top of page

కవిత ‘స్థానిక’ ఎత్తుగడ.. గుర్తింపు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 13 hours ago
  • 3 min read

మన దాయాది తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ‘స్థానిక’ వివాదం రాజుకుంటున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ ఎస్) అధ్యక్షురాలు ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావించడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. తండ్రి పార్టీ అయిన బీఆరఎస్‌తో తెగదెంపులు చేసుకుని సొంత పార్టీ పెట్టుకున్న కవిత రాజకీయంగా బలపడేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానికత అంశంపై మళ్లీ వివాదం రేపేలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. దీనికి ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రూలింగ్ ఊతంగా మారింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెర్సస్ పల్లా నిశాంత్(ఏఈఈ పోస్టు అభ్యర్థి) కేసులో అభ్యర్థి స్థానికతే విచారణాంశం. 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదివిన ఉద్యోగార్థులను మాత్రమే స్థానికులుగా పరిగణిస్తామని, మిగతావారిని స్థానికేతరులుగా పరిగణించాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన వాదనలను హైకోర్టు తిరస్కరించింది. ఏఈఈ పోస్టుకు అర్హత అయిన బీటెక్ నాలుగేళ్ల కోర్సును అభ్యర్థి తెలంగాణలోనే చేసినందున అతన్ని స్థానికుడిగానే పరిగణించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ వ్యాఖ్యలనే కవిత ప్రస్తావిస్తూ ఎప్పుడో ముగిసిపోయిన స్థానికత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేలా మాట్లాడటం ఆ చర్చలో పాల్గొన్నవారిని కూడా ఆశ్చర్యపర్చింది. తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత మళ్లీ స్థానికత వివాదం తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తున్నది. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కకుండా చేసే కుట్రలు మళ్లీ మొదలయ్యాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఇక్కడ చదివిన వారినే స్థానికులుగా గుర్తించాల్సి ఉందని, దీనికి విరుద్ధంగా ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారిని కూడా స్థానికులుగా పరిగణించాలన్న హైకోర్టు తీర్పు తెలంగాణ బిడ్డలకు నష్టం చేస్తుందన్నారు. దీనిపై తమ పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా పేర్కొంటూ కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ సమాజం భగ్గుమన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో స్థానికత అంశంపై కొట్లాడాల్సిన సమయం వచ్చిందని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఇక్కడ చదివిన వారికే స్థానికత వర్తించేలా నియమాలు పెట్టుకున్నామని, కోర్టు రూలింగ్ దానికి విరుద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 563 గ్రూప్`1 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతున్న తీరుపైనా ఆమె విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల 200 మంది వరకు రాష్ట్రేతర అభ్యర్థులు ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ తరఫున వేస్తామని ప్రకటించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో తెరపైకి వచ్చిన స్థానికత వివాదం ఇప్పటిది కాదు.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒకరకంగా కారణమైన ఈ వివాదం నిజాం కాలం నాటిది. 1919లో అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముల్కీ రూల్స్ ప్రవేశపెట్టారు. ముల్కీ అంటే స్థానిక అని అర్థం. ఈ రూల్స్ ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టిన లేదా వరుసగా 15 ఏళ్లపాటు ఆ ప్రాంతంలో నివసిస్తూ.. తిరిగి సొంత రాష్ట్రానికి వెళ్లే ఉద్దేశం లేదని అఫిడవిట్ దాఖలు చేసిన వారికి స్థానిక అర్హత లభిస్తుంది. ఇలా గుర్తింపు పొందినవారికే విద్య, ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు. అయితే తర్వాత కాలంలో ఇది అనేక మార్పుచేర్పులకు గురైంది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 119 ప్రకారం ఈ రూల్స్ తెలంగాణ ప్రాంతమంతా అమల్లో ఉండేలా చట్టబద్ధత పొందాయి. 1969లో సుప్రీంకోర్టు కూడా వీటిని సమర్థిస్తూ ధ్రువీకరించింది. అయితే 1972లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐదు సూత్రాల ప్రకారం ముల్కీ రూల్స్ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో 1977 వరకు, మిగతా తెలంగాణ ప్రాంతంలో 1980 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. అనంతరం 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371డి ని తీసుకొచ్చి ముల్కీ రూల్స్ స్థానంలో జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు. జోనల్ వ్యవస్థ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ వరుసగా నాలుగేళ్లు ఒకేచోట నివాసం ఉన్నా.. చదువుకున్న ప్రాంత స్థానికతే విద్యార్థులకు, ఉద్యోగార్థులకు వర్తిస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇటీవలి కాలంలో ఇచ్చిన రూలింగ్స్ ప్రకారం పోస్టుకు కావలసిన అర్హత పరీక్ష ఎక్కడి పూర్తి చేశారన్న దాని ఆధారంగా స్థానికత నిర్ణయించాలే తప్ప ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ చదివారన్నది ప్రామాణికత కాదని గుర్తించాలి. మరోవైపు చూస్తే ముల్కీ రూల్స్ 1980తోనే మనుగడ కోల్పోయాయి. ఇప్పుడు అమల్లో ఉన్నవి.. ఆర్టికల్ 371డి, 2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు మాత్రమే. కోర్టులు సైతం వాటినే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. కానీ కవిత ఇప్పుడు ప్రత్యేకంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్న చర్చ జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమంలో తండ్రితోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి గొడుగు కింద తెలంగాణ జాగృతి పేరుతో ఉద్యమాలు చేసి.. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆరఎస్ నీడలో ప్రభుత్వ పదవులు అనుభవించిన ఆమె తర్వాత తండ్రి, సోదరుడితో విభేదాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో సొంత కుంపటి పెట్టుకుని సరికొత్త రాజకీయ జ్వాల రగిలించడం ద్వారా తన పార్టీకి రాష్ట్రంలో మైలేజీ సాధించాలన్న వ్యూహం కనిపిస్తున్నది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page