స్వేచ్ఛా తారకమంత్రం..వందేమాతరం
- DV RAMANA

- 2 hours ago
- 3 min read
150 వసంతాల ఉద్యమోజ్వల గీతిక
కానీ ఇన్నాళ్లూ జాతీయ గేయంగా రెండు చరణాలే
ఇక నుంచి పూర్తిగా ఆరు చరణాలు ఆలపించాలని నిర్ణయం
ఎర్రకోటపై జరిగే 80వ స్వాతంత్య్ర వేడుకలతో శ్రీకారం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముగింపు రోజు ఒక విశేషఘట్టం చోటు చేసుకుంది. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే సభ్యులు లేచి నిలబడి జాతీయ గేయమైన వందేమాతర గీతాన్ని సభక్తికంగా ఆలపించారు. మన పార్లమెంటు చరిత్రలో వందేమాతరం ఆలపించడం ఇదే తొలిసారి కావడం విశేషమైతే.. దాన్ని ఎప్పట్లా రెండు చరణాలు కాకుండా పూర్తిగా ఆరు చరణాలు ఆలపించడం ఇంకా పెద్ద విశేషం.
అంతేనా.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో జరిగే పతాకావిష్కరణ కార్యక్రమంలోనూ వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మనం ప్రస్తుతం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటుండగా.. వందేమాతర గీతాన్ని రచించిన 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం వందేమాతరానికి అన్ని స్థాయిల్లోనూ జాతీయగీతంతో సమాన హుదా కల్పించింది. ఆ మేరకు పార్లమెంటు ఆమోదించిన బిల్లు ఇటీవలే రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పొంది చట్టరూపం దాల్చింది. ఈ చట్టం ప్రకారమే ఇకనుంచి తప్పనిసరిగా ఆరు చరణాలు కలిగిన వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించాల్సి ఉంటుంది. జాతీయ గేయానికి విశేష గౌరవం లభించిన నేపథ్యంలో వందేమాతరం ఆవిర్భావం, దాని ప్రాశస్త్యం గురించి ఒక్కసారి అవలోకించుకోవడం సమంజసం.
పత్రిక నుంచి ఉద్యమ స్థాయికి..
సుప్రసిద్ధ బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ ఈ పాటను అక్షయ నవమి తిథిలో 1875 నవంబర్ ఏడో తేదీన రచించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఛటర్జీ స్వయంగా నడుపుతున్న బెంగాలీ సాహిత్య పత్రిక ‘బంగ దర్శన’లో దీన్ని తొలిసారి ప్రచురించారు. అనంతరం ఏడేళ్ల తర్వాత 1882లో ఛటర్జీయే రచించిన ‘ఆనందమఠ’ అనే ప్రసిద్ధ బెంగాలీ నవలలో ముద్రితమైంది. సంస్కృతం, బెంగాలీ సమ్మిళత సాహిత్యం రంగరించిన ఈ గేయానికి అర్థం.. ‘తల్లీ.. నీకు నమస్కరిస్తున్నాను’..అని వస్తుంది. ఈ గేయానికి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా స్వరపరచడమే కాకుండా 1896లో కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో దీన్ని తొలిసారి స్వయంగా ఆయనే ఆలపించడం ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారు. అప్పటినుంచీ స్వాతంత్య్ర ఉద్యమంలో స్వేచ్ఛా పిపాసను రగిలించే గీతంగా ఇది విస్తృత ప్రాచుర్యం పొందింది. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఇదే వందేమాతరం.. ఒక ప్రముఖ నినాదంగా, ఉద్యమకారులకు ఉత్ప్రేరకంగా మారింది. స్వాతంత్య్రానంతరం మనదేశ జాతీయగీతంగా ‘జనగణమన’కు ీVAదా ఇచ్చిన మన రాజ్యాంగ నిర్మాతలు.. ‘వందేమాతరానికి’ జాతీయ గేయం ీVAదా ఇచ్చారు. ఆనాటి రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 24న ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిన్నటివరకు రెండు చరణాలే..
