top of page

కథలో బంగారం ఉందా... సమంతే బంగారమా?

  • Guest Writer
  • 3 hours ago
  • 4 min read

కథ 1980-90ల కాలంలో మొదలవుతుంది. అనిరుధ్ (దిగంత్ మాంచాలే) అలియాస్ హనీ ఓ డాక్టర్. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా, వాళ్ల ఇష్టానికి విరుద్ధంగా స్వర్ణ (సమంత)ను లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చేసుకుని ఏం చేస్తాడు? ఇంట్లో తంతారని భయపడి మూడేళ్ల పాటు ఫ్యామిలీకి దూరంగా చెక్కేస్తాడు. కట్ చేస్తే... చెల్లెలి పెళ్లి కుదరడంతో, తప్పనిసరై భార్యాసమేతంగా సొంత ఊరు ‘బల్లవరం’లో ల్యాండ్ అవుతాడు.

ఇక అనిరుధ్ తండ్రి (ఆనంద్) మామూలోడు కాదు, ఊళ్ళో పెద్ద పొలిటీషియన్. ఆచారాలు, పట్టింపులు ఎక్కువ ఉన్న పెద్ద కుటుంబం. అలాంటి ఇంట్లోకి వంటా వార్పూ రాని స్వర్ణ అడుగుపెడితే ఎలా ఉంటుంది? అందుకే, తనకు ఏమీ రాకపోయినా ఒక ఫ్రెండ్ సాయంతో అన్నీ వచ్చినట్లు తెగ నాటకాలు ఆడుతూ మేనేజ్ చేస్తూంటుంది. అత్తయ్య, మామయ్యలను ఇంప్రెస్ చేసి ‘ఉత్తమ కోడలు’ అవార్డు కొట్టేయాలని తెగ తాపత్రయపడిపోతుంటుంది.

ఇంట్లో ఈమె పడే కష్టాలు ఇలా ఉంటే, తోడికోడలు అనసూయ (శ్రీముఖి) ఊరుకుంటుందా? ‘ఈమెని ఎలాగైనా డామినేట్ చేయాలి’ అని రూల్స్ మారుస్తూ స్వర్ణపై మైండ్ గేమ్స్ ఆడుతుంటుంది. అటు చూస్తే మామగారికి లోకల్ ప్రత్యర్థి (శ్రీనివాస్ వడ్లమాని)తో రాజకీయంగా తీవ్రమైన వైరం నడుస్తుంటుంది. ఈ లోకల్ గోలలన్నీ మేనేజ్ చేయలేక మన స్వర్ణ లోపల ఏడుస్తూ, బయట నవ్వుతూ మేనేజ్ చేస్తుంటుంది.

జైలు నుండి వచ్చిన జంబలకిడి జారుమిఠాయి!

ఇక్కడి వరకు అంతా హోమ్లీ డ్రామాలా సాగుతుంటే, కథలోకి సడన్‌గా గన్‌లు, గ్యాంగ్‌స్టర్లు ఎంటరవుతారు. జైల్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాజీ సాయుధ నాయకుడు కరుణ (గుల్షన్ దేవయ్య) మనుషులు స్వర్ణను వెతుక్కుంటూ బల్లవరం వస్తారు. అచ్చం స్వర్ణలాగే ఉండే ‘ఝాన్సీ’ అనే అమ్మాయిని చంపేయమని కరుణ ఆర్డర్ వేస్తాడు. కానీ సీన్ రివర్స్! వచ్చినోడిని మన స్వర్ణే లేపేస్తుంది.

దాంతో జైల్లో ఉన్న కరుణ డైరెక్ట్‌గా రంగంలోకి దిగి, స్వర్ణను కలిసి షాక్ అవుతాడు. “నువ్వు పెళ్లి చేసుకున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నానే!” అంటూ సెంటిమెంట్ డైలాగులు కొట్టి... “ఫ్యామిలీని వదిలేసి నాతో వచ్చేయ్, లేదంటే అందరినీ లేపేస్తా” అని కండిషన్ పెట్టి వార్నింగ్ ఇస్తాడు.

ఇంతకీ అసలు ట్విస్ట్ ఏంటి?

అసలు అడవిలో గన్ను పట్టుకుని తిరిగిన నక్సలైట్ తరహా లీడర్ ‘ఝాన్సీ’.. అత్తగారింట్లో అప్పడాలు వత్తుతున్న ‘స్వర్ణ’ ఒక్కరేనా? కరుణకు, ఈమెకు ఉన్న పాత కథ ఏంటి? తన గతం తెలిసిపోతే ఫ్యామిలీ దూరమవుతుందని భయపడే స్వర్ణ, కరుణ బారి నుండి తన భర్తను, అత్తగారింటిని ఎలా కాపాడుకుంది? గన్ పట్టుకోవాల్సిన చేతులతో గరిటె పట్టిన ఈ ‘ఝాన్సీలక్ష్మీబాయి’ తన ఫ్యామిలీ కోసం చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగిలిన సినిమా!

