top of page

బ్రిటీష్ పాలన ఎరుగని రాష్ట్రాలు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 3 min read
  •  1961 వరకు గోవాలో పోర్చుగీసు పాలన

  •  1962 వరకు పుదుచ్చేరిలో ఫ్రెంచి పాలన

  •  వాటి నుంచి విముక్తి తర్వాతే ఈ రాష్ట్రాల్లో స్వాతంత్య్ర వేడుకలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

దేశమంతా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. స్వాతంత్య్ర సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. బ్రిటీష్ దాస్యశృంఖలాలు తెంచుకుని 80 ఏళ్లు అవుతున్న, వందేమాతర గీతం 150 ఏళ్ల కార్యక్రమాలు జరుగుతున్న సందర్భాలు కూడా కలిసిరావడంతో ఈసారి మరింత ఉత్సాహంగా పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం రెండువందల ఏళ్ల బ్రిటీష్ వలసవాద పాలన నుంచి విముక్తి పొందడమేననేది చిన్నపిల్లలతో సహా అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలు బ్రిటీషర్ల ఏలుబడిలో ఒకరోజు కూడా లేవన్నది ఇప్పటి తరంవారికి తెలియకపోవచ్చు. అయినా ఆ ప్రాంతాల్లో కూడా స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు. ఆ ప్రాంతాలు.. వాటి కథాకమామిషు ఏమిటో ఒకసారి చూద్దాం.

1510 నుంచి పోర్చుగీసు పెత్తనం

బ్రిటీష్ పాలనను ఎదుర్కోని భారతీయ రాష్ట్రాల్లో ముఖ్యమైనది గోవా రాష్ట్రం. భారతదేశానికి వర్తకం పేరుతో ఫ్రెంచి, డచ్, పోర్చుగీసు, బ్రిటీష్ దేశస్తులు సుమారు 14, 15 శతాబ్దాల్లో వచ్చారు. వారిలో బ్రిటీషర్లు క్రమంగా దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో పాగా వేసి క్రమంగా అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. డచ్‌వారు భీమిలి వంటి కొన్ని పరిమిత ప్రాంతాల్లోనే కార్యకలాపాలు నిర్వహించి వెళ్లిపోయారు. అధికారం చేజిక్కించుకునే విషయంలో ఫ్రెంచివారు బ్రిటీషర్లకు తీవ్ర పోటీ ఇచ్చినా చివరికి తట్టుకోలేక నిష్క్రమించారు. పోర్చుగీసువారు కొన్ని ప్రాంతాల్లో అధికారం చెలాయించారు. అలా సుదీర్ఘకాలం వారి పాలన కొనసాగిన రాష్ట్రం గోవా. 1510లోనే వారు గోవాపై అధికారాన్ని సొంతం చేసుకున్నారు. భారతదేశానికి బ్రిటీషర్ల నుంచి స్వాతంత్య్రం లభించిన తర్వాత కూడా కొన్నేళ్లపాటు గోవా మనదేశంతో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రాంతంగా పోర్చుగీసు పాలనలో కొనసాగింది. 1947లో మనకు స్వాతంత్య్రం లభించిన తర్వాత సర్దార్ వల్లభాయి పటేల్ పట్టుదలతో అనేక సంస్థానాలు, రాజ్యాలు స్వతంత్ర భారతదేశంలో విలీనం అయ్యాయి. అదే క్రమంలో గోవాను కూడా భారత్‌లో విలీనం చేయడానికి దౌత్యపరంగా ప్రయత్నాలు జరిగాయి. కానీ పోర్చుగల్ పాలకులు గోవాపై తమ నియంత్రణను వదులుకోవడానికి అంగీకరించలేదు. దాంతో 1947 తర్వాత కూడా చాలా ఏళ్లు గోవా వారి పాలనలోనే ఉండిపోయింది. అయితే 1961 డిసెంబర్‌లో పరిస్థితి ఒక్కసారి మారిపోయింది. పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక సైనిక ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయ పేరుతో ఆ ఏడాది డిసెంబర్ 17 నుంచి 19 వరకు కొనసాగిన ఈ సైనిక చర్య ద్వారా భారత సైనిక బలగాలు భూ, వాయు, సముద్ర మార్గాల్లో గోవాను చుట్టుముట్టి దిగ్బంధించాయి. 36 గంటలకుపైగా జరిగిన ఈ సైనిక దిగ్బంధంతో నాటి పోర్చుగీసు గవర్నర్ మాన్యుయెల్ ఆంటోనియో వస్సాలో ఇ సిల్వా చేతులెత్తేసి భారత సైన్యానికి లొంగిపోయారు. దీంతో 1961 డిసెంబర్ 19న గోవా అధికారికంగా భారతదేశంలో విలీనమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నారు. అప్పటినుంచే స్వాతంత్య్ర ఉత్సవాలు కూడా జరుపుతున్నారు. తర్వాత కాలంలో సమీపంలో ఉన్న డామన్, డయి దీవులతో కలిపి గోవాను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో గోవా విలీనం కావాలా లేక కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగాలా అనే వివాదం తలెత్తినప్పుడు 1967లో దానిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అయితే మెజారిటీ ప్రజలు కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగాలని తేల్చి చెప్పారు. కాగా 1987 మే 30న గోవాకు రాష్ట్ర హోదా ఇవ్వడంతో భారతదేశంలో 25వ రాష్ట్రంగా అవతరించింది. అయితే ఇప్పటికీ ఆ రాష్ట్రంలో గోవా విమోచన దినోత్సవంతోపాటు భారత స్వాతంత్య్ర దినోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు.

