మరణం ముంగిట ఖైదీల క్యూ!
- DV RAMANA

- 4 hours ago
- 3 min read
ఉరిశిక్షల అమలుల్లో అలవిమాలిన జాప్యం
దేశంలో పదేళ్లుగా 574 మంది నిరీక్షణ
న్యాయసమీక్ష, క్షమాభిక్ష వ్యవహారాలే కారణం
తలారీల కొరత, ఉరి వ్యవస్థల లేమి కూడా దోహదం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
నేరగాళ్లకు విధించే మరణశిక్ష అమలు విధానాల్లో ఒకటైన ఉరిని రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మెడకు తాడు బిగించి ప్రాణాలు పోయేవరకు వేలాడదీసే ఉరి విధానం అమానుషమని, అందువల్ల పద్ధతిని రద్దు చేసి.. విషపు ఇంజక్షన్లు ఇవ్వడం, కరెంటు షాక్ ఇవ్వడం వంటి ఇతర మార్గాల్లో మరణశిక్ష అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా వేసిన పిటిషన్‌పై రెండు రోజుల క్రితం విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉరి విధానం రద్దుకు తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. ఉరి వేయడం బాధాకరమే అయినా చట్టప్రకారం అది సమ్మతమేనని స్పష్టం చేసింది. అయితే ఉరి వేయడం శారీరకంగా అత్యంత బాధ కలిగిస్తుంది. కానీ ఉరిశిక్ష పడినా ఏళ్ల తరబడి అది అమలుకాక ఉరి కంటే చాలా బాధాకరమైన మానసిక వేదనను ఉరిశిక్ష పడిన ఖైదీలు, వారి కుటుంబాలు బాధపడుతున్నాయి. పలు కేసుల్లో కోర్టులు దోషులకు ఉరిశిక్షలు విధిస్తున్నా ఉన్నత న్యాయసమీక్ష కోరే అవకాశాలు వారికి ఉండటం, కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం, క్షమాభిక్షకు అప్పీళ్లు.. వాటిపై నిర్ణయాల్లో ఆలస్యం, వాటన్నింటికీ మించి ఉరి వేయాల్సిన తలయారీల కొరత, శిక్ష అమలుకు అవసరమైన ఉరికొయ్యలు వంటి ఏర్పాట్లు జైళ్లలో లేకపోవడం వంటివి ఉరిశిక్షల అమల్లో జాప్యానికి, ఉరికొయ్యపైకి ఎక్కేందుకు ఖైదీల బారులు పెరగడానికి కారణమవుతున్నాయి.
ఏటా పెరుగుతున్న ఖైదీలు
దేశంలో 2025 చివరినాటికి 574 మంది ఖైదీలు ఉరిశిక్ష అమలు కోసం నిరీక్షిస్తున్నారని నేర సంస్కరణల పరిరక్షణ సంస్థ ‘ది స్క్వేర్ సర్కిల్ క్లినిక’ విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక వెల్లడించింది. మరణం కోసం ఉరికొయ్యల ముందు బారులు తీరడం అత్యంత దయనీయ పరిస్థితిగా ఆ అధ్యయనం అభివర్ణించింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కోర్టులు 2016`25 మధ్య కాలంలో 1279 మంది ఖైదీలకు 1310 మరణశిక్షలు విధించాయి. అంటే కొందరు ఖైదీలకు ఒకటి కంటే ఎక్కువ మరణశిక్షలు విధించినట్లు లెక్క. వీటిలో 574 మంది ఖైదీలకు ఇంకా శిక్షలు అమలు కాలేదు. అయితే వీటిలో 70 కేసుల్లో(9.77 శాతం) మాత్రమే కింది కోర్టులు విధించిన శిక్షలను ధ్రువీకరించాయి. ఒక్క 2025లోనే సెషన్స్ కోర్టులు 94 కేసుల్లో 128 మందికి మరణశిక్ష విధించగా ఆ ఏడాదిలో హైకోర్టులు తాము విచారించిన కేసుల్లో 25 శాతం కంటే ఎక్కువ కేసుల్లో మరణశిక్షలను రద్దు చేసి నిందితులను నిర్దోషులుగా ప్రకటించగా, సుప్రీంకోర్టు తాను విచారించిన కేసుల్లో సగానికి పైగా నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. అదే సమయంలో వరుసగా మూడో సంవత్సరం కూడా సుప్రీంకోర్టు ఒక్క మరణశిక్షనూ ధ్రువీకరించలేదని నివేదికలో పేర్కొన్నారు.
ఏళ్లతరబడి జాప్యం
కింది కోర్టులు విధిస్తున్న మరణశిక్షల కేసులు ఆ తర్వాత దశలో న్యాయసమీక్షల్లో జరుగుతున్న జాప్యం కారణంగా ఏళ్ల తరబడి అమలుకు నోచుకోవడంలేదు.
