ఒకడు చెత్తలో చెయ్యి పెడితే.. మరొకరు డ్రైనేజీలో పెడుతున్నారు
- SATYAM DAILY
- 1 day ago
- 2 min read
నరసన్నపేట వచ్చే చంద్రబాబు ఏదో ఇస్తారని వెళ్లకండి
కూటమిలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం
కుందువానిపేట లబ్ధిదారులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు
మత్స్యకారులతో గృహప్రవేశం చేయించిన ధర్మాన ప్రసాదరావు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్)
“ఒకరు చెత్తలో చేయి పెడితే.. ఇంకొకరు డ్రైనేజీలో చెయ్యి పెట్టేస్తున్నారు. ఏంటిదంతా? ఫొటో కోసం పని చేస్తున్నారా మీరు? ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఆయనేదో మోసుకొస్తున్నాడని జనాలు వెళ్లిపోగలరు. చెత్త నుంచి సంపద తీస్తానని వస్తున్నాడు. చెత్తనంతా కూడబెట్టి, అది దంచి సంపద తీస్తారట. దానిలోనుంచే మత్స్యకార భరోసా ఇస్తారట.”
.. ఇది మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేటలో గురువారం చేసిన వ్యాఖ్యలు. కుందువానిపేటలో తమ వైకాపా ప్రభుత్వం ఉన్నప్ప్పుడు కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించిన ఆయన అనంతరం జరిగిన సభలో కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే మీద పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జిల్లాకు చెందిన మంత్రి టెక్కలి ప్రభుత్వాసుపత్రికి వెళ్తే 40 మంది సిబ్బంది లేరనే వార్తలు చూశామని, రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన ఏ వ్యవస్థా పని చేయడం లేదనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలని ధర్మాన ప్రశ్నించారు. గ్రామాల్లో ఉండే సచివాలయ వ్యవస్థను నీరుగార్చేశారని, కుందువానిపేటలోనే 50 కుటుంబాలకు మత్స్యకార భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఏమడిగినా తప్పించుకు తిరుగుతున్నారని ధర్మాన ఆరోపించారు. ఉగాది నాటికి 2.7 లక్షల ఇళ్లు ప్రారంభించామని చెబుతున్నారని, ఇవన్నీ గత ప్రభుత్వంలో నిర్మించినవేనని ధర్మాన అన్నారు. ఈ రెండేళ్ల బడ్జెట్‌లో ఎక్కడైనా పేదవాళ్ల కోసం ఎకరా భూమి కొన్నట్టు చూపించగలరా అని ఆయన ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకొని రూ.12వేల కోట్లు పెట్టి భూమి కొందని, ఇళ్లు సాంక్షన్ కూడా ఇచ్చామని, తమ ఐదేళ్ల పాలనలో ఇళ్లు కూడా నిర్మించామని, ప్రతీ ఊరిలో కొత్త కాలనీల నిర్మాణం చేపట్టామని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలనీలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ధర్మాన ధ్వజమెత్తారు. అందుకే కుందువానిపేటలో తమ హయాంలో మత్స్యకారులు నిర్మించిన గృహాల్లో లబ్ధిదారుల చేత గృహప్రవేశాలు చేయించాల్సి వచ్చిందని ధర్మాన పేర్కొన్నారు. ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే తాము ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని ఆయన సమర్ధించుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉందో, లేదో తెలియడంలేదని, ప్రభుత్వాసుపత్రుల్లో మందుబిల్లలు లేవని, ఇంటి పెద్ద దిక్కు చనిపోతే పెన్షనిచ్చే దిక్కులేదని, పరిపాలనంతా గాలికొదిలేసి మండల కార్యాలయాల్లో బ్రోకర్ల సంఖ్య పెంచేశారని ధర్మాన ధ్వజమెత్తారు. చెత్త నుంచి సంపద తీస్తామంటున్న ముఖ్యమంత్రి రెండేళ్లలో ఎంత తీశారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే రూపాయి దగ్గర రెండు రూపాయలిస్తామని చెప్పిన చంద్రబాబు 3.3 లక్షల కోట్లు బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో వెయ్యి కోట్లయినా జిల్లాకు కేటాయించారా? ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఏదైనా చేపట్టారా? అని ఆయన ప్రశ్నించారు. జొన్న రైతుకు రూ.2400 మద్దతు ధర ఇస్తామని పోస్టర్ అంటించి ఇప్ప్పుడు రూ.1700కే కొంటామంటుంటే ఏమనుకోవాలని, ఆ ముక్క ముందే చెబితే పంట వేసేవారు వేస్తారు, మానేసేవారు మానేస్తారు కదా అని ఆయన నిలదీశారు. రూ.300కు కొనాల్సిన యÖరియా బ్లాక్‌మార్కెట్‌లో రూ.700కు అమ్ముతున్నారని, ఇంత అన్యాయం ఏ ప్రభుత్వంలోనైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న అకౌంట్లలో డబ్బులంతా ప్రభుత్వం వాడేసిందని, ఇప్ప్పుడు అక్కడ పనులెలా జరుగుతాయని ఆయన అన్నారు. మత్స్యకారుల కోసం రూ.360 కోట్లతో బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్‌కు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పునాది వేస్తే, టీడీపీ వచ్చాక ఆ పనులను ఆపేసిందని, దీన్ని మత్స్యకారులు గమనించాలన్నారు. పేదలకు సహాయపడటమనేది అంత సులువైన విషయం కాదని, వారి పట్ల కనికరం ఉండి, ఎంతో ధనం వెచ్చించగలిగితేనే ఆ పని చేయగలరని, దురదృష్టవశాత్తూ ఆ రెండూ చంద్రబాబుకు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, రూరల్ ఎంపీపీ అంబటి నిర్మల, చల్లా రవి, గార ఎంపీపీ గొండు రఘురాం, వైకాపా ఎస్సీ సెల్ నాయకుడు ముంజేటి కృష్ణ, రమేష్, మార్పు ఫృధ్వీరాజ్, జెడ్పీటీసీ రుప్ప దివ్య, అంబటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.






Comments