విశ్లేషణ

మన తెలుగు కమర్షియల్ సినిమాల్లో చాలా కాలంగా సక్సెస్ అవుతూ రిపీట్ అవుతూ వస్తున్న ఒక బలమైన టెంప్లేట్ ఉంటుంది. బయటకు సాధారణంగా కనిపించే వ్యక్తికి ఒక భయంకరమైన గతం ఉంటుంది. ఆ గతాన్ని దాచిపెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. కానీ ఒకరోజు ఆ గతమే అతడిని వెతుక్కుంటూ వస్తుంది.

బాషా, అతడు, ఇంద్ర, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, ... ఇలా ఎన్నో సినిమాలు ఈ ఫార్ములాతో వచ్చాయి. దానికి సమంత నటించిన ఫ్యామిలి మ్యాన్ 2 టెక్నిక్ ని కలిపి వండిన కథ ఇది. ఓ రకంగా ఫ్యామిలీ ఉమెన్ అని వెబ్ సీరిస్ తీయదగ్గ కథ ఇది.

కథా పరంగా...

Every story has been told before. The challenge is in how you tell it. రచయిత Robert McKee చెప్పిన మాట ఇక్కడ గుర్తుకు వస్తుంది. ‘మా ఇంటి బంగారం’ కూడా ఇదే కథ చెబుతుంది. కానీ ఒక చిన్న మార్పుతో. హీరో స్థానంలో హీరోయిన్‌ను పెట్టారు. అదే ఈ సినిమా బలమైన పాయింట్. ఈ స్క్రిప్టులో బెస్ట్ ఐడియా కూడా ఇదే. ఒకప్పుడు తుపాకీ పట్టుకుని తిరిగిన అమ్మాయి... ఇప్పుడు అత్తగారి ముందు తలొంచుకుని తులసి మొక్కకు పూజ చేయాల్సి రావడం. ఉమ్మడి కుటుంబంలో ఒదిగిపోవడానికి కష్టపడటం. ఈ కాన్‌ట్రాస్ట్‌లోనే సినిమా మొత్తం హాస్యం, డ్రామా, ఎమోషన్ పుడతాయి.

సినిమా ఫస్టాఫ్ ఉన్నంతలో బాగా వర్కవుట్ అవటానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే అక్కడ కథ పెద్దగా ముందుకు వెళ్లదు. కానీ పాత్ర ముందుకు వెళ్తుంది. స్వర్ణ అనే వ్యక్తిని ప్రేక్షకుడు తెలుసుకుంటాడు. ఆమె అబద్ధాలు, ఆమె భయాలు, ఆమె ఇబ్బందులు, ఆమె ప్రయత్నాలు నవ్విస్తూనే కనెక్ట్ అవుతాయి. ఒక మంచి స్క్రీన్‌ప్లేలో “ Plot follows Character” అనే సూత్రం ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో అదే జరుగుతుంది. సినిమా ఇక్కడ యాక్షన్ మీద కాకుండా “సిట్యుయేషన” మీద నడుస్తుంది. అందుకే తులసి పూజ సీన్, వంట సీన్లు, శ్రీముఖితో పోటీ పడే ఎపిసోడ్లు బాగా పనిచేస్తాయి. ఇవి కథను ముందుకు నడపకపోయినా, పాత్రను ప్రేక్షకుడికి దగ్గర చేస్తాయి.

కానీ సెకండాఫ్‌లో అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే చూసేవాడికి ఏం జరుగుతుందో, స్క్రీప్లే ఎలా వెళ్ళబోతోందో అర్దమైపోతుంది. దానికి విరుద్దంగా ఉంటే ఆసక్తిగా ఉంటుంది. దాని కోసం ఎదురుచూస్తాడు. అది జరగదు. దాంతో ఏదో మామూలు పాత సినిమా చూసినట్లు అనిపిస్తుంది. ఇలాంటి చోట కూడా కొత్త ఎపిసోడ్స్ ఉంటే వర్కవుట్ అవుతాయి. వాటికీ ఇక్కడ చోటు లేదు.

