top of page

డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 8 hours ago
  • 2 min read
  • మెరిట్ లిస్ట్ లేకుండానే సెలెక్షన్ లిస్టా?

  • సీబీఐ విచారణ జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలి

  • కలెక్టరేట్ ముట్టడికి వైకాపా యువజన విభాగం యత్నం

  • వాంబే కాలనీ వద్ద అడ్డుకున్న పోలీసులు

  • ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో పెట్టారు

  • పోస్టుకు రూ.15 లక్షల బేరం.. సోషల్ మీడియా ఆడియోలపై విచారణ ఏది?

  • మెంటాడ స్వరూప్ ఆరోపణ

  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ కావడంపై అనుమానాలు

  • స్పోర్ట్స్ కోటాలోనూ అవినీతి జరిగిందని మండిపాటు

  • పేపర్ లీక్ వెనుక కూటమి నేతలు

  • ధర్మాన కృష్ణదాస్ సంచలన ఆరోపణలు

  • దళిత అభ్యర్థుల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం

  • సుమోటోగా స్వీకరించాలని హైకోర్టు, గవర్నర్‌కు విజ్ఞప్తి

  • పూలే పార్క్ టు కలెక్టరేట్.. ఉద్రిక్తంగా మారిన నిరసన ర్యాలీ

  • రోడ్డుపై బైఠాయించిన వైకాపా శ్రేణులు, డీఎస్సీ బాధితులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించిన డీఎస్సీ ఫలితాలు, ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, మెరిట్ అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వైకాపా యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెంటాడ స్వరూప్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పార్టీ పిలుపు మేరకు డీఎస్సీ`2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మార్పు ఫృధ్వీ అధ్యక్షతన వైకాపా యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెంటాడ స్వరూప్ నేతృత్వంలో నిరసన చేపట్టారు. ముందుగా యువజన విభాగం ఆధ్వర్యంలో ఉద్యోగార్ధులు, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు కలిసి స్థానిక పూలే పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో వాంబే కాలనీ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. డీఎస్సీ మెరిట్ లిస్టు ఎందుకు విడుదల చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా సెలెక్షన్ జాబితా విడుదల చేసి అభ్యర్థులకు వారి మార్కులు తెలియనీయకుండా ఉపాధ్యాయ ఉద్యోగాలను అంగడిలో పెట్టి అమ్మేశారని ఆరోపించారు. అక్రమాలపై సాక్షాత్తు పరీక్ష రాసిన అభ్యర్థి ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లావాదేవీల సంభాషణలపై ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డీఎస్సీని రద్దు చేయాలని, తక్షణమే బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరగలేదన్నారు. డీఎస్సీలో వంద శాతం మార్కులు సాధించిన వారికి సైతం టీచర్ పోస్టులు దక్కలేదన్నారు. ఒక ఉపాధ్యాయ పోస్టుకు రూ.15 లక్షలకు బేరం పెట్టారని, దీనికి సంuంధించిన సంభాషణలు సామాజిక మాధ్యమాలు, వివిధ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తున్నాయని స్వరూప్ అన్నారు. సాధారణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్‌గా నిలవడంపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీలోనూ అంతులేని అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మార్పు ఫృధ్వీ మాట్లాడుతూ సాధారణంగా మెరిట్, సెలెక్షన్ లిస్టు, రోస్టర్‌ను డీఎస్సీలో పాటించలేదన్నారు. అవినీతికి పాల్పడిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి వైకాపా జిల్లా అధ్యక్షులు, సీఎం ధర్మాన కృష్ణదాస్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ వెనుక కూటమి నాయకులు ఉన్నారని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. దళిత అభ్యర్థికి దక్కాల్సిన ఉద్యోగం వేరొకరికి కట్టబెట్టడం భావ్యం కాదన్నారు. డీఎస్పీ నియామకాలపై ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం, గవర్నర్ సుమోటోగా తీసుకొని డీఎస్సీ నియామకాలపైౖ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, పార్టీ సమన్వయకర్తలు సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, పేరాడ తిలక్, పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, గేదెల పురుషోత్తం, మార్పు దుర్గాప్రసాద్, పిన్నింటి సాయి, బి.పద్మజ, టి.కామేశ్వరి, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు ముత్తా విజయ్, డీఎస్సీ బాధితులు పాల్గొన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page