top of page

కుబేరాకి 13 ప్రశ్నలు

  • Guest Writer
  • Jun 24, 2025
  • 3 min read

కుబేర చూసాను. పెద్దగా నచ్చలేదు. యావరేజ్‌గా అనిపించింది. సమీక్షలన్నీ పాజిటివ్‌గా, ఆహా, ఓహో అంటూ వచ్చాయి. నేను సినిమా సరిగ్గా చూడలేదా? శేఖర్‌ కమ్ముల మీద ఉన్న సానుకూల దృక్పథం సమీక్షల మీద పని చేసిందా అనేది అర్థం కాలేదు. వేరే కమర్షియల్‌ డైరెక్టర్‌ అయితే ఈ వ్యాసం రాయాల్సిన పనిలేదు. శేఖర్‌ కమ్ముల సెన్సిటివ్‌ దర్శకుడు, సూక్ష్మమైన భావనలని కూడా తెరమీద ఆవిష్కరించే క్రియేటివ్‌ జీనియస్‌. మరి ఆయన నుంచి ఇలాంటి లాజిక్‌ లేని ఓవర్‌ సినిమా లిబర్టీ మూవీ రావడం ఆశ్చర్యం. తనది కాని చెప్పుల్లో కాలు పెట్టారు. క్రైం థ్రిల్లర్‌ ఆయన జానర్‌ కాదు. ఈ కథని ఎన్నేళ్లు రాసుకున్నారు, ఎన్ని గంటల నిడివి తీసారన్నది ముఖ్యం కాదు. ప్రేక్షకుడు ఏం చూసాడన్నదే ప్రధానం.

కుబేరాలో నాకు వచ్చిన సందేహాలు. ఇది నా అజ్ఞానం కూడా కావచ్చు. అజ్ఞానమే అందరికీ శ్రీరామ రక్ష

  • బంగాళాఖాతంలో ఆయిల్‌ పడుతుంది. దాన్ని స్వాధీనం చేసుకోడానికి నీరజ్‌ అనే వ్యాపారి ప్రభుత్వ పెద్దలకి లక్ష కోట్లు లంచం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. నీరజ్‌ ఎవరు? దేశంలో ఆయన్ని తెలియని వారు లేరు. లక్ష మంది ఉద్యోగులున్న కంపెనీలకీ యజమాని. ఆయన కింద ఎంత మంది చార్టెర్డ్‌ అకౌంటెంట్‌లు వుంటారో, ఏ రేంజ్‌ ఫైనాన్స్‌ నిపుణులు వుంటారో ఊహించుకోవచ్చు. ఆ రేంజ్‌కి చేరుకోవాలంటే గవర్నమెంట్‌లో ఎందరిని మేనేజ్‌ చేయాలో, ఎలా చేయాలో తెలియని అమాయకుడు కాదు. అయినా కొత్తగా ఏదో డీల్‌ వచ్చినట్టు, తండ్రి చెప్పిన మాటలు విని, జైల్లో ఉన్న సీబీఐ అధికారిని, కేసు నుంచి విడిపించి మరీ లక్షకోట్ల డీల్‌ అప్పచెబుతాడు. డబ్బులిస్తే అన్ని విలువల్ని వదిలేసుకునే సమస్త యంత్రాంగం చుట్టూ వుంటే, అందర్నీ వదిలి, విలువల గురించి మాట్లాడే నాగార్జునను తెచ్చుకుని, కొరివితో తల గోక్కుంటాడా? సినిమాటిక్‌ లిబర్టీ అంటారా! ఓకే, డన్‌.

  • నాగార్జున విషయానికి వద్దాం. సీబీఐ అధికారి కావాలంటే చాలా చదివి వుండాలి. అధికారం ఉన్నపుడు విలువలకి కట్టుబడి వుండాలంటే చాలా నైతిక శక్తి కావాలి. నీరజ్‌ ఎంత శక్తిమంతుడో తెలిసి కూడా , దాడి చేసి ఫైన్‌ కట్టించాడంటే ఎంతో నిబద్ధత కావాలి. ముక్కుసూటిగా పనిచేస్తే ఎన్ని శక్తులు తనమీద పగ పడతాయో తెలియని అమాయకుడు కాదు. అయినా నిజాయితీగా చేసి జైలుకెళ్లాడు. కోర్టులో న్యాయం జరగలేదు. భార్యాబిడ్డల వైపు మొగ్గి , నీరజ్‌కు లొంగిపోయాడు. మనీల్యాండరింగ్‌, షెల్‌ కంపెనీలు, ఫైనాన్స్‌ ఎక్స్‌ఫర్ట్‌ల పని. కానీ నీరజ్‌ గొర్రెలా సీబీఐ మాజీ అధికారిని ఎంచుకున్నాడు. సినిమా లిబర్టీ ఓకే. నాగార్జున చేసిందేమంటే నలుగురు బిచ్చగాళ్లని వెతికి పట్టుకోవడం. దీనికి నలుగురు ఎందుకు? ఒకడితోనే లాగించొచ్చు. కానీ క్లైమాక్స్‌కి ఖుష్బు, ఆమె కొడుకు అవసరం. ఇది దర్శకుడి లిబర్టీ. బిచ్చగాళ్లని తెచ్చి , కటింగ్‌ చేసి, గడ్డాలు తీసి, కోటు వేసి, సీఈవోని చేసి రోబో అనే వాడి చేతిలో హత్య చేయించడం ఇదంతా ఓవర్‌గా లేదా? శేఖర్‌ కమ్ములకి తెలియనిది ఏమంటే డబ్బున్న వాళ్లంతా డ్రైవర్లని, తోటమాలీలు, వాచ్‌మెన్లని బినామీలుగా పెట్టుకుంటారు. దోవలో పోయే బిచ్చగాళ్లని ట్రైనింగ్‌ చేయించరు. నీ పేరు మీద క్షణాల్లో కోటి రూపాయిలు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ సృష్టించి, అమెరికా ప్రయాణం చేయించగల నిపుణులు అమీర్‌పేటలోనే ఉన్నారు. అబిడ్స్‌, కోఠిలో మామూలు వ్యాపారులకి కూడా హవాలా, మనీ ల్యాండరింగ్‌ తెలుసు. శేఖర్‌ సార్‌ పద్మారావునగర్‌లో వుండి, అదే ప్రపంచం అనుకుంటున్నారు.

