కేరళం.. అదో సంప్రదాయ పరిమళం!
- DV RAMANA

- 7 hours ago
- 3 min read

దేవుడి సొంత దేశం.. గాడ్స్ ఓన్ కంట్రీ.. అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కేరళ.. అంతటి భాగ్యం దక్కించుకున్న ఈ రాష్ట్రం దానికి పూర్తి అర్హురాలు.. సార్థక నామదేయురాలు. ఒకవైపు సాగర కెరటాల సవ్వడి.. ఎటు చూసినా కాలువలు.. వాటి మధ్యలో పచ్చని కొబ్బరి చెట్ల సోయగాలతో నిజంగా కేరళ దేవనగరిగానే భాసిల్లుతూ చూసేవారికి అద్భుత: అనిపిస్తుంది. కాన్వాస్‌పై ప్రకతి గీసిన అద్భుత చిత్రం మాదిరిగా కనిపించే కేరళ ఇక మీదట కేరళం కానుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పేరు కేరళీయుల జాతీయతకు, సంప్రదాయానికి పట్టుగొమ్మలాంటిది. కేరళం అనే పదానికి ఆ రాష్ట్ర స్వభావానికి మధ్య విడదీయలేని బంధం ఉంది. మలయాళంలో ‘కేర’ అంటే కొబ్బరి చెట్టు అని, ‘ఆలం’ అంటే భూమి అని అర్థం. రెండూ కలిపితే కేరళం.. అంటే కొబ్బరి వనాల నేల అని చెప్పొచ్చు. అందుకే కేరళం అన్న పేరు ఆ రాష్ట్రానికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. పేరుకు తగినట్లే ఆ రాష్ట్రంలో ఎటుచూసినా కొబ్బరి తోటలే. అంతేకాకుండా.. అక్కడి ప్రజల సంప్రదాయాల్లో నారికేళం మిళితమై ఉంటుంది. కొబ్బరి నూనెతో చేసే వంటకాల ఘుమఘుమలు, కొబ్బరి పాలతో చేసే అప్పం, ‘స్టూ’ వంటి వంటకాలు కేరళీయులకు ప్రత్యేకం. చారిత్రకంగా చూస్తే మౌర్య చక్రవర్తి అశోకుడి కాలం నాటి శిలాశాసనాల్లో ఈ ప్రాంతాన్ని ‘కేరళపుత్ర’ అని సంబోధించడం విశేషం. భాషాపరంగా చూస్తే, సంస్కృతంలోని ‘కేరళ’ పదానికి మలయాళ వ్యాకరణం ప్రకారం చివరన చేర్చే ‘మ’ (అనుస్వరం) ఆ రాష్ట్ర అస్తిత్వానికి ప్రాణం పోస్తుంది. ‘కేరళం’ అని పలికినప్పుడు ఉట్టిపడే ఆత్మీయత ‘కేరళ’లో కనిపించదని మలయాళీల ప్రగాఢ విశ్వాసం. ఒకప్పుడు మలబార్, కొచ్చిన్, ట్రావెన్‌కోర్ సంస్థానాలుగా విడిపోయిన మలయాళీలను ఏకం చేసేందుకు దశాబ్దాలపాటు ఐక్య కేరళ ఉద్యమం జరిగింది. మాతృభాష పట్ల, తమ ప్రత్యేకమైన ఆచారవ్యవహారాల పట్ల మలయాళీలు చూపే నిబద్ధత ఇతర భాషా రాష్ట్రాలకు కూడా ఒక గొప్ప ప్రేరణ. ఈ పేరు మార్పు వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 2023లోనే పినరయి విజయన్ నేతత్వంలోని వామపక్ష ప్రభుత్వం కేరళ పేరును కేరళంగా మార్చాలని ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే సాంకేతిక కారణాలు, కొన్ని విధానపరమైన లోపాలను ఎత్తిచూపుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ తీర్మానాన్ని వెనక్కి పంపింది. అయినా కూడా వెనక్కి తగ్గని సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం ఆ లోపాలను సరిదిద్ది 2024 జూన్ 25న మరోసారి అసెంబ్లీలో సవరించిన తీర్మానాన్ని ఆమోదించింది. స్వాతంత్య్ర పోరాట సమయం నుంచే మలయాళం మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని, దానికి ‘¿రళం అనే పేరు ఉండాలని పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నాయని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా పలుమార్లు గుర్తుచేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పేరు మార్పు ప్రతిపాదనతో