ఆమె.. డాక్టర్ తైక్వాండో!
- DV RAMANA

- 4 hours ago
- 3 min read
ఆ కుటుంబంలో ఇద్దరు వైద్యులు..
ముగ్గురు తైక్వాండో క్రీడాకారులు
కొడుకులతోపాటు ఆత్మరక్షణ విద్యలో
శిక్షణ పొందుతున్న డాక్టర్ శిరీష
జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న త్రయం
వియత్నాం పోటీల్లో స్వర్ణ, రజత పతకాల సాధన
తనతోపాటు పలువురు వైద్యులు, మెడికోలను చేర్చిన వైనం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
తండ్రీకూతురు లేదా తల్లీకొడుకు కలిసి ఒకేసారి టెన్త్, ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఉదంతాలను మనం పరీక్షల సీజన్‌లో వార్తల రూపంలో చూస్తుంటాం. అబ్బో.. వయసు పెరిగినా విద్య పట్ల జిజ్ఞాస తగ్గలేదని ప్రశంసాపూర్వకంగా వ్యాఖ్యానిస్తుంటాం. ఇటువంటి సందర్భాలు పరీక్షలు జరిగిన ప్రతిసారీ వార్తలుగా వస్తూనే ఉంటాయి. కానీ.. ఒక తల్లి తన ఇద్దరు కొడుకులతో కలిసి క్రీడా శిక్షణ పొందడం.. అది కూడా ఆత్మరక్షణకు సంబంధించిన క్రీడ కావడం బహుశా ఎవరికీ తారసపడి ఉండకపోవచ్చు.. జరిగి ఉండకపోవచ్చు కూడా. కానీ అటువంటి అరుదైన దృశ్యం మనకు శ్రీకాకుళంలో కనిపిస్తుంది. ప్రతినిత్యం తెల్లవారుజామున స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానానికి వెళితే ఆ తల్లీకొడుకులు తైక్వాండో సాధన చేస్తూ కనిపిస్తారు. జిల్లా తైక్వాండో కోచ్ భాస్కరరావు వద్ద వారు శిక్షణ పొందుతున్న వారు దానికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ పోటీల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంతకీ వారెవరంటే..
మొదట కుమారులు.. తర్వాత తల్లి

అమె.. ప్రముఖ వైద్యురాలు.. శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అనస్తిషిస్ట్ డాక్టర్ ఇ.శిరీష. ఆమె భర్త డాక్టర్ కారె సంజీవ్‌కుమార్. ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేసిన ఆయన రిమ్స్ వైద్య కళాశాలలోనే ఆర్థోపెడిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి మోక్షిత్(15) ప్రవేశ పరీక్షలో ఎనిమిదో ర్యాంకు సాధించి కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చేరి ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతుండగా, చిన్నబ్బాయి సాక్షిత్(12) స్థానిక సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరు పిల్లలు నగరానికి చెందిన తైక్వాండో శిక్షకుడు కొమర భాస్కరరావు వద్ద ఐదేళ్ల వయసు నుంచే శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక పోటీల్లో పాల్గొన్న ఈ కుర్రాళ్లు పలు అవార్డులు, మెడల్స్ అందుకుని సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా వీరిద్దరికి తల్లి తోడయ్యారు. వీరి తల్లి డాక్టర్ శిరీష కూడా కొంతకాలంగా తైక్వాండో శిక్షణ పొందుతూ తన ఏజ్ గ్రూప్ కేటగిరీలో ప్రతిభ చూపుతున్నారు. ఈ తల్లీకొడుకుల తైక్వాండో ప్రతిభ ఎల్లలు దాటి అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. ఇటీవల వియత్నాంలోని డానంగ్‌లో జరిగిన రెండో సాంగ్‌రీ ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో టోర్నమెంటులో పాల్గొని అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జూలై 31 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు జరిగిన ఈ టోర్నమెంటులో పూంసే విభాగంలో మహిళల 41 కేజీల కేటగిరీ గ్రీన్‌బెల్ట్ పోటీల్లో పాల్గొన్న డాక్టర్ శిరీష గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఇక ఆమె పెద్ద కుమారుడు మోక్షిత్ అండర్ 45 కేజీల విభాగంలో పోటీ పడి క్వార్టర్స్ వరకు వెళ్లగా, చిన్న కుమారుడు సాక్షిత్ అండర్ 31 కేజీల విభాగంలో రజత(సిల్వర్) పతకం సాధించాడు.
చిన్నాన్న స్ఫూర్తి.. పిల్లల ప్రోద్బలం

