top of page

మన పిల్లలు ఎటు వెళ్తున్నారు?

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 4 hours ago
  • 3 min read
  • కౌమారంలో కత్తి పదును.. నేరాల ఊబిలో భావిభారతం

  • తల్లిని చంపిన టాపర్

  • చంపేసిన తర్వాత సంతాప సభలో నిందితులు

  • స్క్రీన్ల మాయాజాలం.. వికృత పోకడలు

  • భ్రమల్లో బతుకుతున్న తల్లిదండ్రులు

  • పెంపకంలో పర్యవేక్షణే ప్రాణాధారం

  • ఆందోళన కలిగిస్తున్న ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు

  • ఒక్క ఏడాదిలోనే 11.2 శాతం పెరిగిన జువెనైల్ నేరాల తీవ్రత

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య మనసును కలచివేస్తోంది. రూపారెడ్డి దారుణ హత్య కేవలం ఒక వార్త కాదు.. ఇది సమాజానికి, విద్యా వ్యవస్థకు, మన ఇళ్లల్లో పెరుగుతున్న పిల్లల పెంపకానికి జరిగిన ఒక పెద్ద గాయం. ఆ స్కూల్ ప్రిన్సిపల్‌ను చంపింది కత్తి కాదు... ఒక ఆలోచన. ఐదు రోజుల రెక్కీ... డబ్బుపై కన్ను... ముగ్గురు మైనర్లు... 27 కత్తిపోట్లు... ఒక ప్రాణం బలి... ఇది ఆవేశంలో జరిగిన పొరపాటు కాదు. నిందితులు ఐదు రోజుల పాటు ఆ ఇంటి పరిసరాలను గమనించి, స్కూల్ ఫీజుల డబ్బు ఇంట్లో ఉంటుందనే అంచనాతో దోపిడీ లక్ష్యంగా ప్లాన్ చేశారు. 70 సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు ముగ్గురు మైనర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రూపారెడ్డిపై పదునైన ఆయుధంతో 27 సార్లు దాడి చేసి, ఆమె ప్రాణాలు తీసి, రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్‌తో పరారయ్యారు. ఈ ఘటనలో అత్యంత భయంకరంగా కనిపిస్తున్నది కత్తి కాదు... 15, 16 ఏళ్ల మైనర్ల మెదడులో ప్లానింగ్‌తో ఒక మనిషిని చంపేంతటి నేరపూరిత నిర్ణయం ఎలా తయారైందనేది!

అసలు నేరం ఎక్కడ మొదలైంది?

సాధారణంగా ఆయుధం చేతిలోకి వచ్చినప్పుడు నేరం మొదలైందని చాలామంది భావిస్తారు. కానీ, దానికి చాలా ముందే నేరం ఆలోచనలో, మనస్తత్వంలో రూపకల్పన జరుగుతుంది. మొదట ‘నాకు డబ్బు కావాలి’ అనే కోరిక పుట్టింది. దానికి శ్రమతో కూడిన మార్గానికి బదులు ‘అది ఎక్కడ దొరుకుతుంది?’ అనే వికృతమైన షార్ట్‌కట్‌ను ఎంచుకున్నారు.

విజయనగరం జిల్లాలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు. 600కి 525 మార్కులు వచ్చాయి. బాగానే చదువుతాడు. తల్లిదండ్రులకు కూడా ‘మన పిల్లాడు బాగా చదువుతున్నాడు, భవిష్యత్తులో బాగుపడతాడు’ అనే నమ్మకం ఉంటుంది. కానీ చదువు ఒక్కటే సరిపోదు కదా. ప్రవర్తన కూడా బాగుండాలి. సినిమాల మీడియాల ప్రభావమో.. లవ్ యావలో పడ్డాడట. ఎవరో అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు, గొడవ, తల్లి మందలించింది. కానీ ఆ తర్వాత? తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లినే చంపేశాడు. ఇంట్లో దొరికిన తొమ్మిది తులాల బంగారం తీసుకుని పారిపోయాడు. ముఖ్య కారణం చూస్తే తోటి స్నేహితుడి ప్రభావం. ‘బొంబాయి వెళ్లిపోదాం, మాఫియా డాన్ అవుదాం’ అనే ఆలోచన.

