ప్రతిభకే గుర్తింపు.. సిఫార్సుల కత్తిరింపు!
- BAGADI NARAYANARAO

- 1 hour ago
- 2 min read
జాతీయ పర్వదినాల్లో ప్రశంసాపత్రాల పంపిణీ
రానురాను చాంతాడులా పెరిగిపోయిన జాబితాలు
జాబితాలను స్వయంగా వడపోస్తున్న జేసీ
ఫలితంగా క్రమంగా చిక్కిపోతున్న జాబితాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పంద్రాగస్టు, రిపబ్లిక్ డే మన జాతీయ పండుగలు.. ఊరూవాడా వాటిని ఘనంగా, ఆనందంగా జరుపుకుంటుంటాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు అవి మరింత పెద్ద పండుగలు. ఎందుకంటే ఈ రెండు ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా ప్రతిభావంతులైన అధికారులను గుర్తించి అవార్డులు, రివార్డులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాలక్రమంలో ప్రతిభ కంటే సిఫార్సులకే గుర్తింపు లభిస్తుందన్న విమర్శలు పెరుగుతుండటంతో అధికారులు వాటిపై దృష్టి సారించారు. సిఫార్సులకు లొంగకుండా వాటిని వడపోయడం ప్రారంభించారు. ఫలితంగా గత రెండేళ్లుగా అవార్డుల జాబితా చిక్కిపోయి నాజూకుదనం సంతరించుకుంటున్నది. జాతీయ పర్వదినాల సందర్భాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ సిబ్బందిని గుర్తించే సంప్రదాయం తొలినుంచీ కొనసాగుతున్నది. అయితే క్రమంగా అది గాడి తప్పింది. ప్రతిభ, సేవానిరతితో సంబంధం లేకుండా ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన వారికే అవార్డులు, రివార్డులు అందడం మొదలైంది. ఫలితంగా ప్రతిసారీ అవార్డుల జాబితా ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది. ఏటా రెండు జాతీయ ఉత్సవాల్లో కలిపి 700 మందికిపైగానే అవార్డుల జాబితాలో ఉండేవారు. ఈ జాబితా అంతకంతకూ పెరుగుతుండటంతో దీనికి చెక్ పెట్టేందుకు అధికారులు చేపట్టిన ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి.
కార్యరంగంలో జేసీ
మÖడేళ్ల నుంచి ఈ జాబితా క్రమంగా తగ్గుతూ వస్తున్నది. దీనికి కారణం జిల్లా ఉన్నతాధికారులు చేపట్టిన చర్యలే. వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో పని చేసేవారి పేర్లను అవార్డులకు సిఫార్సు చేస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు వాటిని యథాతథంగా ఆమోదించకుండా అర్హతలను నిర్థారించాకే తుది జాబితాలో పేర్లు చేరుస్తున్నారు. స్వాతంత్య్రదినం, రిపబ్లిక్‌డేకు ముందు వివిధ శాఖల అధికారుల నుంచి వచ్చే జాబితాలో ఉన్న వారిని స్వయంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసిన వారినే అవార్డుల తుది జాబితాలో చేరుస్తున్నారు. ఈ వడపోత ఫలితంగా అవార్డులు అందుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2024 రిపబ్లిక్ ఉత్సవాల్లో 246 మందికి, ఆగస్టు 15న 224 మందికి అవార్డులు ఇచ్చారు. ఇక గత రిపబ్లిక్ డేకి 235 మంది, స్వాతంత్య్ర దినోత్సవంనాడు 169 మంది ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున 65 ప్రభుత్వ శాఖల నుంచి 149 మంది కి, స్వచ్ఛంద సంస్థల కేటగిరీలో ఒకరికి.. మొత్తం 150 మందికే అవార్డులు అందించారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి 220 ఎంట్రీలు రాగా జిల్లా ఉన్నతాధికారులు వాటికి కత్తెర వేసేశారు. అదే క్రమంలో శనివారం రిపబ్లిక్ డే ఉత్సవాల్లోనూ వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో నిజంగా పాల్గొని చిత్తశుద్ధితో పనిచేసి ప్రతిభ చూపిన వారినే ఎంపిక చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖలు అధికారులు పంపించిన జాబితాల్లో సిఫార్సు చేసి అధికారులు, ఉద్యోగులను జాయింట్ కలెక్టర్ గురువారం తన చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. ప్రశంసాపత్రం అందుకోవడానికి వారు ఏవిధంగా అర్హులో.. విధి నిర్వహణలో చేసిన ప్రత్యేక కృషి ఏమిటో.. వారి పేరును ఎవరి సిఫార్సు చేశారో తెలుసుకుంటున్నారు. వారిచ్చిన సమాధానాలు, వివరాలు సంతృప్తికరంగా ఉంటేనే ఆమోదించారని తెలిసింది. అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల నుంచి 150కి మించకుండా ప్రశంసాపత్రాలు ఇవ్వాలని స్థూలంగా నిర్ణయించారు.






Comments