పుష్కరం తర్వాత వెలుగుల సంబరం
- DV RAMANA

- 1 day ago
- 2 min read
బందరువానిపేట మత్స్యకారుల హర్షాతిరేకం
హుద్‌హుద్‌లో దెబ్బతిన్న త్రీఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్
మరమ్మతులు చేసినా కొన్నాళ్లకే మొరాయింపు
చేపల నిల్వకు ఐస్ తయారుచేసే ప్లాంట్ మూత
తాగునీరందించే డీశాలినేషన్ ప్లాంట్‌దీ అదే పరిస్థితి
ఎమ్మెల్యే శంకర్ చొరవతో ఎట్టకేలకు పునరుద్ధరణ

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పుష్కరకాలం పాటు ఆ గ్రామం కష్టాల చీకట్లలో మగ్గిపోయింది. దీనికి కారణం ప్రకతి వైపరీత్యమైతే.. మరో కారణం పాలకుల వైఫల్యం. ప్రకతి వైపరీత్యాలు కామన్. అందులోనూ తీరప్రాంత గ్రామాలు ప్రకతి ఒడిలోనే ఉంటాయి. వైపరీత్యాలు వాటికి కొత్తకాదు గానీ.. వాటిని ఎదుర్కోవడంలో సకాలంలో అందాల్సిన ప్రభుత్వ తోడ్పాటు అందకపోవడం వల్ల సుమారు 12 ఏళ్లపాటు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యానికి దూరమైన ఆ గ్రామం ఎట్టకేలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చొరవతో వెలుగులు సంతరించుకుంది. శ్రీకాకుళం రూరల్ మండలంలో సముద్ర తీరంలో ఉన్న మత్స్యకార గ్రామం బందరువానిపేట. సుమారు ఐదువేల జనాభాతో జిల్లాలో పెద్ద పంచాయతీల్లో ఒకటిగా ఉంది. గ్రామస్తులందరూ మత్సకారవర్గానికి చెందినవారే. వీరి ప్రధాన ఆదాయ వనరు సముద్రమే. వెలుగురేఖలు విచ్చుకోకముందే నిత్యం పడవలపై సముద్రంలోకి వెళ్లి చేపలవేట సాగించడం, వాటిని అమ్ముకుని ఆదాయం పొందడమే వారికి నిత్యకత్యం. అయితే తీరప్రాంతంలో ఉన్నందుకు ఆ గ్రామస్తులపై తరచూ ప్రకతి దాడి చేస్తుంటుంది. దాదాపు ప్రతి ఏటా తుపాన్లు సంభవించినప్పుడు వేట నిలిచిపోయి ఉపాధి కోల్పోవడం ఒకెత్తయితే.. పెను తుపాన్లు సంభవించినప్పుడు సముద్రుడు, ఈదురుగాలులు గ్రామాలపై విరుచుకుపడి విద్యుత్, రోడ్లు వంటి గ్రామాల్లోని మౌలిక వసతులను ఊడ్చివేయడం సర్వసాధారణం. అదేవిధంగా 2014లో సంభవించిన హుద్‌హుద్ తీవ్ర తుపాను ప్రభావంతో వీచిన ప్రచండ గాలుల తాకిడికి బందరువానిపేటలో 63 కేవీ సామర్థ్యం కలిగిన త్రీఫేజ్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతింది. ఆ పరిణామం మత్స్యకారుల జీవనాన్ని, ఉపాధిని దెబ్బతీసింది. కొన్నాళ్లకు ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగుచేసి గహాలకు వినియోగించే సింగిల్ ఫేజ్‌తోపాటు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. తర్వాత కాలంలో సంభవించిన తుపాన్లకు మళ్లీ త్రీఫేజ్ విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అయితే ఇన్నాళ్లూ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
మౌలిక వసతులకు దెబ్బ
గ్రామ మత్స్యకారులు నిత్యం వేటాడి తెచ్చే మత్స్య ఉత్పత్తులను అమ్ముకునేవరకు పాడైపోకుండా శీతల గిడ్డంగులు లేదా పెద్ద ఐస్ బాక్సుల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. గ్రామంలో శీతల గిడ్డంగి లేకపోవడంతో ఐస్ బాక్సులపైనే ఆధారపడుతున్నారు. వాటికి అవసరమైన ఐస్ తయారీకి గ్రామంలో ఐస్ ప్లాంట్ ఏర్పాటుకు ఒక వ్యక్తి ముందుకొచ్చి అన్ని సమకూర్చుకున్నాడు. అయితే త్రీఫేస్ సరఫరా పునరుద్ధరణ ఊసు లేకపోవడంతో వేచి చూసి చూసి ఆ వ్యక్తి ప్లాంట్‌ను ప్రారంభించకముందే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయాడు. మత్స్యకారులకు ఐస్ దూరప్రాంతాల నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం విశాఖ నుంచి ఒక వ్యక్తి గ్రామానికి ఐస్ సరఫరా చేస్తున్నాడు. ఇక మూడువైపులా సముద్రం ఉన్న బందరువానిపేట గ్రామంలో తాగునీటి సమస్య ఉండేది. భూగర్భ జలాల కోసం ఎన్నిచోట్ల, ఎంత లోతుకు తవ్వినా ఉప్పునీరు తప్ప మంచినీరు లభించేది కాదు. దాంతో ఉప్పునీటిని శుద్ధి చేసి తాగునీరుగా మార్చి సరఫరా చేసేందుకు వీలుగా 2017లో డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అది నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైనా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా మాత్రం పునరుద్ధరణ కాలేదు. ఫలితంగా ఆ ప్లాంట్ ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఫలితంగా గ్రామస్తుల తాగునీటి సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
గ్రామంలో ఆనందోత్సాహాలు
ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే గొండు శంకర్ అక్కడి సమస్య తెలుసుకుని తనను గెలిపిస్తే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఎన్నికైన తర్వాత దానిపై దష్టి సారించారు. విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపి, ఒత్తిడి తెచ్చి 63 కేవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించి త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను సమారు 12 ఏళ్ల తర్వాత పునరుద్ధరించడంలో విజయం సాధించారు. దీనివల్ల తాగునీరు, ఐస్ సమస్యలు కూడా పరిష్కారమవుతాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. దీర్ఘకాల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే శంకర్‌కు కతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, గ్రామపెద్దలతో పాటు పాల్గొన్న ప్రజలు సంబరాలు చేసుకున్నారు.






Comments