కలుషిత నిర్వాకం.. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం
- Prasad Satyam
- 5 hours ago
- 3 min read
మెనూ సూపర్.. మెటీరియల్ వేస్ట్
గార కేజీబీవీలో బయటపడ్డ అసలు రంగు
నలుగురు సస్పెండ్.. ఇద్దరు వెండర్లు బ్లాక్‌లిస్ట్
ఇంకా పాత వాసనలు వదిలించుకోని కేజీబీవీ ఎస్‌వోలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
“ఉదయం రాగిజావ.. బ్రేక్‌ఫాస్ట్ పూలీ, బంగాళాదుంప కూర.. మధ్యాహ్నం అన్నం, పప్ప్పు, చారు, గుడ్డు, వంకాయ`బంగాళాదుంప`శనగపప్ప్పు కూర, సాయంత్రం స్నాక్స్ కింద బెల్లం పాయసం.. రాత్రి అన్నం, చారు, వెజిటబుల్ కర్రీ..” ఇదీ ఒక కేజీబీవీలో మన జిల్లాలో అమలుచేసే మెనూ. ఇది సోమవారం నుంచి ఆదివారం వరకు కూరల్లో మార్పు తప్ప, మిగతాదంతా సేమ్ టు సేమ్. బాలికల విద్య కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఒకే కాంపౌండ్‌లో సదుపాయాలు కల్పిస్తూ చదివిస్తున్నా ఎక్కడికక్కడ సమగ్రశిక్షకు తలవంపులు వస్తున్నాయి.
“అన్నం ఉడకలేదు.. కూర మాడిపోయింది.. ఇడ్లీ ఉడకలేదు.. పాలు నీళ్లులా ఉన్నాయి..” ఇవీ పైన పేర్కొన్న మెనూకి ఫుడ్ కమిటీ మెంబర్స్ రాసిన రిపోర్టు. అన్నం ఉడకలేదన్నా, కూర మాడిపోయిందన్నా పట్టించుకోకుండా పురుగులు పట్టిన రాగిజావ, కాయల్లాంటి అరటిపళ్లు, పాచిపోయిన చికెన్ పెట్టడం వల్ల గార కేజీబీవీలో కొందరు విద్యార్థులు డయేరియా బారిన పడ్డారు. సోమవారం ఈ సంఘటన జరిగితే, తీరిగ్గా అక్కడి స్పెషలాఫీసర్ గురువారం ఉన్నతాధికారులకు రిపోర్టు చేశారు. దాని పర్యవసానమే అక్కడ నలుగుర్ని సస్పెండ్ చేస్తూ తాజాగా ఆదేశాలు విడుదలయ్యాయి.
అసలు కేజీబీవీల్లో ఏం జరుగుతోంది?
జిల్లాలో ఉన్న కేజీబీవీలన్నింటిలోనూ ఫుడ్‌కమిటీ ఉంటుంది. ఇందులో ప్రిన్సిపల్, విద్యార్థులు, అకౌంటెంట్, ఏఎనఎం, స్టాఫ్ మెంబర్లలో ఒకరు సభ్యులుగా ఉంటారు. ప్రతీరోజు రిజిస్టర్‌లో ఆ రోజు మెనూ రాస్తారు. దాన్ని తిన్నతర్వాత ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్ ఫుడ్‌కమిటీ రాస్తుంది. ఇందులోనే స్వయంగా విద్యార్థులు అన్నం ఉడకలేదని, కూరలు మాడిపోయాయని.. ఇలా అనేకసార్లు ఫిర్యాదు రాసినా గార కేజీబీవీలో ప్రిన్సిపాల్ గాని, హెడ్ కుక్ గాని ఏమాత్రం పట్టించుకోలేదు. దాని పర్యవసానమే కేజీబీవీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు డయేరియా బారిన పడ్డారు. వాస్తవానికి విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్, కుక్, ఏఎనఎం కూడా అక్కడ వండిన భోజనాన్ని తినాలి. దాని కోసం ఫొటోలు తీసి జీపీఆరఎస్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ ఫొటోల వరకు జరుగుతున్నట్టు కనిపిస్తున్నా ఎక్కడా మెనూ మీద ప్రిన్సిపాల్‌లు దృష్టి పెట్టినట్టు కనిపించడంలేదు. అన్నింటికీ మించి కేజీబీవీకి సరుకులు సప్లై చేసే వెండర్ ఎటువంటి సరుకులు ఇస్తున్నాడు? సరిపడా సప్లై చేస్తున్నాడా? లేదా? అనేది అకౌంటెంట్ చూడాలి. కానీ కేజీబీవీల్లో ప్రతీది కూడా పైసలతోనే ముడిపడి నడుస్తోంది. సరుకు నాణ్యతను మొదట పరిశీలించాల్సింది అకౌంటెంటే. అందులో ఎటువంటి తేడాలున్నా వెండర్‌ను వెనక్కు పంపాలి. అలాగే ప్రతి విద్యార్థికి ఇన్ని లీటర్ల పాలు, ఇన్ని కోడిగుడ్లు, ఇన్ని గ్రాము కూర అనే తలసరి లెక్కకు సరిపడా సరఫరా చేశారా? లేదా? అని చూడాల్సింది అకౌంటెంటే. అలాగే భోజనం చేసిన తర్వాత దాని నాణ్యత, రుచి ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్ పుస్తకంలో విద్యార్థులు రాసిన తర్వాత ఆ మేరకు హెడ్‌కుక్‌ను, మిగిలిన సిబ్బందిని సరిచేయాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్‌ది. ఇక్కడ వారిద్దరూ ఆ పని చేయలేదు. దాని ఫలితమే డయేరియా. