top of page

కూలిన కోట నిలబడింది.. తెలుగునాట మళ్లీ ‘సూర్య’ ప్రభంజనం!

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 4 hours ago
  • 3 min read

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్, బాక్సాఫీస్ మార్కెట్‌ను సొంతం చేసుకున్న తమిళ కథానాయకుడు సూర్య. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత డబ్బింగ్ సినిమాలతో తెలుగునాట తిరుగులేని మార్కెట్ సృష్టించుకున్న ఏకైక హీరోగా ఆయన నిలిచారు. ‘గజిని’ సంచలనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సూర్య.. ఆ తర్వాత వరుస విజయాలతో తన రేంజ్‌ను పెంచుకుంటూ పోయారు. 2010 టైంలోనే అతడికి రూ.15 కోట్ల దాకా మార్కెట్ ఉండేది. ‘24’ సినిమా తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ వసూళ్లు రాబట్టి హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం.

పట్టు తప్పిన బాక్సాఫీస్ పట్టు

అయితే, ఆ తర్వాత సరైన కథల ఎంపిక లేకపోవడం సూర్య మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రయోగాలు బెడిసికొట్టడం, రొటీన్ చిత్రాలు నిరాశపరచడంతో తెలుగు ప్రేక్షకులు ఆయన సినిమాలపై ఆసక్తి చూపించడం తగ్గించేశారు. గత ఏడాది విడుదలైన ‘రెట్రో’ చిత్రానికైతే కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. దీంతో తెలుగులో సూర్య మార్కెట్ దాదాపు క్లోజ్ అయిపోయిందని, ఆయన మళ్లీ పుంజుకోవడం అసాధ్యమని ట్రేడ్ వర్గాలు సైతం పెదవి విరిచాయి.

‘విశ్వనాథ్ అండ్ సన్స్ ’తో ఊహించని రీ-ఎంట్రీ

కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది. ‘కరుప్పు’తో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన సూర్య.. తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్ ’తో తెలుగు బాక్సాఫీస్‌పై సునామీ సృష్టించారు. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన విధానం, మన ప్రేక్షకులకు నేరుగా కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. విడుదలకు ముందే మొదలైన బజ్.. పాజిటివ్ టాక్ తోడవ్వడంతో వసూళ్ల జాతరగా మారింది.

తెలుగులో మాత్రమే ఈ చిత్రం తొలి వారాంతంలోనే రూ.50 కోట్ల మార్కును దాటేయడం విశేషం. యుఎస్‌లో ఆల్రెడీ 1 మిలియన్ మార్కు దాటేసింది. తమిళ వర్షన్‌తో పోలిస్తే తెలుగులోనే ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన, భారీ వసూళ్లు రావడం సూర్యకున్న అసలైన క్రేజ్‌ను మరోసారి గుర్తుచేస్తోంది.

ఒక్క సరైన కథ పడితే తెలుగు ప్రేక్షకులు పరభాషా నటుడినైనా ఎలా గుండెల్లో పెట్టుకుంటారో ఈ విజయం మరోసారి స్పష్టం చేసింది. కోల్పోయిన తన మార్కెట్‌ను రెట్టింపు ఉత్సాహంతో తిరిగి చేజిక్కించుకున్న సూర్య.. ఇదే జోరును కొనసాగిస్తే రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో ఆయన రేంజ్ మరింత పైస్థాయికి చేరడం ఖాయం.


మెగా క్లాష్!

మావయ్య వర్సెస్ మేనల్లుడు?

సంక్రాంతి బరిలో ఆసక్తికర పోరు

2027 సంక్రాంతి పండుగకు ఇంకా ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ, టాలీవుడ్‌లో అప్పుడే బాక్సాఫీస్ ప్రకంపనలు మొదలయ్యాయి. ‘మేమంటే మేము’ అంటూ భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతుండటంతో అటు అభిమానుల్లో ఉత్కంఠ, ఇటు బయ్యర్లలో ఆందోళన కనిపిస్తోంది. ప్రతి ఏడాది సంక్రాంతికి రద్దీ సహజమే అయినా.. మూడు కంటే ఎక్కువ భారీ సినిమాలు క్లాష్ అయితే, మంచి టాక్ వచ్చిన చిత్రాలు కూడా కలెక్షన్ల పరంగా నష్టపోవాల్సి వస్తుందని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

‘సంబరాల ఏటిగట్టు’తో రంగంలోకి..

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’ జనవరి 12న విడుదల కానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. నిర్మాత నిరంజన్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే సంక్రాంతి సీజన్ ఒక్కటే సరైన మార్గమని భావించి రిలీజ్ డేట్ ఖరారు చేశారు. సాధారణంగా పండుగ సీజన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు ఆదరణ ఎక్కువ. మరి ఇలాంటి హై-వోల్టేజ్ రా యాక్షన్ మూవీ పండగ వాతావరణంలో ఎంతవరకు మెప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

‘మెగా 158’తో బరిలోకి మెగాస్టార్ చిరంజీవి

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ సైతం సంక్రాంతినే టార్గెట్ చేస్తోందని విశ్వసనీయ సమాచారం. గతంలో సంక్రాంతికి వచ్చి బ్లాక్‌బస్టర్ కొట్టిన ‘వాల్తేరు వీరయ్య’ సెంటిమెంట్‌ను రిపీట్ చేసేందుకు దర్శకుడు బాబీ పట్టుదలతో ఉన్నారు. ఈ చిత్రానికి ‘కాకా (కదిరి కాకాజీ)’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా విడుదల కానున్న టీజర్‌లో తేదీని స్పష్టం చేయకుండా ‘సంక్రాంతి రిలీజ’ అనే కార్డు వేయనున్నారని టాక్.

మావయ్యపై మేనల్లుడి పోటీ నిలుస్తుందా?

ఈ పరిణామాలు ఇప్పుడు మెగా అభిమానుల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. ఒకే సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద ఎదురుగా సాక్షాత్తూ చిరంజీవి బొమ్మ ఉంటే.. మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సినిమాకు మెగా ఫ్యాన్స్ సమాన స్థాయిలో మద్దతు ఇవ్వడం కాస్త కష్టమైన పనే. తేజు సినిమా సోలోగా లేదా కాస్త గ్యాప్‌తో వస్తే ఫ్యాన్స్ పూర్తిగా ఓన్ చేసుకుని కలెక్షన్లను నిలబెట్టే అవకాశం ఉంటుంది. క్లాష్ పడితే థియేటర్ల కేటాయింపు, ఓపెనింగ్స్ పరంగా తేజుకే ఎక్కువ రిస్క్ ఉండే ప్రమాదం ఉంది.

రద్దీగా మారిన సంక్రాంతి బరి

ఈ మెగా పోరు మాత్రమే కాకుండా, ఈసారి సంక్రాంతికి భారీ లైనప్ క్యూ కట్టింది: వెంకటేష్ - అనిల్ రావిపూడి చిత్రం, రవితేజ - శ్రీవిష్ణు మల్టీస్టారర్, శర్వానంద్ - జార్జ్ క్రిష్ మూవీ, బాలకృష్ణ 111, మహాకాళి, రజినీకాంత్ ‘ధర్మన’

ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్‌డే అప్‌డేట్స్ వచ్చాకే ఈ ‘మావయ్య వర్సెస్ మేనల్లుడు’ క్లాష్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోటీని లెక్కచేయకుండా ఇద్దరూ బరిలో నిలుస్తారా లేక ఒకరు వెనక్కి తగ్గి థియేటర్ల సమస్య రాకుండా చూసుకుంటారా అనేది వేచి చూడాలి!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page