చెత్తే స్వీడన్ సంపద!
- DV RAMANA

- 5 hours ago
- 3 min read
దాన్ని వదిలించుకోలేక చాలా దేశాల తంటాలు
కానీ ఆ వ్యర్థాలనే దిగుమతి చేసుకుంటున్న చిన్న దేశం
దానికోసం ఆయా దేశాలే డబ్బు చెల్లిస్తున్న వైనం
ఆ చెత్తనే దేశంలో విద్యుత్, ఇతర అవసరాలకు వినియోగం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
మనం చెత్తను చాలా చిన్నచూపు చూస్తుంటాం. దాని నిర్వహణలో అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం. ఒకవైపు మన ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ఖర్చుతో చెత్తను పరిహరించి దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సరే.. మనం మాత్రం చెత్తను చెత్తలాగే హీనంగా చూస్తున్నాం. ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నాం. అయితే చెత్తను సరైన విధానంలో నిర్వహిస్తే చుట్టుపక్కల ప్రాంతాలను, దేశాన్ని వ్యాధుల రహితంగా తీర్చిదిద్ది ఆరోగ్య సమాజం నిర్మించడమే కాకుండా కాస్తో కూస్తో ఆదాయం కూడా సంపాదించవచ్చన్న విషయాన్ని విదేశాలను చూసి నేర్చుకోవచ్చు. చెత్త నిర్వహణ విధానాలను మార్చుకోవచ్చు. బహుశా వీటిని చూసే ఏమో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారీ అంటూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కేంద్రాలు నిర్మించింది. కానీ అది ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. దాదాపు రాష్ట్రంలోని అన్ని సంపద తయారీ కేంద్రాలు కార్యకలాపాలు లేక అలంకారప్రాయంగా మిగిలాయి. కానీ చెత్త నిర్వహణ, దాన్ని సద్వినియోగం చేసుకోవడం, సంపద సృష్టించడంలో ఒక చిన్న దేశం రికార్డులు సృష్టిస్తున్నది. అదే స్వీడన్. ప్రపంచంలో చెత్త నిర్వహణలో ఎస్టోనియా దేశం మొదటి స్థానంలో ఉంటే.. చెత్త నుంచి సంపద సృష్టించడంలో స్వీడన్ అగ్రస్థానంలో ఉండటం విశేషం.
పెద్ద దేశాలకే సాధ్యంకాని పని
మనదేశంలో ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ చెత్తకుండీలు ఏర్పాటు చేసినా.. అవి కళ్లెదురుగా కనిపిస్తున్నా సరే వాటిలో కాకుండా బయట చెత్త పారబోయడం మనవారి సివిక్ సెన్స్‌కు నిదర్శనం. ఆ.. చెత్తే కదా అన్న నిర్లక్ష్యం మనదేశాన్ని అపారిశుధ్యంలోనే మగ్గిపోయేలా చేస్తోంది. నదులు, సముద్రాలు, రోడ్లు, బస్సులు, రైళ్లు.. ఇలా చెత్త వేయడానికి ఏదీ అనర్హం కాదన్నట్లు వ్యవహరిస్తుంటాం. ప్రజల్లో చైతన్యం రానంతవరకు పరిశుభ్రత కార్యక్రమాలకు ప్రభుత్వాలు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదు. అందుకే వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు సంబంధించి ప్రపంచంలోని 177 దేశాల జాబితాలో మనదేశం చిట్టచివరి నుంచి రెండో స్థానంలో అంటే 176 వద్ద కునారిల్లుతోంది. చాలా చిన్న దేశమైన ఎస్టోనియా అత్యంత పరిశుభ్ర దేశంగా చిత్త నిర్వహణలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. గతంతో పోలిస్తే మన దేశం పరిస్థితి కాస్త మెరుగైనప్పటికీ.. అది చాలా నామమాత్రం. అప్పటికీ చెత్త నిర్వహణ మనదేశంలో ప్రధాన సమస్యగానే కొనసాగుతున్నది. ఘన వ్యర్థాలు, వ్యర్థజలాల నిర్వహణకు అనేక చట్టాలు తీసుకొచ్చి వ్యర్థజలాల శుద్ధీకరణ(వాటర్ ఎఫ్లూయెంట్) ప్లాంట్లు, ఘనవ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేసినా దేశంలో ఉత్పత్తి అవుతున్న చెత్తతో పోలిస్తే.. వీటి ఉత్పత్తికి తరలిస్తున్నది చాలా స్వల్పమనే చెప్పాలి. పైగా వీటికి ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. నగరాలు, పట్టణ శివార్లలో చెత్త కొండలు పేరుకుపోతున్నాయి. అయితే ప్రపంచంలోనే చెత్త నిర్వహణలో, అత్యంత పరిశుభ్రమైన దేశాల్లో ఐదో స్థానంలో ఉన్న స్వీడన్ మాత్రం డబ్బులు తీసుకుని మరీ టన్నుల కొద్దీ చెత్తను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఈ చెత్తతో అసలైన సంపద సృష్టిస్తోంది.
