సిక్కోలు టు సిడ్నీ... సింబా జైత్రయాత్ర
- DV RAMANA

- 6 hours ago
- 4 min read
ది లయన్ కింగ్ స్టేజ్ షోలో ఆర్య అద్భుత నటన
ప్రపంచ ప్రఖ్యాత డిస్నీ వరల్డ్ సంస్థలో అరుదైన అవకాశం
విద్యావేత్త సురంగి మోహనరావు మనవడే ఈ చిన్నోడు
మెల్‌బోర్న్‌లో చదువుకుంటూ సిడ్నీలో ప్రదర్శన
చదువుతోపాటు నటన, సంగీతం, డ్యాన్స్ రంగాల్లో ప్రజ్ఞ

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
మన సినిమాల్లో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు వేరయా.. అన్నట్లు ట్రీట్ చేస్తుంటారు. అలాగే ఆ సినిమాల్లో నటించే హీరోలను పాన్ ఇండియా హీరోలుగా అభిమానులు కీర్తిస్తుంటారు. అందుకే ఆ సినిమాల్లో అవకాశాల కోసం బడా హీరోలే ఎదురుచూసే పరిస్థితి ఉంది. ఈ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ పోటీ ఎలా ఉన్నా.. మనవారికి హాలీవుడ్ సినిమాల్లో అవకాశం అన్నది మాత్రం ఇప్పటికీ బ్రహ్మ పదార్థమే. ఒకరిద్దరికి హాలీవుడ్‌లో ఒకటీఅరా అవకాశాలు వచ్చినా.. అవి చిన్న చిన్న పాత్రలే. బడా హీరోలకే అందని గగన కుసుమంలా మారిన అంతర్జాతీయ వినోద రంగంలో మనదేశం నుంచి అది కూడా మన రాష్ట్రంలోని శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఒక కుర్రాడు ప్రవేశించడమే పెద్ద ఘనత అనుకుంటే.. ఆ కుర్రాడు యువ సింహంలా గర్జిస్తూ షోల మీద షోలతో ఆపార ప్రేక్షకాదరణతో జైత్రయాత్ర సాగిస్తున్నాడు. విదేశాల్లో సినిమాలతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే వాటికంటే ఎక్కువ ఆదరణ పొందే స్టేజ్ షో(నాటకాలు)ల్లో నటిస్తూ ఈ కుర్రాడు అద్భుత ప్రతిభ కనబరుస్తూ ప్రేక్షకాదరణను విశేషంగా పొందుతున్నాడు. సినిమాలు వచ్చిన తర్వాత మన దేశంలో నాటకరంగం ఆదరణ కోల్పోయింది. కానీ విదేశాల్లో సినిమాల కంటే నాటకరంగానికే ఎక్కువ ఆదరణ ఉంది. విదేశీయులు స్టేజ్‌షోలనే అధికంగా వీక్షిస్తూ ఆస్వాదిస్తుంటారు. వందలకొద్దీ డాలర్లు పెట్టి టికెట్లు కొని మరీ తిలకిస్తుంటారు. అటువంటి స్టేజ్‌షోలలో మన సిక్కోలు చిన్నోడు అదరగొడుతూ దూసుకుపోతున్నాడు.