దేశంలో 2016 నాటికి 400 మంది ఉరి ఖైదీలు వెయిటింగులో ఉండేవారు. గత పదేళ్లుగా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. 2022 చివరినాటికి ఈ సంఖ్య 544కు, 2024 నాటికి 564కు, 2025 నాటికి 574కు పెరిగింది.
రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 95 ఉరిశిక్షలు పెండింగులో ఉండగా, గుజరాత్‌లో 49, జార్ఖండ్, మహారాష్ట్రల్లో 45 చొప్పున, మధ్యప్రదేశ్‌లో 39, కర్ణాటకలో 32, బీహార్‌లో 27, పశ్చిమబెంగాల్‌లో 26 ఉరిశిక్షలు పెండింగులో ఉన్నాయి.
గత పదేళ్లలో 19 క్షమాభిక్ష పటిషన్లను తిరస్కరించిన రాష్ట్రపతి ఐదింటిని మాత్రమే ఆమోదించారు.
ఇక కేసుల పెండెన్సీ చూస్తే.. జమ్మూకశ్మీర్ పరిధిలో అత్యధిక జాప్యం జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో ఉరిశిక్ష అమలు వ్యవధి సగటున 11.53 ఏళ్లు (138 నెలలకు పైగా) ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
తలారీల కొరత
అన్ని న్యాయమార్గాలు మÖసుకుపోయి, శిక్ష అమలు తప్పని పరిస్థితుల్లో జాప్యం అనివార్యమవుతున్నది. దీనికి కారణం.. జైళ్లలో తలారీల కొరత, శిక్ష అమలు చేసే వ్యవస్థలు జైళ్లలో లేకపోవడమే. జైళ్లలో తలారీల పోస్టులు శాశ్వత ప్రాతిపదికన ఉండవు. ఎప్పుడోగానీ ఉరిశిక్షలు విధించరు.. విధించినా ఎప్పటికప్పుడు వాటిని అమలు చేసే పరిస్థితి లేదు. దాంతో అవసరమైనప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన తలారీల సేవలను వినియోగించుకోవడం జైళ్ల అధికారులకు పరిపాటిగా మారింది. ఖైదీని ఉరికొయ్యపైకి ఎక్కించి ఉరితాడు మెడకు బిగించి లాగడం కూడా తలారీల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృత్తిపరంగా అయినా ఒక మనిషిని స్వయంగా చంపడం తలారులుగా వ్యవహరించేవారిని నిరంతరం వేధిస్తుంది. దానికితోడు దీనికి ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి చేసే ఈ పని కోసం ఇంత కష్టపడటం, మానసిక ఆందోళన ఎందుకున్న ఉద్దేశంతో గతంలో ఉన్న తలారీల కుటుంబాలు వేరే వృత్తులు, ఉద్యోగాల్లోకి మారిపోయాయి. ప్రస్తుతానికి దేశంలో ఒకరిద్దరు తలారీలకు మించి లేరని తెలిసింది. దాంతో ఉరిశిక్ష అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఆయా జైళ్లలోని కిందిస్థాయి సిబ్బందికే కొద్దిరోజులు శిక్షణ ఇచ్చి వారిచేతే అమలు చేయిస్తున్నారని సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒకే ఒక తలారీ కుటుంబం ప్రస్తుతం ఉంది. ఆ కుటుంబానికి చెందిన పవన్‌కుమార్ ఇప్పటికి పార్ట్‌టైమ్ తలారీగా వ్యవహరిస్తున్నాడు. చుట్టుపక్కల రాష్ట్రాల జైళ్లలో ఉరిశిక్ష అమలు చేయాల్సి వస్తే అతన్నే తీసుకెళ్తున్నారని తెలిసింది. పవన్‌కుమార్ తండ్రి, తాత కూడా మీరట్ జైలులో తలారీ విధులు నిర్వహించేవారు. దీనికితోడు దేశంలోని మెజారిటీ జైళ్లలో ఉరిశిక్ష అమలుకు అవసరమైన ఉరికొయ్య, తదితర ఏర్పాట్లు లేవు. కొన్ని జైళ్లలో పాతకాలంనాటి ఉరికొయ్యలు ఉన్నప్పటికీ అవి అంత దృఢంగా ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వీటి కంటే న్యాయపరమైన వ్యవహారాలతోనే ఉరిశిక్షలు అమల్లో అధిక జాప్యం జరుగుతున్నదని చాలా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉరి విధానం రద్దు చేయకపోయినా.. కనీసం శిక్ష అమల్లో జాప్యాన్ని నివారించి, ఖైదీలు వారి కుటుంబాలకు మానసిక ఆందోళన లేకుండా చేయాల్సిన అవసరం ఉంది.






Comments