చెత్తను ఏం చేస్తారంటే..?
ఇతర దేశాల నుంచి టన్నుల కొద్దీ చెత్తను స్వీడన్ దిగుమతి చేసుకోవడానికి ప్రధాన కారణం ఆ దేశంలో ఉన్న అత్యాధునిక వేస్ట్ టు ఎనర్జీ (వ్యర్థాల నుంచి శక్తి) ప్లాంట్లు. ఈ బడా ఫ్యాక్టరీలు నడవడానికి చెత్తే ప్రధాన ముడిసరుకు. ఇతర దేశాలు నిరుపయోగంగా భావించే వ్యర్థాలనే ఉపయోగించి స్వీడన్‌వాసులు తమ దేశానికి అవసరమైన కరెంట్, హీట్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నారు. ప్రపంచంలో అత్యంత చలిగా ఉండే దేశాల్లో స్వీడన్ ఒకటి. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయి. అంత తీవ్రమైన చలిని అడ్డుకుని తమ ఇళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి వారు ఈ చెత్తనే ఆయుధంగా ఉపయోగిస్తారు. ఘన వ్యర్థాలను భారీ కొలిమిల్లో కాల్చడం ద్వారా పుట్టే అపారమైన వేడిని భూగర్భంలో ఏర్పాటు చేసిన పైపులైన్ నెట్‌వర్క్ ద్వారా నేరుగా దేశంలోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు సరఫరా చేస్తారు. దీనివల్ల కరెంటుతో పనిలేకుండానే ఇళ్లు ఎంతో వెచ్చగా ఉంటాయి. ఇది కాకుండా రీసైకిల్ చేయడానికి వీలుకాని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను దహనవాటికల్లో అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద మండిస్తారు. తద్వారా వెలువడే ఉష్ణశక్తిని విద్యుత్‌గా మార్చి దేశవ్యాప్తంగా ఇళ్లు, కార్యాలయాలకు సరఫరా చేస్తున్నారు. ఇక చెత్తను కాల్చిన తర్వాత మిగిలిన బూడిదను, ఇతర సూక్ష్మవ్యర్థాలను అత్యంత జాగ్రత్తగా వేరుచేస్తారు. వాటిని దృఢమైన రోడ్ల నిర్మాణంలోనూ, కొన్ని పరిశ్రమల్లో ముడిసరుకుగానూ వాడుతున్నారు. అంటే ఆ దేశంలో ఏ ఒక్క వస్తువూ వృథా కాదన్నమాట.
కాసుల వర్షం
చెత్తను ఈస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ సంపద సృష్టిస్తున్నందున స్వీడన్‌కు తమ దేశంలో ఉత్పత్తి అయ్యే చెత్త సరిపోవడంలేదు. దాంతో ఇతర దేశాల నుంచి చెత్తను భారీగా దిగుమతి చేసుకుంటున్నది. ఇది కూడా దానికి ఆదాయవనరుగా మారింది. తమ పట్టణాలు, నగరాల్లో చెత్తను పారబోసేందుకు స్థలాలు, డంపింగ్ యార్డులు లేక, పేరుకుపోతున్న చెత్తను ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న చాలా దేశాలకు స్వీడన్ ఒక ఆశాదీపంలా మారింది. చెత్తను తీసుకుంటున్నందుకు స్వీడన్‌కు ఎదురు డబ్బులు చెల్లిస్తున్నాయి. ఎలాగోలా చెత్త వదిలించుకుంటున్నామని ఆయా దేశాలు సంతోషిస్తుంటే.. ఇటు చూస్తే డబ్బుతో పాటు ఉచిత ఇంధనం, విద్యుత్ లభిస్తున్నందుకు స్వీడన్‌కు రెండువైపులా లాభం చేకూరుతోంది. అనేక దేశాల పాలిట సమస్యగా ఉన్న చెత్తను, స్వీడన్ తన పాలిట అక్షయపాత్రగా మార్చుకున్న తీరు అద్భుతం.






Comments