top of page

వారి ప్రాణాలకు పాములే రక్ష!

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 2 days ago
  • 3 min read
  • చైనాలో వాటి వల్ల తప్పిన భూకంప ముప్పు

  • వెనెజువెల విపత్తు నేపథ్యంలో 50 ఏళ్లనాటి ఘటన వెలుగులోకి

  • పాములతోపాటు అనేక జంతువు జ్ఞానేంద్రియలే హెచ్చరిక వ్యవస్థలు

  • భూకంపాలకు ముందు వాటి ప్రవర్తనపై పరిశోధనల్లో వెల్లడి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

అదేంటి.. పాములు విషపూరితాలు కదా.. కాటేస్తే మరణిస్తాం కదా? మరి అవి రక్షించడమేమిటి? అన్న సందేహం కలగవచ్చు. కానీ భూకంపాల నుంచి తప్పించుకునేందుకు వాటి ప్రవర్తన గమనించగలిగితే ముప్పు తప్పినట్లే.. దానికి 50 ఏళ్ల క్రితం నాటి ఉదంతమే నిదర్శనం..

అది 1975.. ఫిబ్రవరి 4వ తేదీ.. మైనస్ 10 నుంచి 15 సెల్సీయస్ డిగ్రీల ఉష్ణోగ్రతలతో కూడి గడ్డకట్టే చలిలోనూ భూ అంతర్భాగం నుంచి వేలాది పాములు ఎవరో తరుముతున్నట్లు ఒకేసారి బయటకొచ్చేశాయి. ఆ దృశ్యాలు చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కానీ కొద్దిపాటి వ్యవధిలోనే సంభవించిన తీవ్ర భూకంపం ఆ ప్రాంతాన్ని వణికించేసింది. అప్పుడు అర్థమైంది.. భూకంపం సంభవించే సూచనలు పసిగట్టి పాములన్నీ ఒక్కుమ్మడిగా రక్షణను వెతుక్కుంటూ పైకి వచ్చాయని ప్రజలు గుర్తించారు.

ఇది అనేక సందర్భాల్లో శాస్త్రీయంగానూ రుజువైన సత్యం. కానీ దురదృష్టవశాత్తు జంతువులు, ఇతర జీవజాతులను మానవ సమాజానికి దూరంగా తరిమేస్తున్నాం. ఇళ్లలో పెంపుడు జంతువులు ఉన్నా కూడా వాటి ప్రవర్తనను పెద్దగా గమనించే పరిస్థితి లేకపోవడం వల్లే భూకంపాలను ముందే గుర్తించి తగిన రక్షణ పొందలేకపోతున్నాం. దాని ఫలితంగానే భూకంపాల తాకిడితో వెనుజువెలా శ్మశానదిబ్బగా మారింది. కేవలం నిమిషం వ్యవధిలో భూమి రెండుసార్లు తీవ్రంగా కంపించి వెనుజువెలా జనసమాజాన్ని పేకమేడలా కూల్చేసింది.ఇప్పటికే మృతుల సంఖ్య 250 దాటగా శిథిలాల కింత వేలాదిమంది చిక్కుకోవడంతో మరణాలు పదివేలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. సహాయ కార్యక్రమాలకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల శిథిలాల కింద చిక్కుకున్న వారిని, మరణించిన వారిని బయటకు తీయడంలో చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ప్రకృతి వైపరీత్యాలైన భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. విజ్ఞానశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నా మానవాళి పాలిట పెనుముత్తుగా పరిణమిస్తున్న భూకంపాలను ముందుగా పసిగట్టగలిగే సాంకేతిక మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. భూకంపాలు అధికంగా సంభవించే అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించే సాంకేతికత, భూకంపం తీవ్రతను నమోదు చేసే పరికరాలు అందుబాటులోకి వచ్చినా.. తుపాన్లు వచ్చే సూచనలను నాలుగైదు రోజుల ముందే పసిగట్టి హెచ్చరించి, అప్రమత్తం చేసే వ్యవస్థలు లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తరచూ భూకంపాలు విలయం సృష్టిస్తున్నాయి. మానవుడికి, అతడు సృష్టిస్తున్న సాంకేతికతకు అది సాధ్యం కాకపోయినా ప్రకృతిలోనే అనేక జీవజాతులకు భూకంపాలను ముందుగానే గుర్తించే రక్షణ వ్యవస్థ వాటి శరీర నిర్మాణంలోనే అంతర్గతంగా ఉండటం విశేషం.