క్రీడల్లో పిల్లలు రాణించడం సహజమే కానీ.. వారితోపాటు వారి తల్లి కూడా ఒక ఆత్మరక్షణ లేదా యుద్ధక్రీడలో శిక్షణ పొందడం, రాణిస్తుండటం పెద్ద విశేషమే. అందులోనూ వైద్యవృత్తిలో నిరంతరం బిజీగా ఉండేవారికి ఇంత సమయం ఎలా కేటాయించ గలుగుతున్నారు? అటు కుటుంబం.. అటు వృత్తి జీవితాల మధ్య క్రీడాశిక్షణపై ఆసక్తి ఎలా కలిగింది? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం. అదే విషయాన్ని ‘సత్యం’ ప్రతినిధి డాక్టర్ శిరీష వద్ద ప్రస్తావించగా. ఆమె పలు విషయాలను పంచుకున్నారు. శిరీష తండ్రి విజయనగరానికి చెందిన దివంగత నాగేశ్వరరావు న్యాయవాది, పూర్వాశ్రమంలో ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం హైదరాబాద్‌లో ఉండేవారు. దాంతో శిరీష ప్రాథమిక, ఇంటర్ విద్య అక్కడే పూర్తి చేశారు. తర్వాత ఎంబీబీఎస్ విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలలో, ఎండీ`అనస్థీషియా కోర్సును గుంటూరులో పూర్తి చేశారు. అనంతరం జెమ్స్‌లోనూ, కొన్నాళ్లు ఫ్రీలాన్స్‌గా వైద్యవృత్తి నిర్వహించి.. 2019లో శ్రీకాకుళం రిమ్స్‌లో చేరారు. కాగా డాక్టర్ శిరీష చిన్నాన్న ఇ.ప్రసాదరావు స్పోర్ట్స్‌మెన్. కబడ్డీ క్రీడలో ద్రోణాచార్య అవార్డు కూడా అందుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) పరిధిలో జాతీయ కోచ్‌గా కూడా పని చేశారు. ప్రొ.కబడ్డీ లీగ్‌లకు కోచ్‌గా వ్యవహరిస్తుంటారు. ఆయన స్ఫూర్తితో శిరీష తన కుమారులను ఏదో ఒక క్రీడలో శిక్షణ ఇప్పించాలని భావించారు. కుమారుల ఆసక్తి మేరకు వారికి ఐదేళ్ల వయసున్నప్పుడే తైక్వాండ్ శిక్షణలో చేర్పించారు. ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే పిల్లలను తీసుకుని ఆర్ట్స్ కళాశాల మైదానానికి వెళ్లేవారు. వారు తీసుకుంటున్న శిక్షణను, వారి సాధనను ఆసక్తిగా గమనించడం ఆమెకు నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమంలో ‘రోజూ మాతో వస్తున్నావు కనుక.. నువ్వు కూడా శిక్షణ తీసుకోవచ్చు కదా’ అని కుమారులు ఒత్తిడి తేవడం ప్రారంభించారు. చివరికి వారి ప్రోద్బలంతో రెండేళ్ల క్రితం అంటే 2024 నవంబర్‌లో శిక్షణలో చేరారు. బ్లాక్ బెల్ట్ సాధించేవరకు శిక్షణ తీసుకుంటానని కుమారులకు హామీ ఇచ్చానని ఆమె చెప్పారు. రెండేళ్లలోనే మంచి ప్రగతి సాధించిన ఆమె ఇప్పటివరకు వైట్, ఎల్లో, గ్రీన్ బెల్ట్ వరకు సాధించానని, చివరిగా రెడ్, బ్లాక్ బెల్టులు పొందాల్సి ఉందని చెప్పుకొచ్చారు. వియత్నాం పోటీల్లో గ్రీన్ బెల్ట్ విభాగంలోనే పాల్గొని విజయం సాధించానని ఆమె చెప్పారు.
జిల్లా నుంచి అంతర్జాతీయానికి