వినోద ప్రపంచం కింగ్ వాల్ట్ డిస్నీ
వాల్ట్ డిస్నీ సంస్థ గురించి తెలియనివారు బహుశా ఉండకపోవచ్చు. అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న ఈ సంస్థ అక్కడ డిస్నీ వరల్డ్ పేరుతో అక్కడ అతిపెద్ద వినోద ప్రపంచాన్ని నిర్మించడమే కాకుండా అదే బ్యానర్‌పై హాలీవుడ్ సినిమాలు, చిన్నపిల్లల కోసం యానిమేషన్ సినిమాలు నిర్మించడమే కాకుండా మÖ్యజికల్స్ పేరుతో స్టేజ్‌షోలు కూడా అమెరికా, యÖరోపియన్ దేశాల్లో విరివిగా ప్రదర్శిస్తుంటుంది. అంతటి ప్రఖ్యాత డిస్నీ వరల్డ్ సంస్థ నిర్మించిన యానిమేషన్(కార్టూన్) సినిమాల్లో ‘ది లయన్ కింగ’ సనిమాది ప్రత్యేక స్థానం. ఇందులోని పాత్రలైన ముఫాసా, సింబా, స్కార్, తదితర పాత్రలు మన పిల్లలకు కూడా కరతలామలకం. ఇవి ఎంతగా పిల్లల మైండ్లలోకి చొచ్చుకపోయాయంటూ.. ఆ పాత్రల పేర్లు పెట్టుకునే ఇళ్లలో ఆడుకుంటుంటారు. ది లయన్ కింగ్ సిరీస్‌లోని మొదటి సినిమా 1994లో వచ్చింది. ఆ తర్వాత వరుసగా 1998, 2019, 2024 సంవత్సరాల్లో వచ్చిన ఆ సిరీస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకుని నిర్మాణ సంస్థపై బిలయన్లకొద్దీ డాలర్ల వర్షం కురిపించాయి. అపార ఆదరణ పొందిన ఈ యానిమేషన్‌కు సినిమాలను మరోవైపు నాటకాలుగా కూడా విదేశాల్లోని ప్రముఖ నగరాల్లో ప్రదర్శిస్తుండగా వాటికి కూడా అదేస్థాయి ఆదరణ లభిస్తున్నది. ఆ క్రమంలో ప్రస్తుతం డిస్నీ వరల్డ్ మÖ్యజికల్ బ్యానర్‌పై ‘ది లయన్ కింగ్ జూనియర’ పేరుతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో నాటకం(స్టేజ్‌షో) ప్రదర్శిస్తున్నారు. ఈ స్టేజ్ షోలోనే మన సిక్కోలుకు చెందిన ఆర్య సురంగి(20) నటిస్తూ అదరగొడుతున్నాడు. సిడ్నీలోని క్యాపిటల్ థియేటర్‌లో ఈ ఏడాది జూన్ 29న ప్రారంభమైన ఈ స్టేజ్‌షో ప్రదర్శన నవంబర్ వరకు జరుగుతుంది. తర్వాత ఆస్ట్రేలియాకే చెందిన బ్రిస్బన్ నగరంలో ప్రదర్శిస్తారు. ఈ స్టేజ్‌షోలోనే ఆర్య సింబా పాత్రలో రాణిస్తున్నాడు. సిడ్నీలో వారానికి మÖడు షోలతో ఈ ప్రదర్శన దిగ్విజయంగా సాగుతోంది. దీన్ని ప్రదర్శిస్తున్న క్యాపిటల్ థియేటర్ సీటింగ్ కెపాసిటీ 2160 మంది కాగా.. ప్రతి షో హౌస్‌ఫుల్ అవుతోంది. సుమారు రూ.200 డాలర్ల టికెట్లు కొని మరీ ప్రేక్షకులు ప్రదర్శనను ఆస్వాదిస్తున్నారు.
ఎవరీ ఆర్య సురంగి?

