top of page

కొండంత హైప్‌.. ఆపై గట్టి దెబ్బ!

  • Guest Writer
  • Dec 31, 2025
  • 2 min read

2025 సంవత్సరం సినిమాల పరంగా ఒక విచిత్రమైన అనుభూతిని మిగిల్చింది. పాన్‌ ఇండియా స్టార్స్‌, వేల కోట్ల బడ్జెట్లు, స్కై హై అంచనాలతో థియేటర్ల ముందు జాతరలు జరిగాయి. కానీ తీరా సినిమా చూసాక మాత్రం ‘‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు’’ అనిపించింది. ఈ ఏడాది రిలీజ్‌ అయిన చాలా సినిమాలు అనౌన్స్మెంట్‌ అప్పుడు ఉన్న హైప్‌ ని, రిలీజ్‌ తర్వాత నిలబెట్టుకోలేక బాక్సాఫీస్‌ దగ్గర బోర్లా పడ్డాయి. ఫ్యాన్స్‌ పండగ చేసుకుందామని వెళ్తే, చివరికి నిరాశే మిగిలింది.

ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ విషయం తీసుకుంటే, ఈ ప్రాజెక్ట్‌ మొదలైనప్పుడు ఉన్న ఊపు రిలీజ్‌ నాటికి కనిపించలేదు. ఏళ్ల తరబడి షూటింగ్‌, వాయిదాల మీద వాయిదాలు పడటంతో ఆడియెన్స్‌ లో ఆసక్తి మెల్లిగా తగ్గిపోయింది. క్రిష్‌ దర్శకత్వంలో ఏదో అద్భుతం జరుగుతుందని ఆశించారు కానీ, తీరా రిలీజ్‌ అయ్యాక ఫ్యాన్స్‌ కి ఈ సినిమా పెద్ద షాక్‌ ఇచ్చింది. అంచనాలను అందుకోవడంలో ఈ పీరియాడికల్‌ డ్రామా పూర్తిగా విఫలమైంది. ఇక మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, లెజెండరీ డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా అంతే. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత చరణ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో గ్లోబల్‌ లెవెల్‌ లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. కానీ శంకర్‌ మార్క్‌ మ్యాజిక్‌ మిస్‌ అవ్వడం, కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియెన్స్‌ ని మెప్పించడంలో విఫలమైంది. షూటింగ్‌ ఆలస్యం కావడం కూడా సినిమా రిజల్ట్‌ పై ప్రభావం చూపింది.

ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘వార్‌ 2’ పై కూడా ఓ రేంజ్‌ లో అంచనాలు ఉండేవి. హృతిక్‌ రోషన్‌ ఎన్టీఆర్‌ కాంబో అంటే బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే అనుకున్నారు. కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. అలాగే లోకేష్‌ కనగరాజ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కాంబినేషన్‌ లో వచ్చిన ‘కూలీ’ కూడా హైప్‌ కి తగ్గట్టుగా ఆడలేదు. కేవలం స్టైల్‌ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. మరోవైపు మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ కోసం పాన్‌ ఇండియా స్టార్లందరినీ దించారు. ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌ వంటి వారు ఉన్నా, సినిమాను నిలబెట్టలేకపోయారు. గ్రాఫిక్స్‌, క్యాస్టింగ్‌ మీద పెట్టిన ఫోకస్‌ ఎమోషన్‌ మీద పెట్టలేదనిపించింది.

అటు బాలయ్య ‘అఖండ 2’, విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ సినిమాలు కూడా భారీ అంచనాలతో వచ్చి డిసప్పాయింట్‌ చేసిన లిస్ట్‌ లో చేరిపోయాయి. ముఖ్యంగా అఖండ 2 ని హిందీలో కూడా గ్రాండ్‌ గా ప్రమోట్‌ చేసి రిలీజ్‌ చేసినా పెద్దగా ఆడలేదు. రిలీజ్‌ టైమ్‌ లో ఎదురైన ఇబ్బందులకు తోడు ఓవర్‌ ఎలివేషన్స్‌ దెబ్బేషయనే కామెంట్స్‌ వచ్చాయి. మొత్తంగా 2025 రివైండ్‌ వేసుకుంటే.. కేవలం క్రేజీ కాంబినేషన్లు, భారీ బడ్జెట్లు మాత్రమే సినిమాను గట్టెక్కించలేవని మరోసారి రుజువైంది. షూటింగ్‌ మొదలైనప్పుడు ఉన్న హడావిడి, రిలీజ్‌ రోజు ఉన్న కటౌట్లు సక్సెస్‌ ని గ్యారెంటీ చేయలేవు. కంటెంట్‌ కింగ్‌ అని నమ్ముకున్న సినిమాలే నిలబడతాయి. ఈ డిసప్పాయింట్మెంట్స్‌ నుంచి పాఠాలు నేర్చుకుని, రాబోయే ఏడాదిలో అయినా మన స్టార్స్‌ అంచనాలకు తగ్గ సినిమాలతో రావాలని కోరుకుందాం.

-తుపాకి.కామ్‌ సౌజన్యంతో

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page