top of page

బ్రిటీష్‌వారి.. ‘భ’యోగోడ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 3 min read
  • నాడు ఉప్పుపైనా ఎడాపెడా పన్నులు

  • దాన్ని ఎవరూ ఎగ్గొట్టకుండా తనిఖీ కేంద్రాలు

  • వాటిని అనుసంధానిస్తూ మొక్కల పెంపకం

  • కాలక్రమంలో అవి పెరిగి జీవగోడలుగా పటిష్టం

  • అలా 4వేల కి.మీ. విస్తరించిన బయోవాల్

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

వ్యాపారం పేరుతో మనదేశానికి వచ్చిన ఆంగ్లేయులు ఇక్కడే తిష్ట వేసి 200 ఏళ్లకుపైగా దోపిడీ పాలన సాగించారు. భారతీయులను బానిసలుగా చూస్తూ వెట్టిచాకిరీ చేయించుకోవడమే కాకుండా దేశసంపదను బ్రిటన్‌కు తరలించుకుపోయారు. బ్రిటీష్ రాచరిక పాలనను మనపైనా రుద్ది ఎడాపెడా పనులు విధిస్తూ భారతీయులను పీల్చిపిప్పి చేశారు. అలా విధించినదే ఉప్పుపై పన్ను. తినే ప్రతి ఆహార పదార్థంలోనూ ఉప్పు ఉండాల్సిందే. అది లేకపోతే ఆ పదార్థానికి రుచీపచీ ఉండదన్నది తెలిసిందే. అటువంటి ఉప్పుపై పన్ను విధింపునకు నిరసనగా మహాత్మాగాంధీ నాయకత్వంలో దేశం మొత్తం ఉప్పు సత్యాగ్రహం చేసింది. సరే ఆ సంగతి పక్కనపెడితే.. ఉప్పుపై విధించిన పన్నును ఎగ్గొట్టి దాన్ని రహస్య మార్గాల్లో తరలించి అమ్ముకోకుండా చూసేందుకు నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ఏకంగా కొన్ని వేల కిలోమీటర్ల పొడవునా బయో వాల్(సజీవ గోడ) నిర్మించింది. మామÖలుగా చూస్తే ఇది గోడలా ఏమాత్రం కనిపించదు. అందుకే దీని గురించి చాలామందికి తెలియదు. అయితే బయోవాల్ నిర్మించిన విషయం ముమ్మాటికీ వాస్తవమని ఒక బ్రిటిష్ అధికారి రాసుకున్న తన జీవిత చరిత్రలో ప్రస్తావించిన అంశాలు నిర్థారిస్తున్నాయి. ఆహార పదార్థాల్లో తప్పనిసరిగా వాడే ఉప్పుపై భారీగా పన్ను వసూలు చేసేందుకు, దాని స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి నాటి బ్రిటీష్ పాలకులు ఏకంగా నాలుగువేల కిలోమీటర్ల మేరకు చెట్లు, పొదలతో కూడిన భారీ జీవగోడ నిర్మించారని సదరు అధికారి తన జీవిత చరిత్రలో ప్రస్తావించారు. ఆ గోడను ఆయన గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. లండన్‌కు చెందిన ప్రముఖ పుస్తక సంరక్షకుడు రాయ్ మోక్స్ హామ్ 1995లో సదరు బ్రిటీష్ అధికారి జీవిత చరిత్రలో ఉన్న ఈ అంశాన్ని గుర్తించి వెలుగులోకి తెచ్చారు. కేవలం ఉప్పు పన్ను రాబట్టేందుకే వేల కిలోమీటర్ల భారీ జీవగోడను నిర్మించి, నిర్వహించారని తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోవడమే కాకుండా ఆసక్తి పెంచుకున్నారు. దాని పూర్తి అనుపానులు తెలుసుకునేందుకు భారతదేశమంతటా పర్యటించి అందుబాటులో ఉన్న పాత రికార్డులను ఏళ్ల తరబడి పరిశీలించి అధ్యయనం చేశారు. ఆ వివరాలతో 2001లో ‘ది గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా: ది సెర్చ్ ఫర్ ద లివింగ్ బారియర్ దట్ డివైడెడ్ ఏ పీపుల’ అనే పుస్తకం కూడా రాశారు. బ్రిటీష్ పాలనలో పన్నుల వసూలు కోసం చేపట్టిన అత్యంత కఠినమైన, విడ్డూరమైన ఏర్పాట్లలో ఒకటిగా ఈ జీవగోడను ఆ పుస్తకం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ఆదాయ వనరుగా ఉప్పు