జాతీయ గేయం హుదా పొందినప్పటికీ వందేమాతర గేయంలోని రెండు చరణాలనే జాతీయ గేయంగా నాటి రాజ్యాంగ సభ సభ్యులు స్వీకరించారు. ఆ ప్రకారం ఇంతవరకు వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే రాష్ట్ర, జాతీయ కార్యక్రమాల్లో ఆలపిస్తున్నాం. వాస్తవానికి ఈ గీతంలో మొత్తం ఆరు చరణాలు ఉన్నాయి. కానీ రెండు చరణాలనే తీసుకుని మిగతా నాలుగు చరణాలను వదిలివేయడానికి కారణం ఆ చరణాల్లో ధ్వనిస్తున్న భావం ఇతర వర్గాల మతవిశ్వాసాలకు విరుద్ధంగా ఉందన్న వివాదం తలెత్తడమేనని అంటారు. చివరి నాలుగు చరణాల్లో దుర్గాదేవి స్తుతి ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి. వాటి సంగతి పక్కన పెడితే జాతీయ గీతమైన ‘జనగణమన’ను కచ్చితంగా 52 సెకండ్లలో పాడాలని నిబంధన ఉండగా, జాతీయ గేయమైన ‘వందేమాతరం’ రెండు చరణాల నిడివి 65 సెకండ్లు. అయితే దీన్ని తప్పనిసరిగా ఆ సమయంలోపే పాడాలన్న నిబంధన మాత్రం లేదు. అలాగే జనగణమన.. పాడేటప్పుడు అందరూ తప్పనిసరిగా లేచి నిలబడాల్సి ఉంటుందన్న నిబంధనలు ఉన్నాయి. అయితే వందేమాతరం.. విషయంలో ఆ నిబంధన లేకపోయినా.. గౌరవసూచకంగా లేచి నిలబడే సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది.
ఒకటిన్నర శతాబ్ది ఘనత
భారతీయ సంప్రదాయంలో భాగంగా మారిన ‘వందేమాతరం’ ఆవిర్భవించి గత ఏడాది నవంబర్ ఏడో తేదీనాటికే 150 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాదిపాటు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. గత నవంబర్ ఏడో తేదీన ఢిల్లీలో జరిగిన ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశారు. అదేరోజు దేశావ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి సామÖహికంగా వందేమాతర గీతాలపన చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగానే వందేమాతరానికి పూర్తిస్థాయిలో ఆలపించేలా చర్యలు తీసుకోవాలని సంకల్పించి తదనుగుణంగా చర్యలు తీసుకుంది. ఆ మేరకు ఈ ఏడాది మే ఆరో తేదీన ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్`1971ని సవరించి వందేమాతరానికి కూడా జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన హుదా కల్పించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన కేంద్ర HOME శాఖ విడుదల చేసిన అధికారిక ప్రోటోకాల్ ప్రకారం ఇక నుంచి వందేమాతరం అసలు పాటలోని మొత్తం ఆరు చరణాలను పాడాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మొత్తం ఆరు చరణాలు ఆలపించడానికి 3 నిమిషాల ఆరు సెకండ్ల సమయం పడుతుందని నిర్ణయించారు. జెండా ఆవిష్కరణ వంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో మొదట వందేమాతరం.. ఆ వెంటనే జనగణమన పాడాలని నిర్దేశించారు. ఆ మేరకు స్వాతంత్య్ర భారత చరిత్రలో తొలిసారి ఎర్రకోటపై శనివారం జరిగే పతాకావిష్కరణ సందర్భంగా వందేమాతర గేయాన్ని తొలిసారి.. అదీ పూర్తిగా ఆరు చరణాలు ఆలపించనున్నారు.
వందేమాతరం పూర్తి సాహిత్యం
వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం ॥ వందే ॥
శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీమ్
పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం ॥ వందే ॥
కోటికోటి కంఠ కలకల నినాద`కరాలే
కోటి కోటి భుజైర్ధృత-ఖర-కరవాలే
అబలా కేయనో మా ఏతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల-వారిణీం మాతరామ్ ॥ వందే ॥
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వ్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే ॥ వందే ॥
త్వ్వం హి దుర్గా దశ-ప్రహరణ-ధారిణీ
కమలా కమలదళ-విహారిణీ
వాణీ విద్యాదాయినీ
నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం ॥ వందే ॥
శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం ॥ వందే ॥






Comments