ముందుకేశామని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పేర్లు మార్చే అధికారం పార్లమెంటుకే ఉంది. ఇది కాస్త సుదీర్ఘ ప్రక్రియ కూడా. రాజ్యాంగబద్ధంగా ఒక రాష్ట్రం పేరు మారాలంటే కచ్చితమైన సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్రపతి సిఫార్సుతో ఈ పేరు మార్పు బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందాక కొత్త పేరు అమల్లోకి వస్తుంది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌తో పాటు ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న అన్ని భాషల్లోనూ ఇకపై కేరళ రాష్ట్రాన్ని ‘కేరళం’ అని మాత్రమే పిలవాలన్నది ముందు నుంచి ఉన్న ప్రధాన డిమాండ్. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసినందున పార్లమెంటులో పేరు మార్పు బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించడం పెద్ద సమస్య కాదు. అవన్నీ వెంటవెంటనే జరిగిపోతాయి. పార్లమెంటులో సాధారణ మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో గెజిట్‌లో నోటిఫై చేశాక ఆ బిల్లు చట్టంగా మారుతుంది. అయితే పేరు మార్పు ప్రక్రియను సుమారు మూడేళ్లపాటు నానబెట్టి సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాటి అసెంబ్లీ తీర్మానం బూజు దులిపి కేబినెట్‌లో పెట్టి ఆమోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో రెండు నెలల్లో అంటే.. ఏప్రిల్, మే నెలల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అటు రాష్ట్రంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, ఇటు కేంద్రంలోని అధికార పార్టీకి కూడా ఈ పరిణామం ఎన్నికల్లో లాభం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల్లో ప్రాంతీయ అభిమానాన్ని రగిల్చి ఓట్లు రాబట్టే వ్యూహం ఇందులో దాగి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఇప్పటిది కాదన్నది సుస్పష్టం. ఎటొచ్చి కేంద్రంలోని మోదీ సర్కారు ఎన్నికల అదను చూసుకుని దాన్ని తెరపైకి తేవడానికి రాజకీయ ప్రయోజనాలే లక్ష్యం కావచ్చని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి వేల సంవత్సరాలనాటి ఒక గొప్ప చారిత్రక వారసత్వాన్ని ప్రస్తుత ఆధునిక కాలంలో ‘కేరళం’ పేరుతో పునరుద్ధరించుకోవడం ఒక గొప్ప సాంస్కృతిక విజయమనే చెప్పాలి. ఇప్పుడా పేరు కేవలం ఒక భౌగోళిక ప్రాంతానికి గుర్తు మాత్రమే కాదు.. ఒక జాతి తన అస్తిత్వాన్ని, మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటిచెప్పే చారిత్రక ఘట్టం. రాజ్యాంగంలో ఇప్పటివరకు ‘కేరళ’గా ప్రస్తావించిన ఆ రాష్ట్రం ఇకపై అధికారికంగా తాను కోరుకున్న సొంత సంప్రదాయాన్ని ఎలుగెత్తి చాటేలా ‘కేరళం’గా రూపాంతరం చెందడంతో మలయాళీ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. పార్టీలకతీతంగా నినదించిన ఈ డిమాండ్‌కు కేంద్రం ఆమోదం తెలపడాన్ని కేవలం ఒక పేరు మార్పు గానే పరిగణించకూడదు. శతాబ్దాల వలసవాద ముద్రలను చెరిపివేసి మాతృభాషలోని మాధుర్యాన్ని పరిపాలనలో ప్రతిబింబించడమే ఈ మార్పు లక్ష్యం. త్వరలోనే అన్ని కార్యాలయాలు, అధికారిక పత్రాల్లో ఇదే పేరు నమోదుకానుంది.






Comments