top of page

సన్నబియ్యానికి ధరల సెగ!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 4 hours ago
  • 2 min read
  • 25 కిలోల బస్తా రూ.1,500కు చేరిక

  • తగ్గిన సాగు.. పెరిగిన డిమాండ్‌తో మళ్లీ మంట

  • ఎల్ నినో వల్ల వచ్చే ఏడాది మరింత పెరిగే అవకాశం


(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్రంలో బియ్యం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 25 కేజీల సన్న బియ్యం (స్టీమ్ రైస్) రూ.1,200 నుంచి రూ.1,500లకు చేరాయి. ముతక బియ్యం (రా రైస్) రూ.950ల నుంచి రూ.1,100లకు ఎగబాకింది. బియ్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ధాన్యం లభ్యత గణనీయంగా తగ్గడమేనంటూ మిల్లర్లు చెబుతున్నారు.

స్థానికంగా రైతులు స్వర్ణ రకం (సన్నాలు) ధాన్యాన్ని సాగు చేస్తున్నా గిట్టుబాటు లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో విక్రయించాల్సి వస్తోంది. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉండటంతో సన్నాల సాగును రైతులు తగ్గించారు. దీంతో సన్నాల దిగుబడి గతేడాది తగ్గింది. గతేడాది ఖరీఫ్‌లో సన్నాల 80 కేజీల ధాన్యాన్ని మిల్లర్లు రైతుల నుంచి రూ.3,100లకు కొనుగోలు చేశారు. దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగి ధాన్యానికి ధర పలికింది.

పీడీఎస్ కింద ప్రజా అవసరాల కోసం పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి ముతక బియ్యం (రా రైస్)ను సేకరించి సరఫరా చేస్తోంది. ప్రభుత్వం పంపిణీ చేసే పీడీఎస్ బియ్యాన్ని లబ్ధిదారులు విక్రయించి సన్నాలు కొనుగోలు చేసుకుంటున్నారు. ముతక ధాన్యాన్ని పండించే రైతులు వాటిని విక్రయించి రోజువారీ అవసరాల కోసం సన్న బియ్యం కొనుగోలు చేయడం సర్వసాధారణమైపోయింది. ప్రజలు సన్న బియ్యం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో వీటి ధరలు అమాంతం పెరిగాయని మిల్లర్లు చెబుతున్నారు.

ప్రస్తుతం సన్నాలకు డిమాండ్ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగింది. ప్రభుత్వం గ్రేడ్-1 ధాన్యం కింద రైతుల నుంచి సేకరించి మిల్లర్లకు సీఎంఆర్‌కు ఇస్తుంది. జిల్లాలో 90 శాతం మిల్లర్లు ఖరీఫ్ సమయంలో సీఎంఆర్‌కు ధాన్యం తీసుకొని మిల్లింగ్ పూర్తయిన తర్వాత 9 నెలల పాటు మిల్లులను మూసేస్తారు. కేవలం 10 శాతం మిల్లర్లు మాత్రమే 365 రోజులు మిల్లింగ్ చేస్తుంటారు. వీరి వద్దనే ధాన్యం నిల్వలు ఉంటాయి.

ముతక బియ్యానికి విదేశాల్లో డిమాండ్ ఉండటంతో 10 శాతం మిల్లర్లు సీఎంఆర్ పూర్తి చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. ఈ మిల్లుల్లో కొందరి వద్ద ప్రస్తుతం ధాన్యం నిల్వలు నిండుకున్నాయి. జిల్లాలో సన్నాల దిగుబడి తగ్గడంతో వీరంతా ఎక్కువ ధరకు రైతుల వద్ద ఉన్న స్వర్ణ రకం ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో బియ్యం ధరలు పెరిగినట్లు మిల్లర్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో పండించే బియ్యం సరఫరాపై తమిళనాడు ఆధారపడుతుండటం బియ్యానికి డిమాండ్ పెరిగినట్లు బియ్యం డీలర్లు చెబుతున్నారు. దీంతో పాటు మిల్లింగ్, విద్యుత్, రవాణా చార్జీలు, కూలీ రేట్లు పెరగడం వల్ల రిటైల్ ధరలు అమాంతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌లో సరఫరా తక్కువగా ఉండటంతో పెరిగిన డిమాండ్‌ను అవకాశంగా చేసుకొని వ్యాపారులు నిల్వలు పెంచుకోవడం వల్లనే తాత్కాలికంగా రిటైల్ ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే ప్రభుత్వం ధరలకు కళ్లెం వేయడానికి రాష్ట్రవ్యాప్తంగా రైతుబజార్లు, మిల్లర్ల వద్ద ఈ నెల 3 నుంచి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సన్నాలు కేజీ రూ.52లు, ముతక బియ్యం రూ.50లకు విక్రయిస్తోంది. ఆధార్ కార్డుకు కేవలం 10 కేజీలు మాత్రమే బియ్యం విక్రయిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించే బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ఆధార్‌తో ముడిపెట్టి 10 కేజీలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

తీవ్ర వర్షాభావం వల్ల జిల్లాలో కేవలం 60 శాతం వరి సాగు అయింది. సాగునీటి కాలువల కిందనే వరి సాగు చేస్తున్నారు. దీనివల్ల దిగుబడిపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఖరీఫ్ దిగుబడి సగానికి పడిపోతే ధాన్యం నిల్వలు తగ్గి రానున్న రోజుల్లో బియ్యం ధరలు పెరగడానికి ఆస్కారం ఉందని మిల్లర్లు చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page