కొన్ని మెరుపులు... ఎన్నో మరకలు
- Guest Writer
- Jul 24
- 4 min read
'హరిహర వీరమల్లు’ మూవీ రివ్యూ
నటీనటులు: పవన్‌కళ్యాణ్- నిధి అగర్వాల్- బాబీ డియోల్- సచిన్ ఖేద్కర్- కబీర్ సింగ్ దుల్హన్- సత్యరాజ్- సునీల్- సుబ్బరాజు- నాజర్- తనికెళ్ల భరణి- కోట శ్రీనివాసరావు- రఘుబాబు తదితరులు
సంగీతం: కీరవాణి
మాటలు: సాయిమాధవ్ బుర్రా- ప్రణవ్ చంద్ర
నిర్మాత: దయాకర్ రెడ్డి
కథ- స్క్రీన్ ప్లే: క్రిష్ జాగర్లమూడి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి- జ్యోతికృష్ణ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో సుదీర్ఘ కాలం చిత్రీకరణ దశలో ఉన్న సినిమా.. హరిహర వీరమల్లు. అసలు విడుదలవుతుందా అని సందేహాలు రేకెత్తించిన ఈ చిత్రం.. అన్ని అడ్డంకులనూ దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పవన్ అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుందా? ఇది సగటు ప్రేక్షకులను మెప్పించేలా ఉందా? తెలుసుకుందాం..
కథ:
16వ శతాబ్దంలో భారత దేశంలో మొఘలుల ఆధిపత్యం సాగుతున్న కాలంలో హిందూ ధర్మానికి ముప్పు వాటిల్లుతుంది. దేశమంతా ఇస్లాం మత స్థాపనే లక్ష్యంగా సాగుతున్న ఔరంగజేబు హిందూ రాజ్యాలు ఒక్కోదాన్ని చేజిక్కించుకుంటూ.. అక్కడి ప్రజలు బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేస్తుంటాడు. ఉత్తరాది నుంచి మొదలుపెట్టి దక్షిణాది వైపు అడుగులు పడతాయి. అదే సమయంలో ఇక్కడ దొంగతనాలు చేసి పేదలకు సంపదను పంచి పెట్టే వీరమల్లు (పవన్ కళ్యాణ్)కు.. ఒక భారీ దొంగతనం చేసే క్రమంలో గోల్కొండ సంస్థానానికి చెందిన నవాబు సైన్యానికి వీరమల్లు దొరికిపోతాడు. శిక్ష ఖాయమనుకున్న దశలో అతడికి నవాబు ఓ పెద్ద బాధ్యత అప్పగిస్తాడు. ఆ బాధ్యత ఏంటి.. దానికి ఔరంగజేబుకు సంబంధమేంటి.. ఇంతకీ వీరమల్లు ఎవరు.. తన నేపథ్యమేంటి.. అతడి అంతిమ లక్ష్యం ఏంటి.. ఇంతకీ అతను నవాబు చెప్పిన పని పూర్తి చేశాడా.. ఈ క్రమంలో వీరమల్లు తన లక్ష్యాన్ని సాధించాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
సినిమా అన్నది ఒక అబద్ధం. కానీ థియేటర్లో కూర్చునే రెండు రెండున్నర గంటల పాటు ఆ అబద్ధాన్ని నిజంలా నమ్మించి.. ఓ కథలో లీనం చేయగలిగితేనే ప్రేక్షకులకు రసానుభూతి కలుగుతుంది. దాన్ని బట్టే ఆ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఐతే తెరపై జరుగుతున్నది ఏదీ నిజం కాదన్నట్లుగా ఒక భావన వెంటాడుతుంటే.. ఆ కథలో లీనం కావడం.. సన్నివేశాలను ఆస్వాదించడం చాలా కష్టంగా మారుతుంది. అందులోనూ చరిత్రతో ముడిపెట్టి ఒక కల్పిత కథను చెబుతున్నపుడు గొప్ప నైపుణ్యం చూపిస్తే తప్ప దాన్ని ప్రేక్షకులు అంగీకరించరు. అది రాజమౌళి లాంటి దర్శకులకు మాత్రమే సాధ్యమైన విద్య. కానీ రాజమౌళి స్థాయిలో కాకపోయినా క్రిష్ సైతం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఆ నైపుణ్యాన్ని చాటాడు. అలాంటిదే ఆయన చేసిన మరో ప్రయత్నమే.. హరిహర వీరమల్లు. మంచో చెడో ఆయనే ఈ ప్రయత్నాన్ని పూర్తి చేసి ఉండాల్సిందేమో. మధ్యలో మరో దర్శకుడు వచ్చి దీనికి తన క్రియేటివిటీని జోడిరచడం.. ఇంకొకరి కథకు తన విజన్ సరిపోకపోవడం.. మేకింగ్ విపరీతంగా ఆలస్యం కావడం.. విజువల్ ఎఫెక్ట్స్ ఇమడకపోవడం.. అన్నీ కలిసి ‘హరిహర వీరమల్లు’ ఒక అతుకుల బొంతలా తయారైంది. కథ మధ్యలో కొంత ఆసక్తి రేకెత్తించినా.. కొన్ని మెరుపుల్లాంటి ఎపిసోడ్లు ఉన్నా.. పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ కు తగ్గ ఎలివేషన్లు పడినా.. ఓవరాల్ గా ‘వీరమల్లు’ అభిమానులను సంతృప్తిపరిచే సినిమా కాలేకపోయింది.