300 ఏళ్లుగా ఫ్రెంచి పాలన

గోవా మాదిరిగానే పుదుచ్చేరి కూడా ఒకప్పుడు వందల ఏళ్లు విదేశీ పాలనలో మగ్గిపోయింది. ఒకప్పుడు పాండిచేరిగా పిలిచే ఈ ప్రాంతం మిగతా బ్రిటీష్ ఇండియాకు భిన్నంగా ఫ్రెంచివారి పాలనలో ఉండేది. భారతదేశంలోని మిగతా ప్రాంతాలను వదిలేసి ఫ్రెంచివారు దేశం నుంచి వెళ్లిపోయినా.. అప్పటికి ప్రత్యేక ప్రాంతంగా ఉన్న పాండిచేరిలో మాత్రం తమ అధికారాన్ని కొనసాగించారు. ఆ విధంగా ఏకంగా మÖడువందల ఏళ్లు ఆ రాష్ట్రాన్ని పాలించారు. చివరికి 1954 నవంబర్ ఒకటో తేదీన ఫ్రెంచి పాలన నుంచి పాండిచేరికి విముక్తి లభించింది. అయితే 1962 నవంబర్ ఒకటో తేదీన పాండిచేరి అధికారికంగా భారతదేశంలో విలీనమైంది. తర్వాతకాలంలో దీని పేరును పుదుచ్చేరిగా మార్చారు. దాంతో 1962 నుంచే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో స్వాతంత్య్ర ఉత్సవాలు జరుగుతున్నాయి.

 ఈ రెండింటితోపాటు తెలంగాణ నిజాం పాలనలో, జమÖ్మకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాలు స్థానిక రాజుల పాలనలో కొనసాగేవి. బ్రిటీష్ వలసపాలన సమయంలో ఈ రాజ్యాల పాలకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బ్రిటీషర్లతో ఒప్పందాలు చేసుకుని, కప్పాలు కడుతూ తమ అధికారం కొనసాగేలా చూసుకున్నారు. స్వాతంత్య్రం ప్రకటించిన సమయంలో కూడా భారత్‌లో విలీనం అవ్వాలా.. వేరే కొనసాగాలా అన్న నిర్ణయం తీసుకునే వెసులుబాటును నాటి బ్రిటీష్ ప్రభుత్వం సంస్థానాధీశులకే అప్పగించింది. అయితే కొందరు భారత్‌లో విలీనానికి మొగ్గు చూపగా.. మరికొందరిని భారత ప్రభుత్వం సర్దార్ పటేల్ నేతృత్వంలో సైనికచర్య ద్వారా లొంగదీసుకుని.. వారి రాజ్యాలను భారత UNIONలో విలీనం చేసింది. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న ప్రస్తుత తెలంగాణ విషయంలో అదే జరిగింది. హైదరాబాద్ నిజాం తన రాజ్యాన్ని భారత్ విలీనం చేయడానికి అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్‌లో భారత సైన్యం దాడి చేసింది. దాంతో నిజాం లొంగిపోయి తెలంగాణను సెప్టెంబర్ 17న భారత UNIONలో విలీనం చేశారు. అందుకే తెలంగాణలో భారత స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page