top of page

పాముల ఫారాలు.. స్నేక్ విలేజ్‌లు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 hours ago
  • 2 min read

  • చైనాలో దశాబ్దాలుగా వర్థిల్లుతున్న సర్పాల పెంపకం

  • పాము చర్మం, విషానికి అంతర్జాతీయంగా డిమాండ్

  • వాటి ద్వారా రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు

  • చైనీయుల ఆహారంలోనూ దానిది ప్రత్యేక స్థానం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

మనం పామును దేవతగా, దేవుడిగా పూజిస్తాం. కానీ అదే పాము మన సమీపంలోకి వస్తే చాలు.. హడలి చస్తాం.. ఆమడదూరం పారిపోతాం. వీలేతే దాన్ని చంపేస్తాం.. లేదా స్నేక్ క్యాచర్స్‌ను పిలిపించి పట్టిస్తాం. వారు కూడా పట్టుకున్న పాములను అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టేస్తారు.

ఇక పాములు ఆడించి జీవించే కొన్ని తెగలు ఉన్నాయి. వీరు పాములను పట్టుకుని, వాటి కోరలు పీకేసి వీధుల్లో వాటిని ఆడిస్తూ వచ్చిన సొమ్ముతో పొట్టపోసుకుంటుంటారు.

వీటికి భిన్నంగా ఇటీవలి కాలంలో పాములతో అంతర్జాతీయ స్థాయిలో భారీ వ్యాపారం జరుగుతోంది. పాము చర్మాలు చెప్పులు, బ్యాగుల తయారీకి, వాటి విషం ఔషధాల తయారీలోనూ ఉపయోగపడుతుంది. దాంతో ఆయా కంపెనీలు వీటి కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేస్తుంటాయి. అయితే జంతు సంరక్షణ చట్టాల ప్రకారం పాములను చంపడం నేరంగా పరిగణించడం పాముల స్మగ్లింగ్‌కు ఊతం ఇస్తున్నది. ఇదే కాకుండా అనేక దేశాల్లో పాము మాంసంతో చేసిన వంటకాలను ఆహారంగా స్వీకరిస్తుంటారు. చైనా కూడా అటువంటి దేశాల్లో ఒకటి. అయితే ఈ అవసరాలన్నింటికీ పెద్దసంఖ్యలో పాములు అవసరం. ఇందుకోసం చైనాలో పెద్దసంఖ్యలో పాములను పెంచి, అమ్ముతుంటారు. మనదేశంలో కోళ్ల పెంపకానికి పౌల్ట్రీఫారాలు నిర్వహిస్తున్న మాదిరిగానే చైనాలో పాముల పౌల్ట్రీలు నడుపుతుంటారు. ఈమధ్య ఆ దేశంలో సంభవించిన వర్షాలు, వరదల్లో అటువంటి కేంద్రాల నుంచి వందలాది పాములు కొట్టుకుపోయి జనావాసాల్లోకి చేరడంతో పాముల పౌల్ట్రీల విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.

ఇవే స్నేక్ విలేజ్‌లు

రకరకాల అవసరాల కోసం చైనాలోని చాలా ప్రాంతాల్లో పాములను ప్రత్యేకంగా పెంచే స్నేక్ ఫారాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. వీటిలో వేల సంఖ్యలో పాములను పెంచుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ధాటికి కొట్టుకువచ్చి జనావాసాలకు చేరిన వాటిలో చాలావరకు విషపూరిత పాములు ఉండటం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఆ విషయం పక్కన పెడితే.. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పాముల పెంపకం ప్రత్యేకమైన వృత్తిగా మారింది. ముఖ్యంగా జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జిసికియావో ప్రాంతం పాముల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. దీన్ని చాలా మంది స్నేక్ విలేజ్‌గా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు తరతరాలుగా పాములను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. కోబ్రాలు, వైపర్లు, పైథాన్, క్రైట్, ర్యాట్ స్నేక్ వంటి పలు రకాల సర్పాలను ప్రత్యేక ఫారాల్లో ఉంచి పెంచుతారు. వాటిని విక్రయించడం ద్వారా ఏటా కోట్లు సంపాదిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ప్రతి వ్యక్తి 30వేల కంటే ఎక్కువ పాములను పెంచుతున్నారని అంచనా. వీటి నుంచి విషం తీసి ఔషధ కంపెనీలకు అమ్ముతుంటారు. ఒక లీటరు విషం రూ. 3.5 కోట్లు వరకు ఉంటుంది. దక్షిణ చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతం కూడా పాముల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. ఇటీవల వరదల కారణంగా పాములు బయటకు వచ్చిన ఘటన కూడా ఈ ప్రాంతంలోని ఓ పాముల కేంద్రంలోనే జరిగినట్లు సమాచారం. చైనాలో సంప్రదాయ ఔషధ పరిశ్రమకు ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా ఉన్న గ్వాంగ్‌డాంగ్ ప్రాంతం కూడా పాము ఉత్పత్తులు, ఔషధ వినియోగాలకు సంబంధించిన వ్యాపారాలకు ప్రసిద్ధి చెందింది. వేడి, తేమతో కూడిన వాతావరణం కొన్ని రకాల సర్పాలు జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. అటువంటి వాతావరణం ఉన్నందునే ఈ ప్రాంతాల్లో పాముల పెంపకం, వ్యాపారం వృద్ధి చెందాయి.

భద్రతపై నిరంతరం టెన్షన్

పాముల పెంపకం వెనుక ప్రధానంగా ఔషధ పరిశ్రమ, పరిశోధన రంగాల అవసరాలు ఉన్నాయి. పాము విషాన్ని శాస్త్రీయ పరిశోధనలు, యాంటీ వీనం మందుల తయారీకి ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాము చర్మానికి డిమాండ్ ఉంటుంది. దాంతో పలు రకాల లెదర్ ఉత్పత్తులు తయారు చేస్తారు. పాములను ఆహారంగా కూడా వినియోగించే సంప్రదాయం కూడా ఉంది. దీనివల్లే పాముల పెంపకం ప్రత్యేక మార్కెట్‌గా అభివృద్ధి చెందింది. అయితే విషసర్పాలను పెద్ద సంఖ్యలో ఒకేచోట పెంచడం ఎప్పుడూ ప్రమాదకరమే. భారీ వర్షాలు, వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఫారాల భద్రతా వ్యవస్థలు దెబ్బతింటే పరిస్థితి అదుపు తప్పుతుంది. తాజాగా జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. అయితే విషం సేకరించే ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైనది కావడంతో దానికి ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అవసరం ఉంటుంది. పెంపక కేంద్రాల్లో బలమైన రక్షణ గోడలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు, యాంటీ వీనం నిల్వలను అందుబాటులో ఉంచడం తప్పనిసరి. లేనిపక్షంలో పెంచిన విషసర్పాలే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page