈ కార్యక్రమం ద్వారా పోర్టును పూర్తి చేయించుకోగలరో లేదో తెలియదు గానీ, వైకాపాకు బలం సీనియర్లేనని మాత్రం పార్టీ నిరూపించగలిగింది.
తప్పుడు ప్రచారానికి కౌంటర్
మూలపేట పోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తెచ్చారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇచ్చిన రొటీన్ పొలిటికల్ స్టేట్‌మెంట్ ఇప్ప్పుడు వైకాపాలో ధర్మాన ప్రసాదరావు వంటి నేతల మైలేజ్‌ను మరింత పెంచింది. గత ఎన్నికల్లో తామేం తప్ప్పు చేశామో తెలుసుకోగలిగేలా చేసింది. మూలపేట పోర్టు వద్దకు వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నౌపడ జంక్షన్‌లో పెట్టిన భారీ సభ ద్వారా మూలపేట పోర్టును జగన్మోహన్‌రెడ్డి మంజూరు చేయడంతోపాటు 70 శాతం పనులు పూర్తి చేశారని.. 2023లో దీనికి శంకుస్థాపన చేసి, 2024లో ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే 70 శాతం పనులు పూర్తిచేస్తే, తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్లలో పావుశాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందన్న విషయాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లగలిగారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లో మూలపేట పోర్టును గానీ, పలాసలో కిడ్నీ ఆస్పత్రిని గానీ, ఉద్దానం ప్రాంతానికి వంశధార ప్రాజెక్టు నుంచి తాగునీరు సరఫరా చేసే స్కీమ్‌ను గానీ, భోగాపురంలో ఎయిర్‌పోర్టు పనుల ప్రగతిని గానీ వైకాపా ప్రచారాస్త్రంగా మలచుకోవడంలో విఫలమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా దాని ఖాతాలోకి చేరిపోతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు రన్‌వే మీద స్వయంగా ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడే ల్యాండ్ అవడంతో వైకాపా హయాంలో ఈ పనులు చాలా శాతం పూర్తయ్యాయన్న విషయం వైకాపా క్లెయిమ్ చేసుకోలేకపోయింది. అలాగే పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూటమి పాలనలో జరగడంతో ఆ క్రెడిట్ కూడా టీడీపీకే వెళ్లిపోయింది. వాస్తవానికి డయాలసిస్ సెంటర్లు పెట్టిన దగ్గర్నుంచి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వరకు పనులు చేపట్టింది అక్కడి మంత్రి సీదిరి అప్పలరాజు హయాంలోనే. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి రెండు మేజర్ ప్రాజెక్టులు టీడీపీ ఖాతాలోకి వెళ్లడం, మూలపేట పోర్టు కూడా చంద్రబాబే చేశారని రామ్మోహన్‌నాయుడు ప్రకటించిన నేపథ్యంలో వైకాపా డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది. మూలపేట పోర్టుతోపాటు వైకాపా హయాంలో జిల్లాలో చేపట్టిన పనులను సూటిగా చెప్ప్పుకొచ్చింది.
ఒక్కటైనా చేశావా.. చంద్రబాబూ?
వాస్తవానికి టీడీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందన్న భావన ధర్మాన ప్రసాదరావుది. దీన్ని అడ్డుకునేందుకు ఉత్తరాంధ్ర నేతలంతా ఒక్కటి కావాలన్న ఐడియా కూడా ఆయనదే. జిల్లాతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రకు జగన్మోహన్‌రెడ్డి ఏం చేశారో చెప్పే కార్యక్రమమే మూలపేటకు పోదాం పదండి. ఈ సభలోనే ధర్మాన ప్రసాదరావు అధికార పార్టీని, ముఖ్యంగా చంద్రబాబునాయుడును కడిగేశారు. ఒక డయాలసిస్ సెంటర్ ఇవ్వని చంద్రబాబు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టారంటే ఎలా నమ్మారంటూ ప్రశ్నించారు. వంశధారకు సంబంధించి ఒడిశా ప్రభుత్వంతో ఇప్పటి వరకు చంద్రబాబు సంప్రదింపులు జరపకపోవడం వల్ల రెండున్నర లక్షల ఎకరాలకు స్థిరీకరణ లేకుండాపోయిందని, రెండుచోట్లా బీజేపీ తానులో ముక్కలే అధికారంలో ఉన్నాయని ధర్మాన గుర్తుచేశారు. ఇప్ప్పుడు మూలపేటకు వచ్చినట్టే మరో నెల రోజుల్లో వంశధార పరీవాహక ప్రాంతంలో కూడా ఇటువంటి సభే నిర్వహిస్తామని ప్రకటించారు. ధర్మాన ప్రసాదరావు తన పార్టీ మీద అలిగారో లేక తనకు ప్రాధాన్యత లేనిచోట సేవలు అనవసరమనుకున్నారో తెలియదు గానీ వైకాపా ఓడిపోయిన దగ్గర్నుంచి ఆయన ఒకటే మాట చెబుతున్నారు. ప్రజా ఉద్యమాలు చేయాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రెండేళ్లు సమయమివ్వాలన్న ఆయన ఇప్ప్పుడు అదే పని చేశారు. మధ్యలో పార్టీ నిర్దేశించిన నిరసన కార్యక్రమాల కంటే మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమం భారీ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం కూడా ఇదే. ప్రభుత్వం మీద వ్యతిరేకత బయటపడాలన్నా, వైకాపా కార్యకర్త రోడ్డెక్కాలన్నా సమయం పడుతుందని ధర్మాన అప్ప్పుడే భావించారు.
