top of page

కాంత.. కళాత్మకమే కానీ..

  • Guest Writer
  • 4d
  • 4 min read
ree

పేరుకు మలయాళ నటుడైనా.. మహానటి.. సీతారామం.. లక్కీ భాస్కర్‌ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువ అయ్యాడు దుల్కర్‌ సల్మాన్‌. అతను తమిళ-తెలుగు భాషల్లో నటించిన ‘కాంత’ మీద కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. రానా దగ్గుబాటితో కలిసి దుల్కర్‌ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కొత్త దర్శకుడైన సెల్వమణి సెల్వరాజ్‌ రూపొందించిన ‘కాంత’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లే ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ:

1950 ప్రాంతంలో పెద్ద హీరోగా ఎదిగిన ఎం.కె.మహదేవన్‌ (దుల్కర్‌ సల్మాన్‌)కు.. తన గురువు అయిన అయ్య (సముద్రఖని)తో విభేదాలు వస్తాయి. తనే అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మహదేవన్‌ తన చెప్పుచేతల్లోనే ఉండాలని అయ్య ఆశిస్తాడు. కానీ పెద్ద స్టార్‌ అయిన మహదేవన్‌ గురువు అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడంతో ఇద్దరికీ విభేదాలు తలెత్తి కలిసి చేస్తున్న ‘శాంత’ అనే సినిమా ఆగిపోతుంది. ఐతే కొన్నేళ్ల తర్వాత మార్టిన్‌ అనే నిర్మాత వీళ్లిద్దరినీ ఒప్పించి తిరిగి సినిమాను పట్టాలెక్కిస్తాడు. కొత్త హీరోయిన్‌ అయిన కుమారి (భాగ్యశ్రీ) ఆ సినిమాలోకి అడుగు పెడుతుంది. అయ్య మనిషి అయిన ఆమెతో మహదేవన్‌ ప్రేమలో పడతాడు. మరోవైపు గురు శిష్యుల మధ్య గొడవలతోనే ఈ సినిమా ముందుకు కదులుతుంది. సినిమా చివరి దశకు వచ్చేసరికి విభేదాలు తీవ్రమై పీటముడి బిగుస్తుంది. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ పరిణామం ఏంటి.. ఇంతకీ ఈ సినిమా పూర్తయిందా లేదా.. అప్పటికే పెళ్లి చేసుకున్న మహదేవన్‌ కుమారితో బంధాన్ని ముందుకు తీసుకెళ్లగలిగాడా.. ఈ ప్రశ్నలకు తెరపైనే సమాధానం తెలుసుకోవాలి.

కథనం- విశ్లేషణ:

1950 ప్రాంతంలో నడిచే ఒక వైవిధ్యమైన కథ.. సినిమా తీయడం మీద ఒక సినిమా.. దుల్కర్‌-సముద్రఖని సహా తెరపై ఎటు చూసినా పెర్ఫామర్లు- అందరి నుంచి అద్భుతమైన నటన.. ప్రతి సన్నివేశంలోనూ కళాత్మకత ఉట్టిపడేలా చిత్రీకరణ.. అద్భుతమైన ఫ్రేమ్స్‌.. ప్రతి సంభాషణలోనూ ఒక లోతైన భావం.. కథను చెప్పే తీరులోనూ వైవిధ్యం.. ఇలా సినిమాకు సంబంధించి ప్రతి క్రాఫ్ట్‌ ‘ది బెస్ట్‌’ ఇవ్వడానికి ప్రయత్నించిన సినిమాగా ‘కాంత’ను చెప్పుకోవచ్చు. కానీ ఎవరెంత పనితనం చూపించినా.. సినిమాను ఎంత కళాత్మకంగా తీసినా.. అంతిమంగా రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టగలిగిందా లేదా అన్నదే ప్రధానం. గొప్ప సినిమాగా పేరు సంపాదించడం కంటే.. ఎంతమేర వినోదాన్నిచ్చిందన్నదే బాక్సాఫీస్‌ ఫలితానికి గీటురాయి. ‘కాంత’ ఈ విషయంలో ఒకింత నిరాశకే గురి చేస్తుంది. ఇప్పుడొస్తున్న సినిమాల మధ్య ‘కాంత’ చాలా భిన్నంగా నిలుస్తుంది.. ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది కానీ.. ఇది జనరంజకమైన సినిమా మాత్రం కాదు.