వేర్వేరు కాలాల్లో జీవించిన అల్లూరి సీతారామరాజు.. కొమరం భీంల పాత్రలకు ముడిపెట్టి స్వతంత్ర పోరాటం నేపథ్యంలో తాను ఒక సినిమా తీస్తున్నట్లు రాజమౌళి ప్రకటించినపుడు.. వినడానికి చాలా కృత్రిమంగా అనిపించింది. కానీ ఆ కృత్రిమమైన ఆలోచననే తెరపై అద్భుతంగా ప్రెజెంట్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు జక్కన్న. క్రిష్ సైతం చరిత్రకు ముడిపెడుతూ ఇలాంటి కథనే సృష్టించాడు ‘హరిహర వీరమల్లు’లో. 16వ శతాబ్దంలో దేశమంతటా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా సాగిన ఔరంగజేబుకు.. వీరమల్లు అనే హిందూ ధర్మ పరిరక్షకుడు ఎదురు నిలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ కథ రాశాడు. కథానాయకుడికి దాంతో పాటు ఔరంగజేబు దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని దోచుకురావడం అనే మరో లక్ష్యాన్ని కూడా పెట్టాడు. రెంటినీ మిళితం చేసి రసవత్తర డ్రామాకు రంగం సిద్ధం చేశాడు. కానీ కథ పరంగా ఆసక్తికరంగా అనిపించినా.. ఎగ్జిక్యూషన్లో మాత్రం తేడా కొట్టేసింది. ఇది ఔరంగజేబుతో పోరాడిన శంబాజీ కథను చూపించిన ‘ఛావా’లా కదిలించనూ లేదు. అదే సమయంలో కల్పిత కథతో కనికట్టు చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లా ఉర్రూతలూగించనూ లేదు. హీరో ఎలివేషన్లు.. యాక్షన్ బ్లాక్స్ వరకు పవన్ అభిమానులను-మాస్ ప్రేక్షకులను అలరించినా.. కథనంలో ఆసక్తి లోపించడంతో సగటు ప్రేక్షకులకు నిరాశ తప్పదు.
ఐతే ఓవరాల్ గా సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే.. ‘హరిహర వీరమల్లు’ హైలైట్ అనిపించే కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఇంటర్వెల్ బ్లాక్. వందల మంది సైన్యాన్ని బోల్తా కొట్టించి వీరమల్లు బృందం వజ్రాలను కొల్లగొట్టే ఈ ఎపిసోడ్ ను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దింది చిత్ర బృందం. మామూలుగా మొదలై ఒక దశ వరకు అనాసక్తికరంగా అనిపించే ‘వీరమల్లు’కు మంచి ఊపు తీసుకొచ్చే ఎపిసోడ్ అది. కథ పరంగా కూడా చిన్న ట్విస్ట్ ఉండడం.. కోహినూర్ వజ్రంతో ముడిపెడుతూ సాగే దాని ఫాలోఅప్ ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. ఇంటర్వెల్ దగ్గర ‘హరిహర వీరమల్లు’ ట్రాక్ ఎక్కినట్లు అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధం కూడా అదే టెంపోతో సాగి ఉంటే సినిమా స్థాయి వేరుగా ఉండేది.
కానీ దారిలో ఎదురయ్యే రకరకాల సవాళ్లను దాటుకుంటూ దిల్లీకి వీరమల్లు తన బృందంతో ప్రయాణం చేసే క్రమంలో సాగే రెండో అర్ధం తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుత రియల్ లైఫ్ ఇమేజ్ కు ముడిపెడుతూ ధర్మపరిరక్షకుడిగా ఆయన్ని ఎలివేట్ చేయడానికి చేసిన ప్రయత్నం అనుకున్నంతగా ఫలించలేదు. పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ద్వితీయార్ధంలో ఎపిసోడ్లు తేలిపోయాయి. కొండచరియలు విరిగిపడే ఒక బ్లాక్.. వర్షం కోసం యజ్ఞం జరిపే మరో ఎపిసోడ్.. ఇవన్నీ కూడా వీఎఫెక్స్ వైఫల్యం వల్ల రియలిస్టిగ్గా అనిపించక ఫార్సుగా తయారయ్యాయి. ద్వితీయార్ధం మొత్తంలో హిందూ ధర్మాన్ని కాపాడ్డం కోసం మొఘల్ సామంత రాజుల మీద వీరమల్లు తిరగబడి జనంలో చైతన్యం తీసుకొచ్చే ఒక్క ఎపిసోడ్ మాత్రం పేలింది. అందులోనూ యాక్షన్ సన్నివేశాలు ఇంకా మెరుగ్గా తీసి ఉండాల్సిందనిపిస్తుంది. ఈ కథను ఎలా ముగిస్తారు.. కోహినూర్ వజ్రం సంగతేంటి.. వీరమల్లు అసలు లక్ష్యం నెరవేరిందా.. ఔరంగజేబుతో తన పోరాటం ఎలా సాగుతుంది.. అని ఎన్నో ప్రశ్నలతో పతాక సన్నివేశాలకు సిద్ధమైతే.. దర్శకుడు జ్యోతికృష్ణ పెద్ద షాకే ఇస్తాడు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రెండో పార్టులో వెతుక్కోమంటూ.. పూర్తిగా అసహజంగా అనిపించే తుపాను ఎపిసోడ్ తో క్లైమాక్సును తేల్చి పడేశాడు. ఓవరాల్ గా కొన్ని ఎపిసోడ్ల వరకు ఎంగేజ్ చేసినా... మొత్తంగా ‘హరిహర వీరమల్లు’ నిరాశకే గురి చేస్తుంది.
