వలసెళ్లిన విమానం!
- DV RAMANA

- 3 hours ago
- 3 min read
అంతటా పొంగిపొర్లిన భావోద్వేగాలు
దశాబ్దాల సేవలకు తుది వీడ్కోలు
ఒక చరిత్రకు ముగింపు.. మరో చరిత్రకు శ్రీకారం
ఇక నేవీ సేవలకే విశాఖ పరిమితం
ఉత్తరాంధ్ర ప్రగతికి ఏఎసఆరఐ కొత్తరెక్కలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
నలభయ్యేళ్లకుపైగా ఈ విమానాశ్రయంలో సేవలు అందించాం.. ప్రతిఫలంగా భుక్తి పొందాం. ఇప్పుడు ఈ విమానాశ్రయం తరలిపోతున్నది. దాంతో మా రుణానుబంధం తీరిపోయింది.. అంటూ చెమర్చిన కళ్లతో పలువురు ఉద్యోగుల ఆవేదన.
`ఈ విమానాశ్రయం దశాబ్దాల పాటు మా ప్రయాణాలకు వారధిగా నిలిచింది. మా కలలను సాకారం చేసుకోవడానికి సహకరించింది. జీవన గమ్యస్థానాలకు సకాలంలో చేర్చింది. ఇప్పుడిది ఉనికి కోల్పోతున్నా.. మా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలమేనంటూ చివరి ప్రయాణికులు ఆత్మీయ స్పందన.
ఈ ప్రాంతానికి విమానం ఎగరడం, ల్యాండ్ అవ్వడం గురించి తెలియని రోజుల్లో విశాఖ విమానాశ్రయం ఆ అనుభవాన్ని, అనుభూతిని మాకు అందించింది. మా ఇళ్లపై నుంచి.. మా తలల మీదుగా ఎగురుతూ విమనాశ్రయంలో ల్యాండ్ అవుతున్న దృశ్యాలు మాకు ఎప్పటికీ నిత్యనూతనమే.. ఆహ్లాదకరమే. ఇక నుంచి ఆ దృశ్యాలు కనిపించవంటూ.. చుట్టుపక్కల గృహాలవారి నిటూర్పు
విమాన ప్రయాణమే గొప్ప అనుభూతి. అందులోనూ విశాఖ విమానాశ్రయం నుంచి ప్రయాణమైతే.. విమానం టేకాఫ్ తీసుకుంటున్నప్పడు.. ల్యాండ్ అవుతున్నప్పుడు అలా సముద్రం మీదుగా ప్రయాణించే క్రమంలో కనిపించే పైన గాలిలో మనం.. కింద అపారమైన నీలిసంద్రం.. దానికి ఆనుకుని ఉన్న నేవీ, పోర్టు తదితర దృశ్యాలు.. అన్నింటికీ మించి విశాఖ నగరం అందాలు.. ఓహ్ .. ఆ దృశ్యాలు ఎన్నటికీ అపురూపమే. ఇప్పుడవన్నీ గత వైభవంగా మిగిలిపోతాయని చుట్టుపక్కలవారి నిర్వేదం.
ఇలా ఒకటేమిటి.. ఆదివారం ఉదయం నుంచి విశాఖ విమానాశ్రయంలో కనిపించిన దృశ్యాలన్నీ ఇవే. విశాఖతోనూ, ఈ విమానాశ్రయంతోనూ అనుబంధం ఉన్న వారిందరి మనసులను మెలిపెట్టేసేవే. సుదీర్ఘ సేవలు అందించి ప్రభుత్వ సర్వీసు నుంచి ఒక ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పుడు.. అతని చుట్టూ ఉన్న వాతావరణం భావోద్వేగాలతో నిండిపోతుంది. అతని సేవలను, అతనితో జ్ఞాపకాలను తోటివారి గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురవుతారు. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ విమానాశ్రయం కూడా ఆదివారం రాత్రి అంతకుమించిన భావోద్వేగాలకు వేదికగా మారింది.