‘‘నువ్వు నాకు అవకాశం మాత్రమే ఇచ్చావు. జీవితాన్ని కాదు’’.. ఒక సన్నివేశంలో దుల్కర్‌ సల్మాన్‌ పాత్ర.. సముద్రఖని క్యారెక్టర్ని ఉద్దేశించి చెప్పే డైలాగ్‌. ‘కాంత’ సారాంశమంతా ఈ డైలాగ్‌ తోనే ముడిపడి ఉంది. ఎవరూ లేని అనాథ అయిన ఒక స్టేజ్‌ ఆర్టిస్టులోని ప్రతిభను గుర్తించి ఒక దర్శకుడు సినీ రంగంలోకి తీసుకొస్తాడు. అలా అవకాశం అందుకున్న ఆ నటుడు అనతి కాలంలోనే పెద్ద స్టార్‌ అవుతాడు. ఐతే తాను ఛాన్స్‌ ఇచ్చా కాబట్టి ఆ హీరో తన చెప్పుచేతల్లోనే ఉండాలని అనుకుంటాడు ఆ దర్శకుడు. కానీ తనకంటూ ఒక స్థాయి తెచ్చుకున్నాక కూడా గురువు కాళ్ల కిందే ఉండడాన్ని అతను ఇష్టపడడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన ఇగో క్లాష్‌ ఈ కథకు ఆధారం. బద్ధ శత్రువులుగా మారిన గురు శిష్యులు అనివార్య పరిస్థితుల్లో ఒక సినిమాను పూర్తి చేయాల్సి వస్తే.. వారి మధ్యలోకి ఒక అమ్మాయి వస్తే.. ఎలా ఉంటుందనే కాన్సెప్టుతో దర్శకుడు సెల్వమణి వెరైటీ సినిమానే తీశాడు. డెబ్యూ డైరెక్టర్‌ అయినప్పటికీ.. అన్నేళ్ల వెనక్కి వెళ్లి సినిమా మేకింగ్‌ నేపథ్యంలో ఇలాంటి ఒక చిత్రం తీయడం చిన్న విషయం కాదు. ఇందుకు అన్ని వైపుల నుంచి అతడికి సహకారం అందింది. అద్భుతమైన నటులు దొరికారు. మరోవైపు సాంకేతికంగా.. నిర్మాణ పరంగా కావాల్సిందల్లా సమకూరింది. ఈ వనరులను బాగానే ఉపయోగించుకున్నాడు కానీ.. ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే కథనం లేకపోవడం వల్ల ‘కాంత’ పూర్తి స్థాయిలో ఎంగేజ్‌ చేయలేకపోయింది.

‘కాంత’ ఆరంభం బాగానే అనిపిస్తుంది. సెట్లో ప్రతి రోజూ నువ్వా నేనా అని తలపడుతూ గురు శిష్యులు సినిమాను ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో కొన్ని ఆసక్తికరంగానే సాగుతాయి. ఓవైపు సినిమా మేకింగ్‌ మీద సన్నివేశాలు నడుస్తుంటే.. ఇంకోవైపు గురు శిష్యుల మధ్య గొడవ గురించి ఫ్లాష్‌ బ్యాక్‌ కట్స్‌ తో కథనం ఆసక్తికరంగానే నడుస్తుంది. కానీ ఒక దశ దాటాక సన్నివేశాలు రిపిటీటివ్‌ గా అనిపించడం.. నెమ్మదిగా సాగడంతో ప్రథమార్ధమే సుదీర్ఘంగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఐతే ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ద్వితీయార్ధం ఆసక్తి పెంచుతుంది. కానీ మర్డర్‌ మిస్టరీ ఇన్వెస్టిగేషన్‌ చుట్టూ నడిచే ద్వితీయార్ధం మాత్రం ‘కాంత’ను భారంగా మారుస్తుంది. పోలీస్‌ పాత్రలో రానా దగ్గుబాటి ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా హుషారు వస్తుంది కానీ.. మర్డర్‌ మిస్టరీని ఛేదించేందుకు అతను చేసే విచారణ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. విపరీతమైన హడావుడితో సాగే ఆ పాత్ర.. అప్పటిదాకా కళాత్మకంగా సాగుతున్న నరేషన్‌ స్టైల్‌ నే మార్చేస్తుంది. వింటేజ్‌ మూవీ చూస్తున్న ఫీలింగ్‌ పోయి.. ఈ రోజుల్లో ఒక రెగ్యులర్‌ మర్డర్‌ మిస్టరీని చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఎంతకీ తెగని ఇన్వెస్టిగేషన్‌ సినిమా గ్రాఫ్‌ ను కిందికి తీసుకెళ్లిపోతుంది. ఐతే పతాక సన్నివేశాలను మాత్రం బాగా తీర్చిదిద్దారు. అక్కడొచ్చే మలుపు.. అందులోని ఎమోషన్‌.. దుల్కర్‌ సల్మాన్‌ పెర్ఫామెన్స్‌ క్లైమాక్సును నిలబెట్టాయి. ఓవరాల్‌ గా ఒక యావరేజ్‌ ఫీలింగ్‌ తో సినిమా ముగుస్తుంది. తొలి తరం సినిమా మేకింగ్‌ మీద ఆసక్తి ఉండి.. ఒక డిఫరెంట్‌ మూవీ చూడాలనుకుంటే.. ‘కాంత’పై ఒక లుక్కేయొచ్చు. ఆర్టిస్టిక్‌ టచ్‌ ఉన్నప్పటికీ.. ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకపోవడం మంచిది.