పిల్లలను తైక్వాండో శిక్షణలో చేర్పించి తైక్వాండోతోపాటు ఉషూలోనూ శిక్షణ ఇప్పిస్తున్న డాక్టర్ శిరీష తాను మాత్రం తన వయసుకు తగినట్లు పూంసే విభాగంలో శిక్షణ పొందుతున్నారు. ఈ ఆత్మరక్షణ క్రీడలో పిల్లలకు మరింత అడ్వాన్స్‌డ్ శిక్షణ ఇప్పించాలన్న లక్ష్యంతో దక్షిణ కొరియాకు కూడా తీసుకెళ్లారు. క్రీడారంగంలో ఉన్న తన చిన్నాన్న రిఫరెన్స్‌తో దక్షిణ కొరియా గ్రాండ్ మాస్టర్లను సంప్రదించిన అనంతరం స్థానిక కోచ్ కుమారుడు, మరో కోచ్‌గా వ్యవహరిస్తున్న కొమర మోహన్‌కృష్ణతోపాటు తన ఇద్దరు పిల్లలను తీసుకుని 2024లోనే సౌత్ కొరియాకు తీసుకెళ్లి కొరియన్ స్టైల్ తైక్వాండో, అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్‌కు సంబంధించి డాంగ్`ఏ యÖనివర్సిటీ తైక్వాండో స్కూల్లో నెలరోజులపాటు శిక్షణ ఇప్పించారు. దాంతో మరింత రాటుదేలిన మోక్షిత్, సాక్షిత్ అంతర్జాతీయ పోటీల్లోనూ రాణిస్తున్నారు.
ఈ ఏడాది మొదట్లోనే నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన నాలుగో మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లారు. అదే వీరి అంతర్జాతీయ క్రీడారంగ ప్రవేశం. ఆ తర్వాత ఈ నెలారంభంలో వియత్నాం వెళ్లి తల్లితోపాటు విజయాలు సాధించారు.
2017 నుంచి ఇప్పటివరకు 12 రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొన్న మోక్షిత్ నాలుగు స్వర్ణ, రెండు రజత, మÖడు కాంస్య పతకాలు సాధించాడు.
ఇక 2018 నుంచి ఇప్పటివరకు 11 రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొన్న సాక్షిత్ మÖడు స్వర్ణ, ఒక రజత, మÖడు కాంస్య పతకాలు సాధించాడు.
మొత్తం మీద కొడుకులను క్రీడల్లో తీర్చిదిద్దే క్రమంలో తాను కూడా అదే క్రీడలో శిక్షణ తీసుకుంటూ రాణిస్తుండటం ద్వారా విద్యతోపాటు క్రీడాభ్యాసానికి మనసుండాలే తప్ప వయసుతో పనిలేదని డాక్టర్ శిరీష నిరూపిస్తున్నారు. విశేషం ఏమిటంటే తాను తైక్వాండోలో చేరడమే కాకుండా తన తోటి వైద్యులను కూడా మోటివేట్ చేసి వారిని కూడా తైక్వాండో శిక్షణార్థులుగా మార్చారు. ఆమె ప్రోద్బలంతోనే నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్లు గొండు గంగాధర్, హరిత, ఢిల్లీశ్వరరావు, భవానీ, వాసుదేవరావు, మాధురిలతోపాటు పలువురు వైద్య విద్యార్థినులు(మెడికోలు) ప్రస్తుతం తైక్వాండో శిక్షణ పొందుతున్నారు.






Comments