కాలువలన్నీ మనవే.. కప్పెయ్!
- SATYAM DAILY
- 10 hours ago
- 2 min read

(సత్యంన్యూస్, నరసన్నపేట)
స్వచ్ఛ ఆంధ్ర ` స్వర్ణ ఆంధ్ర అంటే.. శ్రీకాకుళం జిల్లా కేంద్రమేనా? మరోచోట అమలు చేయక్కర్లేదా?
తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడమంటే.. కార్పొరేషన్ పరిధికే పరిమితమా? పంచాయతీల్లో అవసరంలేదా?
రోడ్డు మీద గార్బెజ్ డస్ట్‌బిన్‌లు పెట్టి, అందులో స్థానికులు, వ్యాపార సముదాయాల నుంచి చెత్త వేస్తే.. పంచాయతీ సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలించే ఏర్పాట్లు మేజర్ పంచాయతీల్లో ఉండక్కర్లేదా?

.. ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానం మాత్రం ఉండదు. నరసన్నపేట మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చేస్తున్నామంటూ వైకాపా అధికారంలో ఉన్నప్ప్పుడు పెద్ద తతంగమే నడిపింది. మొదటి దానికి మొగుడు లేడు.. కడదానికి కల్యాణమంటే ఇదేనేమో? మేజర్ పంచాయతీలో మెయిన్ రోడ్డు మీద చెత్తను క్లీన్ చేయడం చేతకావడంలేదు కానీ, సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని ప్రకటనలివ్వడం మాత్రం విడ్డూరంగా ఉంది. ఆమధ్య నరసన్నపేట మెయిన్ రోడ్డును విస్తరించారు. అందులో పనిగా రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున కాలువలు నిర్మించారు. అయితే ఆ కాలువలన్నీ ఇప్ప్పుడు పూర్తిగా ఆక్రమించేశారు. కాలువలు దాటి వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లడానికి ఒకటో రెండో సిమ్మెంట్ పలకలు వేసుకుంటే సరిపోతుంది. ఏకంగా కాలువే లేకుండా చేసేశారు. దీంతో ఏకంగా మురుగు ప్రవహించకుండా నిల్వ ఉండిపోతుంది. కాలువలను కలిపేసి ప్లాట్‌ఫారమ్‌లుగా మార్చేశారు. ఆమధ్య ఓ ఫంక్షన్‌హాల్ కమ్ హాటల్ ప్రభుత్వ స్థలాన్ని తమ పార్కింగ్ ప్లేస్‌గా ఎలా వాడుకుంటుందో.. ‘పార్కింగ్ సరే.. బోరేదీ?’ శీర్షికన ‘సత్యం’ కథనం ప్రచురించడం, దానికి పేట ప్రజల్లో స్పందన వచ్చిన విషయం పాఠకులకు విదితమే. అయితే ఈ షాపు ఓనర్, దాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి ఇద్దరూ రాజకీయంగా, ఆర్థికంగా బలవంతులని, వారి జోలికి వెళ్లకపోవడం బెటరంటూ ఫిర్యాదు చేసినవారిని భయపెట్టడం నరసన్నపేట ఈవో వంతయింది తప్ప.. జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఈవో ప్రజారోగ్యం కోసం కనీసం రోడ్డు మీదకు రాకపోవడం విడ్డూరం. ఇప్ప్పుడు నరసన్నపేట మెయిన్ రోడ్డులో కాలువలన్నీ పలకలతో కప్పేసి ఉన్నాయి. ఎక్కడైనా అమాయకుడు పలకలు వేయకపోతే అది వాడి ఖర్మ అన్నట్టు పరిస్థితి మారింది. ఎందుకంటే.. రోడ్డు మీద చెత్త అంతా కాలువల్లోకి వచ్చి అక్కడే పేరుకుపోతుంది. ఈ కథనంతో పాటు అందిస్తున్న ఫొటోలు చూస్తుంటే.. పొరపాటున కూడా అక్కడి పంచాయతీ సిబ్బంది కాలువలు తీస్తున్నట్టు కనిపించడంలేదు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో 365 రోజులూ కాలువల్లో పూడికతీత కార్యక్రమం పెడితేనే దిక్కులేదు. ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండిపోతుంది. అలాంటిది నరసన్నపేటలో మెయిన్ రోడ్డు మీద కాలువల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక వీధుల్లో వేరేగా చెప్పనక్కర్లేదేమో? అంతెందుకు.. గట్టిగా వర్షం పడితే స్వయంగా పంచాయతీ ఆఫీసు, దానికి ఆనుకొని ఉన్న బజారు ఎప్ప్పుడూ మునిగిపోతూ ఉంటుంది. దీనికి కారణం కాలువలు లేకపోవడమో, నరసన్నపేట లోతట్టుగా ఉండటమో కాదు. కేవలం కాలువలు ఆక్రమణలకు గురికావడమే.






Comments