బడ్జెట్‌లో ఏమిచ్చారో చెప్పాలి
జిల్లాలో వైకాపాను కోఆర్డినేట్ చేయడంలో ధర్మాన చతురత మరోసారి బయటపడింది. అదే సమయంలో భారీ ఈవెంట్ సక్సెస్ చేయడంతో టెక్కలి వైకాపా ఇన్‌ఛార్జి పేరాడ తిలక్ గ్రాఫ్ పెరిగింది. అన్నిటికీ మించి ఉత్తరాంధ్రలో అన్ని జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరై ఉత్తరాంధ్రలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామన్న సందేశాన్ని పంపగలిగారు. ఆ మధ్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో సీమ జిల్లా నేతలంతా ఒక్కటై ఉద్యమించారు. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెళ్లారు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా పోలీస్ పర్మిషన్లు వంటి ఏర్పాట్లను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చూసుకున్నారు. శ్రీకాకుళంలో తన కార్యాలయం నుంచి 200 కార్లతో బయల్దేరిన ధర్మాన దీనికోసం గత 20 రోజులుగా పలు ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు పెట్టించారు. జిల్లాలో ప్రతి ఒక్క కార్యకర్త జగన్మోహన్ రెడ్డి చేసిన అభివద్ధి గురించి చెప్పాలని, అదే సమయంలో చంద్రబాబు ఈ జిల్లాకు చేసిందేమీ లేదని రుజువు చేయాలనే స్టాలిన్ కాన్సెప్ట్‌ను తెర మీదకు తీసుకువచ్చారు. 60 సోలార్ లైట్లు వేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపామని చెబుతున్నవారు కోట్లాది రూపాయల బడ్జెట్‌లో జిల్లాకు ఏమిచ్చారో చెప్పడంలేదని పరోక్షంగా మంత్రి అచ్చెన్నాయుడును విమర్శించారు. జిల్లాకు ఇది కావాలంటూ చంద్రబాబును అడిగే పరిస్థితి ఇక్కడి తెలుగుదేశం నాయకులకు లేదని, ఉత్తరాంధ్రకు ప్రాజెక్టు ఏదైనా కావాలని అడిగితే చంద్రబాబు అమరావతి చూపించి వెళ్లగొట్టేస్తున్నారని, ఇప్పటి వరకు జిల్లాకు ఏదైనా మేలు జరిగితే.. అప్ప్పుడు రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్‌రెడ్డి వల్లే జరిగిందని ధర్మాన చెప్ప్పుకొచ్చారు. జిల్లాలో గ్రూపులుగా విడిపోయిన నాయకులు ఎంతమందైనా ఉండొచ్చుగాక, అధ్యక్షుడిగా కృష్ణదాస్ నాయకత్వాన్ని కాదనేవారు లేరనే సందేశాన్ని ఈ సమావేశం ఇవ్వగలిగింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పేరాడ తిలక్ గెలుపునకు ఢోకా లేదన్న మెసేజ్ కూడా మూలపేటకు పోదాం ప్రోగ్రామ్ ఇచ్చింది. అన్నిటికీ మించి జిల్లాను అభివద్ధి పథంలో నడిపినా, గత ఎన్నికల్లో ప్రచారం చేసుకోలేకపోయామన్న భావన వైకాపాలో కనిపించింది.






Comments