top of page

ఆదిత్యుని లడ్డూకు జీడిపప్ప్పు కొరతట.. పోటులో మందు బాటిళ్లకు కొదవ లేదట..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 3 hours ago
  • 2 min read

  • వంట మాస్టర్ల మద్యం మత్తు..

  • ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆగడాలపై చర్చ

  • చర్యల్లో మాత్రం సెలక్టివ్ వ్యవహారం

  • సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు

  • ప్రసాదం సరుకుల తరలింపుపై ఆరోపణలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో తీవ్ర కలకలం రేగింది. భక్తులకు అత్యంత పవిత్రంగా అందించే నిత్య అన్నదానం, లడ్డూ ప్రసాదం తయారు చేసే ‘పోటు’ (వంటశాల)లో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మద్యం సేవిస్తూ విధులు నిర్వహిస్తున్నారన్న వార్తలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అంతేకాకుండా దేవస్థానానికి చెందిన విలువైన వంట సరుకులను అక్రమంగా బయటకు తరలిస్తున్న వ్యవహారాలు సీసీ కెమెరాల సాక్షిగా వెలుగులోకి వచ్చాయి. బుధవారం పోటులో పనిచేస్తున్న కొందరు వంట మాస్టర్లు మద్యం మత్తులో విధులు నిర్వహించినట్లు ఆలయ వర్గాలు గుర్తించాయి. ఈవో నిర్వహించిన తనిఖీల్లో పోటులో రెండు ఫుల్ బాటిళ్లతో పాటు ఆరు క్వార్టర్ బాటిళ్లు బయటపడినట్లు సమాచారం.

వంట మాస్టారు తొలగింపు

అన్నదానం వంట మాస్టారు శర్మ మద్యం మత్తులో తూలుతూ నడుస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈవో చాంబర్‌కు సైతం ఆయన మద్యం మత్తులోనే రావడంతో, సరుకుల తరలింపు ఆరోపణల నేపథ్యంలో ఆయనను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు.

వారిపై చర్యలేవి

పులిహోర వంట మాస్టారు శ్రీను, అన్నదానం వంట మాస్టారు కుమార్ కూడా మద్యం సేవించి విధులకు హాజరైన వారిలో ఉన్నారని ఆరోపణలు వస్తున్నప్పటికీ, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల పర్యవేక్షణలో ఉండాల్సిన పోటు స్టోర్ రూమ్ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడంతో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సరుకుల తరలింపు

లడ్డూ, పులిహోర తయారీకి వినియోగించే నెయ్యి, జీడిపప్పు, సన్నబియ్యంతో పాటు అన్నదానం సరుకులు, నిత్యం కూరగాయలు పక్కదారి పడుతున్నాయి. తెల్లవారుజామున టూరిజం భవనం ప్రహరీ పక్క నుంచి ట్రాలీ రిక్షాల ద్వారా నెలకు సుమారు రూ.50 వేల విలువైన సరుకులను కంపోస్టు కాలనీలోని ఒక కిరాణా దుకాణానికి తరలించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రికార్డుల్లో గోల్‌మాల్..

గతంలో అవినీతి ఆరోపణలతో సింహాచలానికి బదిలీ అయిన ఓ రెగ్యులర్ ఉద్యోగి తరచూ అరసవల్లికి వచ్చి ఈ వ్యవహారాలకు సహకరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అన్నదానానికి హాజరయ్యే భక్తుల సంఖ్యను రికార్డుల్లో అధికంగా నమోదు చేస్తూ, మిగిలిన సరుకులను దొడ్డిదారిన అమ్ముకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్కో వంట మాస్టారు నెలకు రూ.50 వేలకు పైగా అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారని ఆలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విచారణకు భక్తుల డిమాండ్

గతంలో స్థానిక ఎమ్మెల్యే స్వయంగా అన్నదానం నాణ్యతను పరిశీలించి అధికారులను మందలించినా, కాంట్రాక్టర్‌ను మార్చినా పోటు వ్యవహారాల్లో మార్పు రాలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సీసీ ఫుటేజీ, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page