నటీనటులు:
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ కోసం చేయాల్సిందంతా చేశాడు. తనకే సొంతమైన ‘ఆరా’ సినిమాలో కొన్ని ఎపిసోడ్లను నిలబెట్టింది. ఆయనే సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. వీరమల్లు పాత్రలో పవన్ లుక్ కూడా బాగుంది. ఇటు వజ్రాల దొంగగా.. అటు ధర్మ పరిరక్షకుడిగా.. రెండు రకాలుగా పవన్ మెప్పించాడు. తన పాత్రలోని రెండో కోణం ఆయన పాత్ర నిజ జీవితాన్ని గుర్తు చేస్తుంది. హీరోయిన్ నిధి అగర్వాల్ కష్టాన్ని తక్కువ చేయలేం కానీ.. ఆధునిక ఛాయలతో కనిపించే ఆమె ‘పంచమి’ పాత్రకు అంతగా కుదిరనట్లు అనిపించలేదు. పాత్రకు అవసరమైన పరిణతి ఆమెలో కనిపించలేదు. పవన్ పక్కన నిధికి జోడీ కూడా కుదరలేదు. ఔరంగజేబుగా బాబీ డియోల్ సరిపోయాడు. అతడి నటన కూడా బాగుంది. సత్యరాజ్.. సచిన్ ఖేద్కర్ తమ పాత్రల పరిధిలో బాగా చేశారు. సునీల్.. నాజర్.. సుబ్బరాజు.. రఘుబాబు.. వీళ్లంతా సహాయ పాత్రల్లో ఓకే అనిపించారు.
సాంకేతిక వర్గం:
సాంకేతిక విభాగాల్లో ‘హరిహర వీరమల్లు’కు అతి పెద్ద బలం కీరవాణి నేపథ్య సంగీతమే. ఆయన స్కోర్ విషయంలో శక్తి వంచన లేకుండా కష్టపడ్డారు. కథలో కీలకమైన ఎపిసోడ్లను బీజీఎంతో ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు. ఎలివేషన్.. యాక్షన్ ఎపిసోడ్లలో స్కోర్ అదిరిపోయింది. ఐతే పాటలు మాత్రం అంత గొప్పగా లేవు. ఓ మోస్తరుగా అనిపిస్తాయంతే. జ్ఞానశేఖర్.. మనోజ్ పరమహంస లాంటి పేరున్న సినిమాటోగ్రాఫర్లు ఈ సినిమాకు ఛాయాగ్రహణం అందించారు. కానీ విజువల్స్ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రభావం వాటి మీద పడ్డట్లు అనిపిస్తుంది. సినిమాకు వీఎఫెక్స్ అతి పెద్ద బలహీనత. చాలా సన్నివేశాలు అసహజంగా అనిపించడానికి.. ప్రభావం కోల్పోవడానికి గ్రాఫిక్స్ లోపమే ప్రధాన కారణంగా అనిపిస్తుంది. సాయిమాధవ్ బుర్రా మాటలు అక్కడక్కడా పేలాయి. క్రిష్ రాసిన కథ బాగున్నా.. అదంత ప్రభావవంతంగా తెరకెక్కలేదు. ఆయన ఎంత వరకు డైరెక్ట్ చేశారు.. జ్యోతికృష్ణ టేకింగ్ ఎంత వరకు అన్న క్లారిటీ లేదు కానీ.. కథనంలో మాత్రం నిలకడ కనిపించదు. ఏదైనా వస్తువును చాన్నాళ్లు పక్కన పడేసి బయటికి తీస్తే దుమ్ముపట్టినట్లు.. విపరీతమైన ఆలస్యం వల్లో ఏమో ఈ సినిమా కూడా ఏదో మసకబారిన ఫీలింగ్ కలుగుతుంది చూస్తున్నంతసేపు.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
Comments