అలాగే ఒక స్క్రిప్ట్‌లో విలన్ ఎంత బలంగా ఉంటే ప్రధాన పాత్ర (అది హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు) అంత స్ట్రాంగ్ గా కనిపిస్తారు. ఇక్కడ నెగిటివ్ రోల్ అయిన కరుణ పాత్రను మొదట చాలా ప్రమాదకరంగా బిల్డ్ చేస్తారు. కానీ అతడు ఎందుకు స్వర్ణను అంతగా వెంబడిస్తున్నాడు?ఎందుకు ఆమెను వదిలేయలేకపోతున్నాడు?అతడి భావోద్వేగం ఏమిటి? అతడి మోజు ఎంత లోతుగా ఉంది? ఇవేవీ బలంగా రాయలేదు. దాంతో సంఘర్షణ కాగితం మీద ఉన్నంత బలంగా తెర మీద కనిపించదు.

Alfred Hitchcock ఒకసారి అన్నాడు: “ The more successful the villain, the more successful the picture .” అదే ఇక్కడ మిస్సైంది. సరే అదీ ప్రక్కన పెడితే..కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎందుకు నిరాశపరుస్తుంది? మొత్తం సినిమా ప్రేక్షకుడు ఒక ప్రశ్నతో కూర్చుంటాడు. “అసలు ఝాన్సీ ఎవరు?” . కానీ ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానం ఊహించినంత బలంగా ఉండదు. రహస్యాన్ని ఎక్కువసేపు దాచిపెట్టి చివర్లో సాధారణమైన సమాధానం ఇస్తే ప్రేక్షకుడికి చాలా వెలితిగా అనిపిస్తుంది. ఇదే ఇక్కడ జరిగింది. ఫ్లాష్‌బ్యాక్‌లో భావోద్వేగ బలం కన్నా సమాచారం ఎక్కువగా ఉంది. అందుకే ఆ భాగం ముగిసిన తర్వాత పెద్దగా ఇంపాక్ట్ మిగలదు.

సమంతే సినిమా

ఈ సినిమా గురించి చివరికి ఒకే మాట చెప్పాలి. స్క్రిప్ట్ కన్నా పాత్ర గుర్తుండిపోతుంది. అందుకు ప్రధాన కారణం సమంత. కామెడీ చేస్తుంది. యాక్షన్ చేస్తుంది. ఎమోషన్ పండిస్తుంది. ఒక సీన్‌లో అమాయక కోడలు. మరో సీన్‌లో భయంకరమైన యోధురాలు. ఈ రెండు షేడ్స్ మధ్య ఆమె చేసిన ట్రాన్సిషన్ సినిమాను చివరిదాకా చూసేలా చేస్తుంది. స్క్రిప్ట్‌లో ఉన్న గ్యాప్‌లను చాలా వరకు ఆమె పెర్ఫామెన్స్ కవర్ చేస్తుంది.

టెక్నికల్‌గా చూస్తే

‘మా ఇంటి బంగారం’కు సంతోష్ నారాయణన్ బీజీఎం ప్రధాన బలం. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ, 90ల పల్లెటూరి వాతావరణాన్ని సహజంగా తెరపై ఆవిష్కరించాయి. నందిని రెడ్డి టేకింగ్, రాజ్ నిడిమోరు-వసంత్ మరిగంటి రాసిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా.. ఫ్లాష్‌బ్యాక్, విలన్ ట్రాక్ మాత్రం ఆశించిన స్థాయికి చేరలేదు.

ఫైనల్ థాట్

మా ఇంటి బంగారం’లో కథ కొత్తది కాదు... కానీ కథను మోసిన భుజం కొత్తది. హీరోలకు అలవాటైన ‘భయంకరమైన గతం’ ఫార్ములాను సమంత భుజాన వేసుకోవడమే ఈ సినిమా ప్రత్యేకత. స్క్రిప్ట్‌లో పదును తక్కువ, విలన్‌లో బలం తక్కువ, ఫ్లాష్‌బ్యాక్‌లో లోతు తక్కువ. కానీ సమంతలో మాత్రం జోరు ఎక్కువ. అందుకే ఇది గుండెల్లో మిగిలిపోయే సినిమా కాకపోయినా... థియేటర్‌లో కూర్చోబెట్టే సినిమా. కథలో మెరుపులు తక్కువైనా, సమంతలో మెరుపు ఎక్కువ. అందుకే ‘మా ఇంటి బంగారం’ బంగారు పతకం గెలవకపోయినా... టైంపాస్ పరీక్షలో మాత్రం పాసవుతుంది. ఓకే ఛల్తాహై అనిపిస్తుంది. “ఒక నారీ వంద తుపాకులు” అని టైటిల్ పెట్టి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది..

- సూర్య ప్రకాష్ జోశ్యుల

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page