బ్రిటీష్ పాలనలో భారత్‌లో అత్యధిక పన్ను విధించిన వస్తువుల్లో ఉప్పు ఒకటి. ఉప్పు విలాస వస్తువు కాదు. పేదవారి నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ ఆహారంలో వినియోగించి నిత్యావసర వస్తువు. అందుకే అది బ్రిటీస్ సర్కారుకు ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా కనిపించింది. దానిపై పన్ను విధించి ప్రజల పళ్లూడగొట్టడం ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే ఉప్పుపై, ఇతర చోట్ల లభించే ఉప్పుతో పోలిస్తే చాలా ఎక్కువ పన్నులు వసూలు చేసేవారు. ఈ చర్య అక్రమ రవాణాకు బాటలు వేసింది. వ్యాపారులు తక్కువ ధర ఉన్న ప్రాంతాల్లో ఉప్పును కొనుగోలు చేసి పన్నుల కారణంగా ధర ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వివిధ రహస్య మార్గాల ద్వారా తరలించి అమ్ముకునే వారు. దీనివల్ల పన్ను ఆదాయానికి గండి పడుతున్నందని గ్రహించిన ఈస్ట్ ఇండియా కంపెనీ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి 19వ శతాబ్దం ప్రారంభంలో కస్టమ్స్(తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడం మొదలు పెట్టింది. అలా తనిఖీ కేంద్రాల రూపంలో ప్రారంభమైన ఈ వ్యవస్థ క్రమంగా ఒక అవిచ్చిన్నమైన భారీ అడ్డుగోడగా మారింది. అనంతర కాలంలో ఈ వ్యవస్థ ఇన్‌ల్యాండ్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వచ్చింది. అధిక పన్నులు అమలవుతున్న ప్రాంతాలకు, ముఖ్యంగా బెంగాల్ ప్రెసిడెన్సీకి పన్ను చెల్లించని ఉప్పు చేరకుండా చూడటం ఈ డిపార్ట్‌మెంట్ బాధ్యత. అయితే ఈ సమస్య పరిపాలనాపరమైనది మాత్రమే కాదని చరిత్రకారుడు రాయ్ మోక్స్ హామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్‌లోని వేడి వాతావరణంలో ఉప్పు ఆహారంలో అత్యవసరమైన అంశంగా చెప్పారు. కృత్రిమంగా ధరలు పెంచడం ద్వారా వలస పాలన యంత్రాంగం లగ్జరీ వస్తువులపై కాకుండా ఒక అత్యవసరమైన వస్తువుపై పన్ను విధిస్తున్నట్లయిందన్నారు. ఈ ట్యాక్స్ సమాజంలోని అత్యంత పేద వర్గాలపై తీవ్ర భారం మోపిందని తన అధ్యయనం ద్వారా మోక్స్ హామ్ నిర్దారించారు.

తనిఖీ కేంద్రాలుగా ప్రారంభం

ఇన్‌ల్యాండ్ కస్టమ్స్ లైన్ ప్రారంభంలో ఒక కంచె మాదిరిగా కూడా ఉండేది కాదు. కస్టమ్స్ కార్యాలయాలు, గస్తీ మార్గాలు, తనిఖీ కేంద్రాల శ్రేణిగా మొదలైంది. బ్రిటిష్ పాలిత ప్రాంతం విస్తరిస్తున్న కొద్దీ సుదూర ప్రాంతాల గుండా జరిగే అక్రమ రవాణాను అరికట్టడానికి అధికారులు మరింత కఠినమైన చర్యలకు ప్రయత్నించారు. కాల క్రమేణా, కస్టమ్స్ కేంద్రాల మధ్య ముళ్ల పొదలు, ఎండిన చెక్కలు, పాతిపెట్టిన కర్రలతో అడ్డంకులు ఏర్పాటు చేస్తూ వచ్చారు. దాంతో అవి ఒక కంచెగా రూపాంతరం చెందాయి. 1860ల నాటికి అధికారులు దట్టమైన వృక్ష సంపదను క్రమపద్ధతిలో నాటడం ప్రారంభించారు. ఇదే గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. దీని విస్తృతి అసాధారణమైనది. 1869 నాటికి ఈ ఇన్‌ల్యాండ్ కస్టమ్స్ లైన్ వాయువ్య సరిహద్దులోని ముల్తాన్ నుంచి బంగాళాఖాతం సమీపంలోని ఒడిశా వరకు సుమారు 2500 మైళ్లు అంటే నాలుగువేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. ఈ కంచెలోని కొన్ని భాగాలు సుమారు 12 అడుగుల ఎత్తు, 14 అడుగుల మందం కలిగి ఉండేవి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page