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఇది వెలుగులోకి రావడం వల్ల సర్వశిక్ష ఉన్నతాధికారులు గార కేజీబీవీకి వెళ్లే నాటికి ఒక్క పారిశుధ్యం మినహా అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించింది. కానీ పురుగులు పట్టిన చోడిపిండితో రాగిజావ చేశారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అంటే.. అప్పటికే ఎన్నాళ్లుగానో మిగిలిపోయిన పిండిని బయట పారబోయకుండా, లేదా వెండర్‌కు వెనక్కు ఇవ్వకుండా విద్యార్థులకు రాగిజావ చేసి ఇచ్చేశారన్నమాట. అలాగే అరటిపళ్లు కూడా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. విద్యార్థులు తినే డైనింగ్ టేబుల్ మీదే పూరీలు, చపాతీలు ఒత్తడం, ముడు పూటలూ క్లీన్ చేయాల్సిన చోట రోజుకు ఒక్కసారే క్లీన్ చేయడం వంటివి బయటపడ్డాయి.
గార కేజీబీవీకి సరుకులు సరఫరా చేస్తున్న వెండర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. వీరు జిల్లాలో ఎన్ని కేజీబీవీలకు మెటీరియల్ సప్లై చేస్తున్నారో అన్నిచోట్లా నిలుపుదల చేయాలని ఆదేశించారు. వాస్తవానికి వెండర్లకు, సమగ్రశిక్షకు అవినాభావ సంబంధం భగవంతునికి`అంబికా దర్బార్uత్తికి ఉన్నదానికంటే బలమైనది. కేజీబీవీకి నాణ్యత లేని అరకొర సరుకులు సరఫరా చేయడం, దానివల్ల మిగిలిన సొమ్మును కేజీబీవీ స్పెషలాఫీసర్లకు ఇవ్వడం, అందులో కొంత పర్సంటేజ్ సమగ్రశిక్ష కార్యాలయానికి పంచడం వంటివి ఎప్పట్నుంచో జరుగుతున్న తంతు. ఇన్నాళ్లూ ఫుడ్‌కమిటీలు కాగితం మీదే ఉండి పని చేయకపోవడం, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ కింద బ్యాడ్ అని ఇచ్చినా పట్టించుకోపోవడంతో కేజీబీవీల్లో ఇలాంటి సంఘటనలు బయటపడలేదు. కానీ ఇప్ప్పుడు పరిస్థితులు మారాయి, పద్ధతులు మారలేదు. ఎప్పటికప్ప్పుడు జీసీడీవోలు కేజీబీవీలను పరిశీలిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. కానీ అక్కడ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందో విద్యార్థులతో అడిగి తెలుసుకోవడంలేదు. ఒక్కసారి ఫుడ్ మీద విద్యార్థులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసివుంటే గారలో డయేరియా సంభవించి ఉండేది కాదు. స్టాక్ రిజిస్టర్ చూడటం, సవ్యంగా ఉందని సంతకం పెట్టి రావడంతో సమగ్రశిక్షకు నెలవారీ మాముళ్లు అందిపోతున్నాయి. ఇక్కడ ఏపీసీగా పప్పల వేణుగోపాలరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కడికక్కడ ఫుడ్, పర్చేజ్ కమిటీలను బలోపేతం చేశారు. కానీ ఇంకా పాత వాసనలు పోని వెండర్లు, ఎల్‌వోలు కలిసి గతం మాదిరిగానే కేజీబీవీలను నడపాలని చూస్తున్నారు. దాని ఫలితమే ఇప్ప్పుడు నలుగురి సస్పెన్షన్. విచారణ పెండింగ్‌లో ఉండటం వల్ల వీరు నలుగుర్నీ ప్రస్తుతానికి తప్పించారు. శ్రీకాకుళం కేజీబీవీల చరిత్రలో ఇదొక మంచి పరిణామమే. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఒక కేజీబీవీ నుంచి ఏరికోరి ఎస్‌వోను గారకు గతంలో బదిలీ చేశారు. ఆ సమయంలోనే పొందూరు, గార కేజీబీవీలు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇప్ప్పుడు ఆ ఎస్‌వోనే సస్పెండ్ అయ్యారు.






Comments