కలెక్షన్ సీట్ల కోసం జిల్లా ట్రెజరీలో గలాట
- BAGADI NARAYANARAO

- 3 days ago
- 2 min read
పోలీస్ స్టేషన్‌లో డీడీ, ఉద్యోగులు పరస్పరం ఫిర్యాదులు
కౌన్సిలింగ్‌తో పంచాయితీని చక్కదిద్దిన సీఐ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా ఖజానా శాఖలో ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంగా దండిగా సొమ్ములు వచ్చే ఏ1, ఏ2 పోస్టుల కోసం ఆ శాఖ డీడీ రవికుమార్, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. గత కొన్ని రోజులుగా కార్యాలయంలో ఈ రెండు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సీట్ల మార్పుల విషయంలో డీడీ, కార్యాలయ ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తుంది. డీడీ తనకు నిచ్చిన ఇద్దరిని ఆ పోస్టుల్లో స్థానచలనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను కార్యాలయంలో ఉద్యోగులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తనకు నచ్చిన ఇద్దరిని ఏ1, ఏ2 పోస్టుల్లో పెట్టి చక్రం తిప్పాలని డీడీ చేసిన ప్రయత్నాలను కొన్ని రోజులుగా ఉద్యోగులు అడ్డుకుంటూ వచ్చారు. దీంతో ఉద్యోగులను రెచ్చగొట్టి పోలీసు స్టేషన్ వరకు తీసుకువెళ్లాలని డీడీ మొదట్నించి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఉద్యోగులు తనను బెదిరించి, దాడికి దిగారని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు డీడీ వెళ్లి ఫిర్యాదు చేయడంతో జిల్లా కార్యాలయంలో అధికారి, ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం వెలుగులోకి వచ్చింది.
ఎస్టాబ్లిష్‌మెంట్‌లో నిuంధనలకు విరుద్ధంగా విభాగంలో ఉద్యోగులు సూచించిన వారిని ఆ రెండు స్థానాల్లో స్థానచలనం చేయాలని కోరుతున్నా పట్టించుకోకుండా డీడీ రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిసింది. ఏటీవో నోట్ ప్రకారం వ్యవహరించాల్సిన డీడీ వాటిని ఖాతరు చేయకుండా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ రెండు పోస్టులతో పాటు ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఎస్‌టీవో, ఏటీవో, అకౌంటెంట్ సంతకాలు లేకుండా ఫైల్స్‌పై డీడీ సంతకం పెట్టి అన్ని వ్యవహారాలను నడుపుతున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన ఉద్యోగులు ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉద్యోగులకు, విభాగం అధికారులకు తెలయకుండా ఏ1, ఏ2 పోస్టుల స్థానం చలనం చేయడాన్ని నిరసిస్తూ డీడీని సోమవారం ప్రశ్నించారు. ఉద్యోగులంతా డీడీ ఛాంబర్‌కి వెళ్లి ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఏ1, ఏ2 పోస్టుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. తక్షణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిపై డీడీ స్పందిస్తూ ఉద్యోగులను దూషించి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. కార్యాలయంలో 10 మంది ఉద్యోగులు తనపై దౌర్జన్యం చేసి దాడికి దిగారని సీఐ పైడపునాయుడికి ఫిర్యాదు చేశారు. డీడీ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే డీడీకి వ్యతిరేకంగా ఆయన ఆగడాలు, తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరుపై ఉద్యోగులంతా సీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ పైడపునాయుడు ఆయన ఛాంబర్‌లో డీడీ రవికుమార్, ఉద్యోగులను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. డీడీ నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు ఇవ్వడం, ఉద్యోగులంతా కలిసి డీడీ ఛాంబర్‌కు వెళ్లడాన్ని సీఐ సీరియస్‌గా పరిగణించి ఇరువురిని సుతిమెత్తగా హెచ్చరించి ఫిర్యాదులను పక్కన పెట్టి పంచాయితీని చక్కదిద్దారు. శాఖాపరమైన సమస్య ఉంటే ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని ఇరువురికి సూచించారు.






Comments