దశాబ్దాలుగా అసలు ఎవడ్రా రౌడీలను, పచ్చి అవినీతిపరులను, రేపులు, హత్యలు చేసిన వాళ్లని, మాఫియా డాన్‌లని హీరోలుగా... మంచి వాళ్లని చేతగాని వాళ్లుగా ప్రోజెక్ట్ చేసింది? అసలు నేడు సమాజంలో జరుగుతుందో అర్థం అవుతుందా? పదహారేళ్ల పిల్లవాడి తలలో ‘మాఫియా డాన’ కావాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? సినిమా చూసి వచ్చిందా? నెట్‌లో చూసిందా? స్నేహితుడు చెప్పాడా? ఇంట్లో పర్యవేక్షణ లేకపోవడమా? ఇవన్నీ కలిశాయా? ఆ తండ్రి పరిస్థితి ఒక్కసారి ఊహించండి. భార్యను పోగొట్టుకున్నాడు. ఉన్న ఒక్క కొడుకు జైల్లో ఉన్నాడు. తన భార్యను చంపిన కొడుకే తన కొడుకు. రేపు బయట ఉన్నా మానసికంగా మనిషిగా బతకలేని కొడుకుని ఇక ఎలా చూసుకోవాలి? ఆ తండ్రి పడే నరకయాతన ఏ మాటల్లో చెప్పగలం?

స్పందన, రూపారెడ్డిలపై జరిగిన లాంటివి చాలా సంఘటనలు ఇండియాలో చాలా జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న ఆ రెండు, మూడు సంఘటనల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఇవి కేవలం వార్తలు కావు. మన చుట్టూ జరుగుతున్న నిజాలు. మన పిల్లలు, మన కుటుంబాలు, మన సమాజం ఎటు వెళ్తున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన సంఘటనలు. అది పక్క రాష్ట్రం కాదు మన ఊళ్లలో కూడా వచ్చేస్తాయి. ఇప్పుడైనా మనం నిద్రలేవాలి, మన కోసమే కాదు, మొత్తం సమాజం గురించి ఆలోచించాలి.

స్కూలుకే వెళ్లి... సంతాపం ప్రకటించిన పిల్లలు!

ఇక తెలంగాణలో హత్యకు గురైన స్కూలు ప్రిన్సిపల్‌ను 27 సార్లు కత్తితో పొడిచి చంపేసిన తర్వాత ఏమీ తెలియనట్టు పాఠశాలకు హాజరయ్యారు. ఆమెకు సంతాపం ప్రకటించారు. ఏమీ తెలియనట్టు నటించారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద నటన ఎలా వస్తుంది?

ఇది ఇద్దరు పిల్లల కథ కాదు... సమాజానికి హెచ్చరిక. ఈ రెండు కేసుల్లోనూ పిల్లల వయసు 15 నుంచి 16 సంవత్సరాల మధ్య. కౌమార దశ.. సైకాలజీ పరంగా అత్యంత ప్రభావితమయ్యే వయసు. మనసు ఇంకా పూర్తిగా పరిపక్వం కాని వయసు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం వాళ్ల చేతిలోకి వచ్చేసింది.