ఆర్య పదహారణాల భారతీయుడు. అందులోనూ సొంత ఊరు శ్రీకాకుళం నగరం. ఈయనది మంచి నేపథ్యమున్న ప్రముఖ కుటుంబమే. ఈయన తాతగారు సురంగి మోహనరావు. సుదీర్ఘకాలం నుంచి విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు. లెక్ఛరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, శాంతినికేతన్ కళాశాల వ్యవస్థాపకుల్లో ఒకరిగా, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, సెట్‌శ్రీ సీఈవోగా, జిల్లాపరిషత్ సీఈవోగా జిల్లాలో బహుముఖ సేవలు అందించిన సురంగా మోహనరావు కుమారుడి కొడుకే ఇప్పుడు మన చెప్పుకొంటున్న హీరో ఆర్య సురంగి. మోహనరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె డాక్టర్ రాజావాణితోపాటు ఎంఎస్ చేసిన చిన్న కుమార్తె వాణిఇంద్రాణి కుటుంబాలు అమెరికాలో స్థిరపడ్డాయి. ఇక కుమారుడైన రాజభరత్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు. ఈ దంపతుల కుమారుడైన పదేళ్ల ఆర్య మÖడేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులతోపాటు మెల్‌బోర్న్‌కు వెళ్లిపోయాడు. అక్కడే ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచీ టీవీలు, సినిమాలపై ఆసక్తి ఎక్కువ. థియేటర్ ఆర్ట్స్‌పైనా మక్కువ చూపించేవాడు. ఒకవైపు చదువుకుంటూనే పియానో, తెలుగుతో కర్ణాటిక్ వోకల్ సంగీతం వంటి కోర్సులను ఆన్‌లైన్‌లో అభ్యసిస్తున్నారు. పాశ్యాత్య నృత్యరీతుల్లోనూ మంచి ప్రవేశం ఉంది. మరోవైపు చదువులోనూ మంచి ప్రతిభ చూపుతున్న ఆర్య ప్రతి పరీక్షలోనూ టాప్‌లో నిలుస్తున్నాడు.
అవకాశం ఎలా వచ్చిందంటే..
ఎక్కడ శ్రీకాకుళం.. ఎక్కడ సిడ్నీ.. ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ చదువుకోవడమే పెద్ద విశేషమనుకుంటే.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిస్నీ వరల్డ్ సంస్థ నిర్వహిస్తున్న స్టేజ్‌షోలో అవకాశం అందిపుచ్చుకోవడం చిన్న విషయం కాదు. అదెలా సాధ్యమైందంటే.. కొన్నేళ్ల నుంచి ఈ స్టేజ్‌షోను అమెరికా, యÖరోపియన్ నగరాల్లో ప్రదర్శిస్తున్న నిర్మాణసంస్థ ఎక్కడికక్కడ చాలామంది నటీనటులను మారుస్తుంటుంది. స్థానిక కళాకారులను చేర్చుకుంటుంది. ఆ క్రమంలో సిడ్నీలో ప్రదర్శన ప్రారంభానికి సుమారు ఆరు నెలల ముందే కొన్ని ప్రధాన పాత్రలకు మినహా మిగిలిన వాటికి స్థానిక కళాకారుల నుంచి ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టింది. దానికోసం ఆసక్తి ఉన్నవారు ఆడిషన్స్‌కు హాజరుకావాలంటూ నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిని చూసిన ఆర్య తల్లిదండ్రులు కుమారుడి ఆసక్తిని గమనించి ఆడిషన్స్‌కు తీసుకెళ్లారు. ఆడిషన్స్‌ను నిర్వహించిన డిస్నీ వరల్డ్ బృందం హాజరైన సుమారు 650 మందిని వాచకం, ముఖ కవళికలు, ఆహార్యం, భావప్రకటన, డైలాగ్ డెలివరీ తీరు వంటివన్నీ పరిశీలించి చివరికి సింబా పాత్రకు ఆర్యను ఎంపిక చేసింది. ఈ పాత్ర ఈ కథలో లీడ్ రోల్స్‌లో ఒకటి. ముఫాసా అన్నది అడవికి రాజైన సింహం పేరు. రాజు కావాలన్న దురాశతో ఉన్న ముఫాసా సోదరుడు స్కార్ కుట్రతో ముఫాసాను చంపేసి నీవల్లే చనిపోయాడని అతని కుమారుడైన చిన్నారి సింబాను నమ్మించి అడవి నుంచి పారిపోయేలా చేస్తాడు. తర్వాత తానే రాజు అయిపోతాడు. స్నేహితుల ద్వారా అసలు విషయం గ్రహించిన సింబా అడవికి తిరిగివచ్చి స్కార్‌ను తరిమికొట్టి రాజు అవుతాడు. అంటే ఈ కథలో సింబా పాత్ర లీడ్ రోల్ అనే చెప్పక తప్పదు.
ఫీజుతోపాటు వసతులు
సింబా పాత్రకు ఎంపికైన ఆర్యతో డిస్నీ వరల్డ్ సంస్థ ఆరు నెలల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాలంలో నెలకు 5600 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లిస్తారు. ఈ గడువు ముగిసిన తర్వాత ఇంకో నగరంలో ప్రదర్శన కోసం కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంటుంది. అది కాకుండా ప్రదర్శన కొనసాగినన్నాళ్లు సిడ్నీలో ఉండటానికి వసతి, చిన్నవాడైన ఆర్యతోపాటు మరో ఇద్దరికి ఉచిత సౌకర్యాలు కల్పిస్తారు. విమాన ఛార్జీలు, వీక్లీ మెంటెయినెన్స్ ఛార్జీలు కూడా అదనంగా చెల్లిస్తారు. మెల్‌బోర్న్‌లో చదువుకుంటున్న సింబా ఇన్ని రోజులు స్కూలుకు దూరమైతే చదువు పోతుంది కదా.. అన్న సందేహం తలెత్తవచ్చు. అయితే ఆర్య చదువుకుంటున్న స్కూలు యాజమాన్యం కూడా తమ విద్యార్థి డిస్నీ వరల్డ్ స్టేజ్‌షోకు ఎంపిక కావడానికి గర్వకారణంగా భావించి ఆర్యకు సెలవు మంజూరు చేయడమే కాకుండా.. అతని వెంట ఒక ట్యూటర్ నుంచి పంపించి చదువుకు ఆటంకం లేకుండా చొరవ తీసుకోవడం విశేషం. సినిమాల్లో నటన ఒకసారి, డైలాగులు ఇంకోసారి, పాటలు మరోసారి.. ఇలా దఫదఫాలుగా తీసి అన్నింటినీ తర్వాత కూర్చుతారు. కానీ స్టేజ్‌షోల్లో ఆ అవకాశం ఉండదు. పాత్రధారులే నటించడంతోపాటు పాటలు, డైలాగులు అన్ని స్టేజిపైనే చెప్పాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పు జరిగినా, తొట్రుపడినా వ్యక్తిగతంగానే కాకుండా.. స్టేజ్‌షో నిర్వహిస్తున్న నిర్మాణ సంస్థ పరువు కూడా పోతుంది. అటువంటి స్టేజ్‌షోలో ఆర్య అవకాశం పొంది రాణిస్తుండటం ప్రశంసనీయం. దీనికి ముందు హాంక్ జూనియర్, డిస్నీ జూనియర్, డేర్ టు డ్రీమ్స్ జూనియర్ వంటి పలు స్టేజ్‌షోల్లోనూ ఆర్య నటించి మెప్పించి సిక్కోలు సత్తాను సిడ్నీలో చాటుతున్నాడు.






Comments