top of page

కాలువకు అడ్డమా.. కాలువే అడ్డమా?!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 1 min read

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఈ ఫొటోల్లోని దృశ్యాలు చూశారా! రెండు పక్కల ఇళ్లు పూర్తిస్థాయిలో కొట్టేసినా.. మధ్యలో ఉన్నదాన్ని మాత్రం మెట్ల వరకే కొట్టి వదిలేశారు. ఒక కాలువ నిర్మాణం సరిగ్గా దానిముందు వరకు వచ్చి ఆగిపోయింది. ఈ దృశ్యాలు చూస్తే.. ఆ నిర్మాణాన్ని తొలగించకపోవడం వల్లే కాలువ నిర్మాణం ఆగిపోయినట్లు అనిపించడం లేదూ! స్థానికులు మాత్రం విస్తరణ పనుల్లో మార్కింగుల ప్రకారం అందరి ఇళ్లూ కొట్టేసినా.. ఆ నిర్మాణాన్ని మాత్రం పైరవీలు, పలుకుబడి కారణంగా టచ్ చేయలేకపోయారని ఆరోపిస్తున్నారు. విషయమేంటంటే.. శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డు విస్తరణలో భాగంగా నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ నుంచి కొత్తరోడ్డు వరకు ప్రస్తుతం విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్లాన్‌కు అనుగుణంగా రోడ్డుకు రెండువైపులా అధికారులు మార్కింగులు ఇచ్చి ఇళ్లు, షాపులు, ఇతర నిర్మాణాలను కొట్టించేసి మురుగు కాలువల నిర్మాణం చేపట్టారు. చురుగ్గా జరుగుతున్న ఆ పనులకు ఫొటోలోని ఇంటి వద్ద బ్రేక్ పడింది. ఉత్తరేశ్వరస్వామి ఆలయం`బలగ మెట్టు మధ్య ఉన్న ఈ షాపును మార్కింగ్ ప్రకారం తొలగించలేదని దానికి రెండువైపులా కూల్చివేతలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కాలువ నిర్మాణం అక్కడి వరకు వచ్చేసినా ఇంకా తొలగించకపోవడానికి కారణం ఈ షాపు యజమాని పలుకుబడేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఒత్తిళ్లకు లొంగి మౌనం వహించిన అధికారులు, ఇప్పుడు కాలువ నిర్మాణాన్ని దాని ముందు నుంచి ఒంపులు తిప్పుతారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే విస్తరణ పనులకు అర్థం లేకుండాపోతుంది. ఒత్తిళ్లకు లొంగలేదని చెప్పాలంటే ఇప్పటికే ఆ షాపును కూల్చివేసుండాలి. అది జరగలేదంటే.. కాలువకు అది అడ్డం పడిందనే అనుకోవాల్సి వస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page