top of page

చపాతీల రూటు..సిపాయిల తిరుగుబాటు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 8 hours ago
  • 2 min read
తొలి స్వాతంత్య్ర సంగ్రామం వెనుక రహస్యం ఇదేనా?

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఒకరి నుంచి మరొకరికి.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రహస్యంగా పత్రాలు, సరుకులు చేరవేయడం బ్రిటీషర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం లేదా స్వాతంత్య్ర పోరాటం ఊపిరులూదుకుంటున్న తరుణంలో ఎక్కువగా కనిపించేది. అజ్ఞాతంలో ఉన్న స్వాతంత్య్ర ఉద్యమకారులకు సహాయం అందించేందుకు ఈ పద్ధతులు అవలంభించేవారు. దాంతో బ్రిటీష్ సైనికులు గ్రామాలు, రహదారులు, అటవీ ప్రాంతాల్లో తీవ్ర నిఘా పెట్టేవారు. ఆ క్రమంలో వారిని ఒకే ఒక చర్య తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. ఏం జరుగుతోందో తెలియక తలలు పట్టుకునే పరిస్థితికి తీసుకెళ్లింది. అదే చరిత్రలో ‘చపాతీ ప్రయాణం’గా స్థిరపడిపోయింది. తొలి స్వాతంత్య్ర పోరాటంగా పరిగణించే 1857నాటి సిపాయిల తిరుగబాటుకు కొన్ని నెలల ముందు ఈ చపాతీలు బ్రిటీష్ సైనికులను ముప్పుతిప్పలు పెట్టాయి. చెయిన్ సిస్టం మాదిరిగా ఉత్తర భారతదేశంలోని గ్రామాల నుంచి వేలాది చపాతీలు విభిన్నమైన రీతిలో ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోయేవి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మనుషులు వాటిని తీసుకొని పరుగులు తీస్తూ ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లి అక్కడున్న మరో వ్యక్తికి అందించేవారు. ఆ వ్యక్తి మళ్లీ అదే రీతిలో మరో ఊరికి వెళ్లి అక్కడున్న వారికి అందించేవారు. ఇలా కొన్ని ప్రాంతాల్లో ఒకే రాత్రిలో ఈ చపాతీలు ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిసింది. ఆ కాలంలో బ్రిటీష్ వారి తపాలా (పోస్ట్) కంటే వేగంగా ఇవి ఊళ్లూ దాటేవని అంటారు. ఈ తరహా చపాతీల రవాణా బ్రిటీష్ అధికారులను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసి ఆందోళనకు గురిచేసింది. చపాతీలను ఈ విధంగా రవాణా చేయడం వెనుక ఏమైనా గూఢార్థం ఇమిడి ఉందా? చపాతీల లోపల ఏమైనా రహస్య సందేశాలు పెట్టి పంపిస్తున్నారా.. తిరుగుబాటు వ్యూహాలు పరస్పరం పంచుకునే మార్గంగా దీన్ని ఎంచుకున్నారా? అన్న సవాలక్ష సందేహాలు వారిని కుదురుగా ఉండనివ్వలేదు. ఆ సందేహాలను తీర్చుకునేందుకు చాలా చపాతీలను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించి మరింత బిత్తరపోయారు. ఎందుకంటే.. చపాతీలను ముక్కలు ముక్కలు చేసి చూసినా వాటిలో అనుమానాస్పదమైనవిగానీ.. రహస్య సందేశాల్లాంటివిగానీ కనిపించలేదు. మరి చపాతీలను ఇలా వింత పద్ధతిలో ఎందుకు తరలిస్తున్నారంటూ తలలు ఎంత బద్దలుకొట్టుకున్నా వారికి అర్థం కాలేదు. బ్రిటీష్ వారిని భయపెట్టడానికే అలా చేశారని కొందరు భావిస్తే.. కలరా వ్యాధి ప్రబలిన ప్రాంతాలకు పంపిన ఆహార సహాయమని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఆ చపాతీలు అలా చేతులు మారడం వెనుక అసలు ఉద్దేశమేమిటన్నది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. అయితే ఇది జరిగిన కొన్ని నెలల్లోనే సిపాయిల తిరుగుబాటు అంకురించి.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరించడం కొసమెరుపు!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page