  • ధనుష్‌ ఒక బిచ్చగాడు. చదువులేదు కానీ, తెలివి వుంది. జ్ఞాపక శక్తి వుంది. మనిషిగా విలువలున్నాయి. బాల్యం ఒక గాయం. అలాంటి వాడు కష్టపడి పని చేసుకుంటాడు కానీ, బిచ్చగాడిగా ఎందుకుంటాడు? మరుజన్మలో బిచ్చగాడిగా వుండడానికే ఇష్టపడని వాడు , ఇపుడు బిచ్చగాడిగా ఎందుకున్నాడు? ఉన్నాడనే అనుకుంటే ఎవరో ముక్కూమొహం తెలియని వాళ్లు, డబ్బులిస్తామని చెబితే వెళ్తాడా? సూటుబూటు వేసి, సంతకం చేయమంటే తెలివైన వాడికి కొంచెమైనా అనుమానం రాదా? రాలేదనే అనుకుందాం. ఇంతకీ అతని డబ్బు ఎందుకు ట్రాన్స్‌ఫర్‌ కాలేదు?

  • ఇవన్నీ పక్కన పెడితే, ఓల్డ్‌మాంక్‌ పేరు చెప్పి ఎవడైనా ప్లాట్‌లోకి వెళ్లగలిగే ఇంట్లో బోలెడు డబ్బు, బంగారం దాచిన అధికారి ఎంత అమాయకుడు? అసలు అతని కథ ఏంటి?

  • బ్యాంకింగ్‌ అవగాహనే లేని ధనుష్‌ ఒక ట్రక్కు నిండా నోట్ల కట్టలని విలన్‌ ఇంటి ముందు ఎలా వేసాడు?

  • నంబర్‌ వన్‌ బిజినెస్‌ టైకూన్‌, ఒక బిచ్చగాడిని హ్యాండిల్‌ చేయలేక బిచ్చగాడిగా మారిపోతాడా?

  • ఎవరో తెలియని ఖుష్బూని రక్షించిన నాగార్జున ఒక సిన్సియర్‌ పోలీస్‌ అధికారి షాయాజీ షిండేని ఎందుకు కాల్చి చంపుతాడు?

  • సినిమాలో రష్మికనే కొంచెం సహజంగా వుంది. కానీ బిచ్చగాడిని నమ్మి అన్ని రిస్క్‌లు తీసుకోవడం కొంచెం అసహజం.

  • శేఖర్‌ కమ్ముల ఒక కంగాళీ సినిమాని తీస్తే, కారణాలు ఏమైతేనేం అందరూ భుజాలకెత్తుకుంటున్నారు. నా లాంటి అజ్ఞానులకే సమస్య.

  • చివరిగా ...శేఖర్‌ సార్‌ మీ అభిమానిగా చెబుతున్నా. మీరొక మంచి సినిమా తీయాలనుకుని తీయలేకపోయారు. ఆహా, ఓహో భుజకీర్తుల్ని నమ్మకండి. అవి దేవతా వస్త్రాలు.

  • ధనుష్‌ నోట్ల కట్టలు ఇచ్చి అంతిమ యాత్ర చేసినా, బండెడు నోట్ల కట్టలు రోడ్డు మీద కుమ్మరించినా, మీడియా, సోషల్‌ మీడియా ఏమై పోయాయి? అసలు ఈ సినిమా ఏ కాలం నాటిది?

  • డబ్బున్న వాళ్లదే న్యాయం. వాళ్లు పేదవాళ్లతో ఆడుకుంటారు, వాడుకుంటారు. నిజమే. టికెట్‌ రేట్లని పెంచి మీరు చేస్తున్నదేంటి? దోపిడీ కాకుండా వేరే పదం ఏమైనా వుందా?

  • శేఖర్‌ కమ్ముల రూ.150 కోట్లతో జూదం ఆడారు. మీరు మంచి అటగాడే కానీ ముక్కలు పడలేదు.

Next time better luck

- జీఆర్‌ మహర్షి

header.all-comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page