భావోద్వేగభరితం
ఆదివారం రాత్రి 10.45 గంటలకు విశాఖ`ఢిల్లీ సర్వీసు నెం. 6ఇ 2018 నెంబరు ఇండిగో విమానం నిర్ణీత సమయానికంటే 11 నిమిషాల ముందే టేకాఫ్ తీసుకోవడంతోనే విశాఖ నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి, కోలాహలం కూడా ఎగిరిపోయాయి. వాటి స్థానంలో ఒకరకమైన నిశ్శబ్దం, గంభీరమైన వాతావరణం అలుముకున్నాయి. వీడ్కోలు చెప్పుకొంటున్న సిబ్బంది, షాపులు మూసేస్తుండటం, ఫర్నిచర్ తరలింపు వంటి దృశ్యాలు చూపరుల మనసులను మెలిపెట్టేశాయి. దానికి కొన్ని గంటల తర్వాత సోమవారం ఉదయం వెలుగురేఖలు విచ్చుకుంటున్న సమయంలోనే వాటితోపాటే కొత్తగా నిర్మించిన వైజాగ్ ఏఎసఆరఐ విమానాశ్రయం(భోగాపురం) ఆశలు రెక్కలు తొడిగాయి. ఇక్కడి నుంచి వాణిజ్య సర్వీసుల ప్రారంభం సూచనగా హైదరాబాద్`విశాఖ సర్వీస్ నెం. 6ఇ`6408 విమానం ఉదయం 6.30 గంటలకు ల్యాండ్ అయ్యింది. అలాగే ఇక్కడి నుంచి స్కూట్ సంస్థకు చెందిన విమానం సింగపూర్‌కు టేకాఫ్ తీసుకుని అంతర్జాతీయ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. దాంతో పాత విశాఖ విమానాశ్రయం సేవలకు పూర్తిగా తెరపడగా.. కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
ఇదోరకం వలస
ఉత్తరాంధ్రకు వలసలు కొత్త కాదు. ఉపాధి, ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు, యువత పెద్ద నగరాలకు, ఇతర రాష్ట్రాలకు వలస పోతుంటారు. వారిలో చాలామంది విశాఖ నగరానికి కూడా వలస వెళ్లేవారు కానీ ఇప్పుడు విశాఖ నుంచి అక్కడి విమానాశ్రయం వలస పోయింది. ఈ ప్రాంత ప్రజలు ఉపాధి వెతుక్కుంటూ వెళితే.. విశాఖ విమానాశ్రయం భవిష్యత్తు ఎదుగుదల కోసం భోగాపురం ప్రాంతానికి వలస వెళ్లింది. అక్కడి ఆశలను చిగురింపజేసేందుకు సిద్ధమైంది.
ఒక్క విమానం నుంచి అంతర్జాతీయ స్థాయికి
సుమారు ఆరున్నర దశాబ్దాలపాటు ఉత్తరాంధ్రకు సేవలు అందించిన విశాఖ విమానాశ్రయం మహత్తర చరిత్రను సొంతం చేసుకుంది. వాస్తవానికి ఇది సైనిక అవసరాలకు నిర్మించిన విమానాశ్రయం. ఇండియన్ నేవీ ఆధీనంలో ఉంది. అయితే పారిశ్రామికంగా ఎదుగుతున్న విశాఖలో పౌర విమాన సర్వీసులు ప్రారంభించాలన్న నిర్ణయానికి అనుగుణంగా ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకునేందుకు నేవీ అనుమతిచ్చింది. మొదట్లో చిన్న రన్‌వే, రోజుకు కేవలం ఒక్క విమాన సర్వీసుతో ప్రారంభమైన వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం సగటున రోజుకు 40 విమానాలు, 10 వేల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే స్థాయికి ఎదిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 29.68 లక్షల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయం సేవలందించింది. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక ఘట్టాలు ఒకసారి అవలోకిద్దాం.
1941: రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ తన కార్యకలాపాల కోసం విశాఖలో రన్‌వే నిర్మించింది.
1962: తర్వాత కాలంలో మÖతపడిన ఈ రన్‌వేను సాధారణ పౌర విమాన రాకపోకల కోసం మళ్లీ వినియోగంలోకి తెచ్చారు.
1972: దేశ రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రన్‌వే నిర్వహణ బాధ్యతలను నేవీ స్వీకరించింది. దాంతోపాటే పౌర సర్వీసులు కొనసాగించారు.
2007: జూన్‌లో కొత్త రన్‌వే అందుబాటులోకి రావడంతో నైట్ ల్యాండింగ్, అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలయ్యాయి.
పూర్తిగా నేవీ ఆధీనంలోకి..
నేవీ కార్యకలాపాలు విస్తృతం కావడం, రక్షణ రంగ అవసరాల దృష్ట్యా ఇకపై ఈ విమానాశ్రయం పూర్తిగా భారత నావికాదళం ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. సాధారణ వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయినప్పటికీ సైనిక విమానాలు, ప్రభుత్వ అతిథులు, లీజ్డ్, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు ప్రత్యేక, అత్యవసర ల్యాండింగ్‌లకు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది.
ప్రజాప్రతినిధుల భావోద్వేగం
ఏదో వెలితిగా ఉంది. ఎంతో బాధగా ఉంది. దశాబ్దాలుగా మన అని చెప్పుకున్న విశాఖ ఎయిర్ పోర్టుతో ఈరోజుతో బంధం తెగిపోయింది. కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అంటారు. కానీ మా విశాఖ ఎయిర్ పోర్టు మాకు ఎప్పుడూ నిత్య నూతనమే. వ్యాపారవేత్తగా మొదట విమానయానం చేసింది ఇక్కడినుంచే. రాజకీయ నాయకుడిగా వందల సార్లు సాగించిన ప్రయాణాలకు వేదికగా నిలిచింది. ఈరోజు ఎయిర్ పోర్టులో సహచర ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, సుందరపు విజయ్ కుమార్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. పైకి అందరం మాట్లాడుకుంటున్నా మనసులలో మాత్రం ఏదో తెలీని ఆర్ద్రత.. ఆవేదన.. అనేక ఏళ్ల పాటు లక్షల మంది ప్రయాణికులకు మధుర జ్ఞాపకాలను పంచిన మనందరి విశాఖ ఎయిర్ పోర్టు ఈరోజుతో మూతబడుతుందన్న ఊహే బాధగా ఉంది. ఎయిర్ పోర్టులో గడిపిన క్షణాలు ఎప్పటికీ మదిలో పదిలంగా ఉంటాయి.






Comments