ముందస్తు సంకేత వ్యవస్థ

భూకంపాల దాడి గురించి ప్రకృతిలోని కొన్ని జీవులకు ముందుగానే సమాచారం అందుతుంది. భూమి కంపించడానికి కొన్ని గంటల ముందే పక్షులు, జంతువులు అసాధారణ రీతిలో ప్రవర్తిస్తాయి. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో సహజశైలికి భిన్నంగా ఉండే వాటి ప్రవర్తనపై దశాబ్దాలుగా జీవశాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. జంతువుల సహజ అంతర్ దృష్టి, వాటి జ్ఞానేంద్రియాలు మానవ నిర్మిత యంత్రాల కంటే చాలా వేగంగా స్పందిస్తాయని తేలింది. చరిత్రలో జంతువుల హెచ్చరికల వల్ల వేలాది మంది ప్రాణాలు కాపాడగలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. జంతువులకు ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన ముందస్తు సమాచారం ఎలా అందుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయోగాలు జరుపుతున్నారు. భూమి కంపించినప్పుడు ప్రధానంగా రెండు రకాల తరంగాలు ఉత్పన్నమవుతాయని పరిశోధనలు వెల్లడించాయి. మొదట వచ్చే ప్రైమరీ తరంగాలు అధికవేగంతో ప్రయాణిస్తాయి. వీటిని మానవుల ఇంద్రియాలు పసిగట్టలేవు. అయితే కుక్కలు, పిల్లులు వంటి జంతువుల్లో ఉండే సున్నితమైన శ్రవణ, జ్ఞానేంద్రియాలు ఈ సూక్ష్మ తరంగాల ప్రకంపనలను పసిగట్టగలుగుతాయి. జంతువులు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలిపోయేయందుకు తగినంత సమయం ఇస్తాయి. మరో అధ్యయనం ప్రకారం.. భూకంపం సంభవించే ముందు భూగర్భంలో రాళ్ల మధ్య ఘర్షణ తీవ్రత పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల భూమి లోపలి పొరల్లో ఉండే రేడాన్ వంటి వాయువులు ఉపరితలానికి విడుదలవుతాయి. కుక్కలు ఈ గ్యాస్ వాసనలను సులభంగా గుర్తిస్తాయి. అలాగే సముద్రపు జీవులు తమ చుట్టుపక్కల ఉండే నీటి ఉష్ణోగ్రత, నీటి రసాయన మార్పులను గ్రహించగలుగుతాయి. జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు భూకంపాలు ఎక్కువగా సంభవించే ఇటలీ పర్వత ప్రాంతాల్లో ఆవులు, గొర్రెలు, కుక్కలకు జీపీఎస్ చిప్‌లు అమర్చారు. భూకంపం సంభవించడానికి 20 గంటల ముందు నుంచే ఈ జంతువుల ప్రవర్తన, కదలికల్లో స్పష్టమైన తేడాలను ఆ చిప్‌ల ద్వారా గుర్తించారు. క్యాట్‌ఫిష్ వంటి చేపలు అయస్కాంత క్షేత్రాల్లో వచ్చే స్వల్ప తేడాలను గ్రహించి భూకంపానికి ముందే నీటిలో ఎగిరిపడుతుంటాయని జపాన్ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు.

చరిత్రలో అనేక ఘటనలు

ఆ క్రమంలోనే చైనాలో వేలాది ప్రాణాలను కాపాడిన సంఘటన ప్రస్తావనార్హం. 1975 ఫిబ్రవరి నాలుగో తేదీన చైనాలోని హైచెంగ్ నగరంలో భూకంపానికి ముందు జరిగిన సంఘటనలు జంతువుల ముందుచూపునకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పైన పేర్కొన్న రోజు అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు క్షీణించాయి. అంతటి తీవ్రమైన చలిలో సాధారణంగా భూగర్భంలో శీతాకాల నిద్రలో ఉండే వందలాది విషసర్పాలు అకస్మాత్తుగా తాము ఆశ్రయం పొందుతున్న కలుగుల నుంచి బయటకు రావడం ప్రారంభించాయి. అయితే గడ్డకట్టే చలి తీవ్రత తట్టుకోలేక మంచుపైనే గిలగిలాకొట్టుకుని చనిపోయినా తమ నివాసాలను మాత్రం వీడాయి. పాములతో పాటు వీధికుక్కలు విపరీతంగా అరుస్తూ ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తడానికి ప్రయత్నించాయి. ఎలుకలు గుంపులు గుంపులుగా వీధుల్లో అడ్డదిడ్డంగా పరుగులు తీశాయి. పెంపుడు కోళ్లు తమ గూళ్లకు వెళ్లడానికి అస్సలు ఇష్టపడలేదు. జంతువుల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును అధికారులు గమనించి.. అది ఏదో భారీ ప్రమాదానికి సంకేతంగా భావించారు. వెంటనే హైచెంగ్ నగర ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే పెను భూకంపం సంభవించి వేలాది భవనాలు కూలిపోయినప్పటికీ భారీ ప్రాణనష్టం తప్పింది.

మరికొన్ని ఘటనలు

2004లో థాయిలాండ్, శ్రీలంక హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సునామీ రావడానికి కొద్ది నిమిషాల ముందు థాయిలాండ్‌లోని ఏనుగులు తమ గొలుసులను తెంచుకుని ఎత్తయిన ప్రాంతాలకు పరుగెత్తాయి. శ్రీలంకలోని యాలా నేషనల్ పార్క్‌లో జంతువులు కూడా ముందే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయాయి. ఇటలీలోని లైకులా నగరంలో 2009లో 6.3 తీవ్రతతో భూకంపం రావడానికి ఐదు రోజుల ముందే అక్కడి కప్పలు తమ నివాస స్థలాలను వదిలి పారిపోయినట్లు జర్నల్ ఆఫ్ జువాలజీ నివేదించింది. 1906లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో సంభవించిన భారీ భూకంపానికి ముందు రాత్రంతా కుక్కలు వింతగా అరవడం, గుర్రాలు బెదిరిపోవడం వంటి ఘటనలు రికార్డయ్యాయి. అయితే అమెరికా భూగర్భ సర్వే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జంతువుల ప్రవర్తనను ప్రామాణికంగా తీసుకుని అధికారికంగా భూకంప హెచ్చరికలు జారీ చేయడం అసాధ్యం. అయితే కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాధనాల ద్వారా జంతువుల సంకేతాలను విశ్లేషించి భారీ ప్రమాదాలను ముందే పసిగట్టవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ విపత్తు హెచ్చరికలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడం ద్వారా భవిష్యత్తులో వేలాది ప్రాణులను రక్షించుకునే అవకాశం కలుగుతుంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page