ఒకప్పుడు సినిమాల్లో రెబల్ క్యారెక్టర్లు లేటర్ టీనేజ్ పైబడిన వాళ్ల దగ్గర కనిపించేవి. ఇప్పుడు అవే పాత్రలు, ఆ ఆలోచనలు, ఆ వికృతత నట్టింట్లోకి వచ్చి వికటాట్టహాసం చేస్తున్నాయి. నెట్, పరిసరాలు, స్నేహితుల ప్రభావంతో పాటు సినిమాలు కూడా ఎంత ప్రభావం చూపిస్తున్నాయో మనం ఆలోచించాలి. సినిమా ఒకసారి రౌండ్, కానీ నెట్ అల్గారిథం 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అడ్డు అదుపు లేకుండా పిల్లలను వదిలేస్తే వాళ్లంతట వాళ్లే మంచిగా పెరుగుతారు అనుకోవడం పొరపాటు. వాళ్లను ఎవరో ఒకరు ప్రభావితం చేస్తారు. ఇంట్లో మనం చెప్పనిది బయట ఎవరో చెబుతారు. మనం చూపించనిది ఫోన్ చూపిస్తుంది. మనం ఇవ్వని సమయాన్ని, విలువను ఎవరో ఒకరు వాళ్లకు ఇస్తారు.

గణాంకాలు కూడా అదే హెచ్చరిక ఇస్తున్నాయి

ఇది కేవలం మనకు కనిపించిన రెండు ఘటనల వల్ల కలిగిన భయం కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్‌బ్యూరో 2024 గణాంకాల ప్రకారం దేశంలో జువెనైల్స్‌కు సంబంధించిన 34,878 కేసులు నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 31,365. అంటే ఒక్క ఏడాదిలో 11.2 శాతం పెరుగుదల. అదే సమయంలో పిల్లలే బాధితులుగా ఉన్న నేరాలు దేశంలో 1.87 లక్షలకు పైగా నమోదయ్యాయి. ఇవి పోలీసులకు నమోదైన కేసులు మాత్రమే. బయటకు రాని ఘటనలు ఎన్ని ఉంటాయో మనకు తెలియదు.

మన రెండు రాష్ట్రాల్లో ఇటీవల మన కళ్ల ముందే జరిగిన ఈ ఘటనలు చూస్తుంటే, మనకి దగ్గర ఊర్లో మన ఊళ్లో జరుగుతుంటే ‘ఇది మన ఇంటికి దూరంగా జరుగుతోంది’ అని మనం పిల్లి కళ్లు మూసుకున్న చందంగా తప్పించుకోలేం. ప్రతి గణాంకం వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఒక తల్లి ఉంటుంది. ఒక తండ్రి ఉంటాడు. ఒక పిల్లవాడు ఉంటాడు.

భర్తను, భార్యను చంపేసే దారుణం

దేశం మొత్తం ఒక ట్రెండ్‌లా కనిపిస్తున్న మరో దారుణం.. నమ్మించి భర్తను చంపడం, లేదా భార్యను చంపించడం. పెళ్లయి పిల్లలు ఉన్న దగ్గర కూడా, దిక్కుమాలిన స్నాప్‌చాట్‌లోనో ఇంకెక్కడో పరిచయమైన వాళ్ల కోసం భర్తను, నాలుగేళ్ల పిల్లలను కూడా చంపేసిన వార్తలు చూస్తున్నాం. పెళ్లి అంటే కేవలం శారీరక సంబంధం కాదు. మనిషికి, జంతువుకి తేడా చెప్పే సామాజిక వ్యవస్థ.

‘మా పిల్లలు బాగానే ఉన్నారు’ అనే భ్రమలో మన సమాజం బాగా భ్రమల్లో బతుకుతోంది. ముఖ్యంగా ఎగువ, దిగువ, మధ్యతరగతి అందరూ ఒకరకంగా. సాఫ్ట్‌వేర్‌లోనో, హార్డ్‌వేర్‌లోనో, వ్యాపారంలోనో ఏదో ఒకటి స్థిరపడిపోతున్నారు కదా అని అనుకుంటున్నాం. అది సరిపోతుందా? చుట్టుపక్కల భయంకరంగా మారుతున్న సమాజంలోకి మన పిల్లలను, మన తర్వాతి భావితరాలను పంపిస్తున్నాం. వాళ్లు ఎంత జీతం సంపాదిస్తారన్నదే కాదు, ఎలాంటి మనుషులుగా తయారవుతున్నారు, వారి చుట్టుపక్కల వాళ్లు ఎవరు అన్నది కూడా చూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page