ఒక ఘంటసాల...ఒక బాలూ !
- Guest Writer
- Dec 16, 2025
- 2 min read

ఘంటసాలతో కలసి :
సినీ పరిశ్రమకు వచ్చిన రెండేళ్ళ వ్యవధిలోనే కనీసం పది పాటలు కూడా పాడకుండానే అప్పటికే మహా గాయకుడిగా ఉన్న ఘంటసాలతో కలసి ఏకవీర చిత్రంలో ప్రతీ రాత్రీ వసంత రాత్రి అంటూ అద్భుతమైన యుగళ గీతాన్ని ఆలపించాడు అంటే బాలు గాయక మహర్దశ ఏంటి అన్నది తొలినాళ్లలోనే జోస్యం చెప్పినట్లుగా తేటతెల్లమైంది. గాన గంధర్వుడు ఘంటసాలతో కలసి పాడిన ఆ పాట నేటికీ ఏనాటికీ అజరామరం. ఒక మేరు పర్వతం వంటి ఘంటసాల ముందు నిలిచి పాట పాడి మెప్పించడమే గొప్ప అనుకుంటే ఆ పాటతో తన సుదీర్ఘమైన ప్రస్థానానికి బలమైన పునాది వేసుకున్న బాలూ ఇంకెంత గొప్ప అని కూడా విశ్లేషించాల్సి ఉంది.
ఘంటసాల వారసుడిగా :
అది లగాయతు సినీ సీమలో ఎదుగుతూ ఘంటసాల వారసుడిగా చిర ఖ్యాతిని గడిరచిన బాలు తాను దిగ్గజ గాయకుడిగా ఘనమైన వైభవం సాగిస్తున్న దశలో హైదరాబాద్ లో లలిత కళా తోరణం వద్ద మహా గాయకుడు ఘంటసాల విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన సహృదయం చాటుకున్నాడు. 1993లో జరిగిన ఈ మహాద్భుతమైన కార్యక్రమానికి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేస్తే మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ క్రిష్ణ వంటి వారు హాజరై ఘంటసాల గురించి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. ఇక ఆ తరువాత కాలంలో ఆ విగ్రహాన్ని రవీంద్ర భారతి వద్ద బాలు పున ప్రతిష్టించారు.
ఆయన సరసన :
కట్ చేస్తే మరో మూడు దశాబ్దాల తరువాత తాను కూడా ఘంటసాల విగ్రహం పక్కన గర్వంగా తలెత్తుకుని నిలిచి ఒక విగ్రహ రూపంలో జనాలను సదా పలకరిస్తూ పులకరిస్తాను అని బాలూ ఊహించి ఉండరు. కానీ ఇపుడు ఆ మహద్భాగ్యం ఆయనకు దక్కింది. ఘంటసాల విగ్రహం పక్కనే బాలు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఘంటసాల బాలూ ఇద్దరినీ తీసుకుని వెళ్ళి దేవుడు తెలుగు జాతికి అన్యాయం చేశారు అని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
తెలుగు వెలుగుగా :
తెలుగు సినీ పాటకు ప్రాణం పోసి నడకలు పరుగులు నేర్పిన ఇద్దరు మేటి గాయకులు విగ్రహాల రూపంలో రవీంద్ర భారతిలో పక్కపక్కన సాక్షాత్కరించడం అన్నది తెలుగు జాతికే గర్వకారణం గా చెప్పాలి ఇద్దరూ మేటి, సరిసాటిగా రాణించారు. తెలుగు వారికి గర్వంగా నిలిచారు. ఆ ఇద్దరినీ అలా కలిపి చూస్తూంటే మాటే రాని మౌనం ఒక గానంగా మదిలో మెదులుతుంది. అవును మరి ఇద్దరు సంగీత స్రష్టలను ఎదురుగా పెట్టుకుంటే వెదురు అయినా వేణువుగా మారి ఎన్నో గీతాలను ఆలపించదా. ఇదే పాట ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను అని బాలూ అంటూంటే నా పాట మీ నోట పలకాలి చిలకా అంటూ ఘంటసాల రాగాలాపన చేస్తున్నట్లుగా ఉన్న ఆ సన్నివేశం రస రమ్యంగానే ఎప్పటికీ ఉంటుంది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments