top of page

‘కనిష్క’ హంతకులు ఖలిస్తానీలే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 8 hours ago
  • 3 min read

ఎట్టకేలకు అంగీకరించిన కెనడా ప్రభుత్వం

41 ఏళ్ల నాటి విమానం పేలుడుపై నోరు విప్పిన నిఘా సంస్థ

ఆనాటి దుర్ఘటనలో గాలిలో కలిసిన 329 ప్రాణాలు

భారత్‌ను కాదని నిందితులకు దన్నుగా నిలిచిన అక్కడి సర్కారు

ఇన్నాళ్లకు ప్రభుత్వం.. దాని స్వరం మారాయి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

‘1985 జూన్ 23న కెనడా కేంద్రంగా పని చేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు పెట్టిన బాంబు పేల్చడం వల్లే ఎయిర్ ఇండియాకు చెందిన కనిష్క విమానం గాల్లోనే పూర్తిగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న 329 మంది ప్రాణాలు మంటలు, గాల్లో కలిసిపోయాయి’..

..కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎసఐఎస్) ఈ నెల 23న సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు సారాంశమిది.

ఇది చూసి.. ఎప్పుడో జరిగిపోయినదానికి ఇప్పుడు బాజాలెందుకు అనిపించవచ్చు. కానీ ఇది చిన్న విషయం కాదు. 329 ప్రాణాలను గాల్లో కలిపేసిన అత్యంత పాశవిక చర్య. రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసిన దారుణ ఘటన. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలపాటు భారత్ చేస్తున్న వాదనలే నిజమని తేల్చిన ప్రకటన. నాటి ఖలిస్తానీ ఉగ్రవాదుల దురాగతాన్ని ఆలస్యమైనా లోకానికి చాటిన ఘటన. 41 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఎందుకు జరిగింది?? ఇంత ఆలస్యంగా కెనడా ఎందుకు వాస్తవాన్ని బయటపెట్టింది??? వివరాలు తెలుసుకోవాలంటే దాని మూలాల్లోకి వెళ్లాల్సిందే.

వేర్పాటువాదం వెర్రితలలు

1980 దశకానికి ముందు చాలా ఏళ్లుగా పంజాబ్‌లో వేర్పాటు వాదనలు తీవ్రంగా ఉండేవి. పంజాబ్‌ను భారత్ నుంచి విడదీసి ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం చేయాలన్న డిమాండ్‌తో వేర్పాటువాదులు చేసిన ఉద్యమం కాలక్రమంలో హింసామార్గంలోకి మళ్లింది. జర్నాయిల్‌సింగ్ బింద్రన్‌వాలే వంటి అతివాద యువనాయకుల చేరిక, బబ్బర్‌ఖల్సా వంటి అతివాద సంస్థల కారణంగా పంజాబ్‌లో ఉద్యమం ముసుగులో హింస, విధ్వంసాలు పెట్రేగిపోయాయి. ఇలాంటి వారందరికి కెనడా స్వర్గధామంగా మారింది. అక్కడి నుంచి ఉగ్రవాద నాయకులు ఇక్కడి అనుచరగణాలను ఉసిగొల్పేవారు. చివరికి బింద్రన్‌వాలే అమృత్‌సర్‌లోని పవితమ్రైన స్వర్ణ దేవాలయాన్ని కబళించడంతో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1983లో ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో స్వర్ణ దేవాలయంలో సైనికచర్య చేపట్టింది. ఆ ప్రత్యేక ఆపరేషన్‌లో బింద్రన్‌వాలే సహా దాదాపు ఖలిస్తానీ ఉగ్రవాదులందరూ హతమయ్యారు. స్వర్ణ దేవాలయం విముక్తి పొందింది. దాంతో దేశంలో ఖలిస్తానీ ఉద్యమం పూర్తిగా అంతరించిపోయి, పంజాబ్‌లో శాంతి నెలకొంది. అయితే కెనడాలో ఉండిపోయిన కొద్దిమంది ఖలిస్తానీ మద్దతుదారులు మాత్రం కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయినా ఆపరేషన్ బ్లూస్టార్‌కు ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం వేచి చూశారు. అక్కడి నుంచే భారత్‌ను చికాకుపరిచే చర్యలకు పాల్పడేవారు. అందులో భాగంగానే 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె రక్షణదళంలో ఉన్న సిక్కు బాడీగార్డులే కాల్చి చంపేశారు. అనంతరం 1985 జూన్ 23న కెనడా నుంచి లండన్ మీదుగా భారత్‌కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన కనిష్క విమానం ఐరిష్ కోస్ట్ వద్ద గాలిలోనే పేలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న 329 మంది ఈ దుర్ఘటనలో చనిపోయారు. వారిలో 268 మంది కెనడా పౌరులే కాగా 24 మంది భారతీయులు. చనిపోయిన కెనడా పౌరుల్లో కూడా ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే. అప్పటినుంచి ఈ ప్రమాదానికి కారకులు ఎవరన్నదానిపై భారత్, కెనడాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.

భారత వాదనలు బేఖాతరు

కనిష్క విమానాన్ని ఖలిస్థానీ ఉగ్రవాదులే సూట్‌కేసు బాంబులతో పేల్చేశారని భారతీయ సంస్థల దర్యాప్తులో తేలింది. అందుకు తగినట్లే ఉగ్రదాడి జరిగిన కొన్ని నెలలకు నిషేధిత బబ్బర్‌ఖల్సా ఉగ్రసంస్థకు చెందిన తల్వీందర్ సింగ్ పర్మార్, ఇంద్రజిత్ సింగ్ రియాత్‌లను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. పర్మార్‌పై భారత్‌లో అప్పటికే హత్య కేసులు ఉన్నాయి. కెనడాలో దాక్కున్న పర్మార్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది. కానీ ఆనాటి కెనడా ప్రధాని పిరె ట్రూడో భారత ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చారు. తల్వీందర్ సింగ్ పర్మార్‌ను వెనకేసుకువచ్చారు. ఇందర్‌జిత్‌సింగ్‌కు మాత్రమే 15 ఏళ్ల జైలు శిక్ష విధించి మిగిలినవారిని వదిలేశారు. విమాన ప్రమాదం జరగడానికి ముందే ఉగ్రవాదులు విమాన దాడులకు పాల్పడే అవకాశం ఉందని భారత నిఘావర్గాలు సమాచారం ఇచ్చినా కెనడా ప్రభుత్వం పట్టించుకోలేదు. కీలక ఆధారాలను సైతం కెనడా అధికారులు దాచేశారని ఆరోపణలున్నాయి. ప్రమాదంపై విచారణ జరిపిన జస్టిస్ జాన్ మేజర్ కమిషన్ కూడా కెనడా నిఘా విభాగాన్ని, పోలీసులను, అధికారులను తీవ్రంగా తప్పుపట్టింది. ఉగ్రవాదులు బాంబులు తయారు చేస్తున్నారనే సమాచారం ఉన్నా పిరె ఇలియట్ ట్రూడోకు ముందే తెలిసినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి భారత ప్రభుత్వం ఇందర్‌జిత్‌సింగ్ పర్మార్‌ను తమకు అప్పగించాలని 1982లోనే కెనడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ పిరె ట్రూడో ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అందుకు వారు చూపిన సాకు.. ఎలిజబెత్ రాణి హోదా! భారత్ ఎలిజబెత్ రాణిని కామన్వెల్త్ అధినేతగానే గుర్తిస్తున్నది తప్ప.. తమ దేశాధినేతగా గుర్తించటం లేదు కనుక భారత్, కెనడాల మధ్య కామన్వెల్త్ దేశాలకు వర్తించే నేరగాళ్ల అప్పగింత ఒప్పందం లేదని కెనడా ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశారు. కాగా పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి దొంగతనంగా అడుగుపెట్టిన పర్మార్ 1992లో పంజాబ్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. ఆనాటి కెనడా ప్రధాని పిరె ట్రూడో కుమారుడే ఇటీవలి వరకు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రుడో. తండ్రి మార్గంలోనే ఈయన కూడా ఖలిస్తానీలకు అండగా నిలిచారు.

నిజాన్ని దాచిన ట్రూడోలు

ఈ క్రమంలోనే 2023లో ఖలిస్తానీ వేర్పాటువాద నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనతో ఇరుదేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. నిజ్జర్ హత్య వెనక భారత నిఘా సంస్థ ఏజెంట్ల పాత్ర ఉందంటూ స్వయంగా నాటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు. వాటిని తీవ్రంగా ఖండించిన భారత్ తగిన ఆధారాలు చూపాలని అడిగితే ట్రూడ్ ప్రభుత్వం స్పందించలేదు. జస్టిన్ ట్రుడో తన మైనారిటీ ప్రభుత్వ మనుగడ కోసం ఖలిస్తానీ మద్దతుదారు జగ్మీత్‌సింగ్ నాయకుడుగా ఉన్న నేషనల్ డెమోక్రటిక్ పార్టీ మీద ఆధారపడ్డారు. ఆ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కెనడాలో ఖలీస్తానీలు బాహటంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నా ట్రూడో పట్టించుకోలేదు. సిక్కు ఉగ్రవాదులే విమానం పేల్చివేతకు కారణమని చెబుతూ వస్తున్న కెనడా ఇంతవరకు ఖలిస్తానీలను బాధ్యులుగా పేర్కొనకపోగా ఖలిస్తానీ నేతల హత్యల విషయంలో భారత్‌ను దోషిగా నిలిపేందుకు ప్రయత్నించింది. కాగా గత ఏడాది జస్టిన్ ట్రుడో రాజీనామా చేయగా ఆయన స్థానంలో మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రి అయ్యారు. భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాన గూఢచార సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ తొలిసారిగా 1985 నాటి విమానం పేల్చివేత ఘటనపై ఒక ప్రకటన చేసింది. దానికి ఖలిస్తానీలే బాధ్యులని తేల్చి చెప్పింది. కెనడా చరిత్రలో అది అత్యంత ప్రాణాంతక ఉగ్రదాడి అని సీఎసఐఎస్ పేర్కొంది. దీంతో ఇన్నేళ్లుగా భారత్ చేస్తున్న వాదనలను కెనడా అధికారికంగా అంగీకరించినట్లయింది. అలాగే ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా నేలపై పనిచేస్తున్నారన్న భారత వాదనకు బలం చేకూరింది. కెనడాలో ఉన్న ఖలిస్తానీ బబ్బర్‌ఖాల్సా ఉగ్రవాదులే కనిష్క విమానంలో సూట్‌కేసు బాంబు పెట్టారని ప్రకటించడం భారత్‌కు పెద్ద విజయంగా భావిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page