నటీనటులు- పెర్ఫార్మెన్స్‌ :

దుల్కర్‌ సల్మాన్‌ గురించి చెప్పేదేముంది? మరోసారి అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు. తన కెరీర్లో బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ కు మహదేవన్‌ పాత్ర ఇప్పుడే కాదు.. ఎప్పటికీ పోటీగా నిలుస్తుంది. ఈ సినిమాకు గాను అతను అవార్డులు కూడా అందుకోవచ్చు. అంత గొప్పగా ఆ పాత్రను పండిరచాడు. సినిమాలో భాగంగా అప్పటి కాలానికి తగ్గట్లు అద్భుతంగా నటించాడు అనిపించాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు ఆఫ్‌ ద స్క్రీన్‌ కొన్ని సన్నివేశాల్లో కూడా దుల్కర్‌ అదరగొట్టాడు. సముద్రఖని అతడికి దీటుగా నటించాడు. అయ్య పాత్రలో జీవించేశాడు. భాగ్యశ్రీ బోర్సేను ‘మిస్టర్‌ బచ్చన్‌’.. ‘కింగ్డమ్‌’ సినిమాల్లో చూసి ఏమో అనుకుంటాం కానీ.. ఇందులో కుమారి పాత్రలో ఆమె కూడా చాలా బాగా నటించింది. తనలోని నటిని తొలిసారిగా ఈ సినిమాలో చూడొచ్చు. చాలా సీన్లలో కళ్లతో నటించి మెప్పించింది. పోలీస్‌ పాత్రలో రానా బాగా చేశాడు. అతడి లుక్‌ బాగుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం రానా ఓవర్‌ ద బోర్డ్‌ వెళ్లినట్లు అనిపిస్తుంది. రవీంద్ర విజయ్‌.. నిళల్‌ గల్‌ రవి.. గాయత్రి.. వీళ్లంతా తమ పాత్రలకు తగ్గట్లు నటించారు.

సాంకేతిక - వర్గం పనితీరు :

‘కాంత’లో సాంకేతికంగా అన్ని విభాగాలూ అద్భుతమైన పనితీరును కనబరిచాయి. ముఖ్యంగా 50వ దశకం నాటి సినీ వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడంలో ఆర్ట్‌ డిపార్ట్మెంట్‌ కృషి అమోఘం. ఎక్కడా చిన్న డీవియేషన్‌ కూడా రానివ్వని విధంగా ఆ విభాగం ఔట్‌ పుట్‌ తీసుకొచ్చింది. ‘మహానటి’ ఫేమ్‌ డాని శాంచెజ్‌ మరోసారి తన ఛాయాగ్రహణ ప్రతిభతో అబ్బురపరిచాడు. విజువల్స్‌ గొప్పగా ఉన్నాయి. జాను చందర్‌ పాటలు ఓకే. జేక్స్‌ బిజోయ్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌.. సన్నివేశాలను ఎలివేట్‌ చేసేలా గొప్పగా సాగింది. నిర్మాణ విలువల విషయంలో మేకర్స్‌ ఏమాత్రం రాజీపడలేదు. సినిమాకు ఏం అవసరమో అదంతా ఇచ్చారు. రచయిత-దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్‌.. తన అరంగేట్ర చిత్రంలో సేఫ్‌ గేమ్‌ ఆడకుండా.. రిస్క్‌ చేశాడు. భిన్నమైన సినిమా తీశాడు. దాదాపు ఎనిమిది దశాబ్దాల వెనక్కి వెళ్లి అప్పటి సినిమా మేకింగ్‌ నేపథ్యంలో ఒక చిత్రాన్ని రూపొందించడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ క్రమంలో క్రాఫ్ట్‌ మీద గొప్ప పట్టు కూడా చూపించాడు. కాన్సెప్ట్‌ విషయంలో.. నటీనటుల గురించి గొప్ప పెర్ఫామెన్స్‌ రాబట్టుకోవడంలో తన పనితనం అభినందనీయమే కానీ.. సెల్వమణి నరేషన్‌ మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు. ముఖ్యంగా సెకండాఫ్‌ లో క్లైమాక్స్‌ మినహా బోరింగ్‌ స్క్రీన్‌ ప్లేతో ప్రేక్షకులను విసిగించాడు. ఒక ఫిలిం మేకర్‌ గా పనితనం చూపించినప్పటికీ.. అతను జనరంజకమైన సినిమా మాత్రం తీయలేకపోయాడు.


- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page