చైనా దుర్నీతికి చెప్పుదెబ్బ!
- DV RAMANA

- 5 hours ago
- 3 min read

తనకు పెద్దగా పట్టులేని బంగాళాఖాతంలో ఇతర చిన్న దేశాల సాయంతో పాగా వేసి ఇంతవరకు ఈ సాగరంపై సంప్రదాయకంగా భారత్‌కు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న చైనాకు ఊహించని విధంగా మరోవైపు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణచైనా సముద్రంపై డ్రాగన్ దేశం పెత్తనం ఎంతమాత్రం చెల్లనేరదని స్పష్టం చేస్తూ అమెరికా సహా 14 దేశాలు బహిరంగంగా ప్రకటించడం, మరోవైపు అదే సాగర జలాలు ప్రాదేశిక సరిహద్దులుగా ఉన్న దేశాలతో సహా 37 దేశాలు చైనా చెలాయిస్తున్న పెత్తనాన్ని సవాల్ చేయడం చైనాకు ఊహించని శరాఘాతంగా అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న కీలక ప్రాంతాన్నే దక్షిణ చైనా సముద్రంగా వ్యవహరిస్తుంటారు. ఈ సముద్రం చుట్టూ చైనాతో పాటు తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పిన్స్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రాదేశిక జలాలు ఉన్న ప్రాంతం తమ ఆధిపత్యంలో ఉందన్న తమకు తాముగా ప్రకటించుకున్నాయి. అయితే వీటిని ఖాతరు చేయకుండా దక్షిణచైనా సముద్రానికి తానే రారాజును అన్నట్లు దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్నది. వాస్తవానికి కొన్ని దశాబ్దాల క్రితం అంటే 1939 నుంచి రెండో ప్రపంచ యుద్ధం కాలం వరకు ఈ సముద్ర ప్రాంతం జపాన్ ఆధీనంలో ఉండేది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే ఎత్తుగడలు వేసి విజయం సాధించింది. దక్షిణచైనా సముద్ర జలాల్లోకి తన యుద్ధనౌకలను పంపడంతో పాటు ఆ సముద్రం పరిధిలో ఉన్న 30 లక్షల చదరపు కిలోమీటర్ల అధిక భాగం తనదేనని చూపించేలా అన్ని ద్వీపాలను ఒకే సరళరేఖపై చూపిస్తూ తనకు అనుకూలంగా ఒక మ్యాప్‌ను విడుదల చేసింది. అప్పటినుంచీ దక్షిణచైనా సముద్రంలోకి ఇతర దేశాలను అడుగు పెట్టనీయడం లేదు. ఇన్నాళ్ల చైనా దురాక్రమణపై ఇప్పుడు ఆ ప్రాంతంలోని దేశాలు తిరస్కార ధోరణితో వ్యవహరిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తరణ, ఆధిపత్య ప్రయత్నాలు అంతర్జాతీయ సాగర చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని అమెరికా, బ్రిటన్.. మరో 12 దేశాలు తప్పుపట్టాయి. చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రాంతీయ సమగ్రత, సుస్థిరతలకు విఘాతం కలిగిస్తున్నదని ఆరోపించాయి. చైనా చర్యలను ఒక సంయుక్త ప్రటనలో తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలు, ఒప్పందాల ప్రకారం నార్వే రాజధాని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ వివాదాల పరిష్కార న్యాయస్థానం (ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్) 2016 జూలై 12న వెలువరించిన తీర్పును ఆ సంయుక్త ప్రకటనలో ప్రస్తావించారు. చైనా ప్రాదేశిక జలాలకు వెలుపల ఉన్న దక్షిణ చైనా సముద్ర జలాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న వనరులపై చైనాకు ఎలాంటి హక్కు, అధికారం లేవని ఆనాటి తీర్పులో అంతర్జాతీయ ట్రిబ్యునల్ విస్పష్టంగా ప్రకటించింది. ఆ జలాల్లో ఫిలిప్పిన్స్‌ను చైనా అడ్డుకోవడాన్ని కూడా తప్పు పట్టింది. ఈ తీర్పు వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా చైనాను మరోసారి హెచ్చరించడానికి అగ్రదేశాలు ఈ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇటీవలి కాలంలో దక్షిణ చైనా సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్న ఫిలిప్పిన్స్ కోస్ట్‌గార్డ్ నౌకలపై, చేపల వేట సాగించే ఆదేశ మత్స్యకారులపై చైనా సైనిక బలగాలు భౌతిక దాడులకు దిగుతూ వేధిస్తున్నాయి. ఈ ఘర్షణాత్మక వాతావరణం చివరికి యుద్ధానికి దారితీసేలా ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ 12 దేశాలతో పాటు 27 దేశాలతో కూటమి అయిన EROPEAN UNION (EU ) కూడా చైనా తీరును గర్హిస్తూ విడిగా మరో ప్రకటన జారీ చేసింది. ఈ పరిణామాలు దౌత్యపరంగా చైనాకు పెద్ద దెబ్బగా విశ్లేషకులు వర్ణిస్తున్నారు. కానీ చైనా మాత్రం తన పెడధోరణిని వీడటం లేదు. ఆర్బిట్రేషన్ తీర్పును అంగీకరించకుండా అప్పుడూ ఇప్పుడూ తన దుందుడుకు వైఖరినే పునరుద్ఘాటిస్తున్నది. దక్షిణ చైనా సముద్రంపై తమదే పూర్తి హక్కు, ఆధిపత్యమని, వేల సంవత్సరాల నుంచి ఇది తమ ఆస్తిగా వస్తున్నదని వాదిస్తోంది. తమ భూభాగాలపై తీర్పులు చెప్పే అధికారం అంతర్జాతీయ కోర్టులకు లేదని తెగేసి చెప్పేసింది. అక్కడితో ఆగకుండా దక్షిణ చైనా సముద్రం మధ్యలో ఉన్న విశాలమైన ఇసుక తిన్నెలు, పగడపు దీవులను తన మిలటరీ బేస్‌లుగా మార్చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పును అంగీకరిస్తే వాటన్నింటినీ కోల్పోవాల్సి వస్తుంది. మరో విషయమేంటంటే.. ఈ సముద్ర అంతర్భాగంలో బిలియన్ల బ్యారెళ్ల చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. మరోవైపు ప్రపంచ చేపల ఉత్పత్తిలో 15 శాతం వరకు దక్షిణ చైనా సముద్రం నుంచి లభిస్తున్నది. అందుకే ఈ సాగర జలాలపై తన హక్కును కోల్పోతే వీటన్నింటినీ కోల్పోయినట్లేనన్నది చైనా భావన. కాగా దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా విస్తరణ కుట్రలకు బ్రేకులు వేసేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్ కూడా ఇప్పుడు వ్యూహాత్మకంగా భాగస్వామి అయ్యింది. చైనాతో ఇబ్బంది పడుతున్న ఫిలిప్పిన్స్‌కు ఇండో`పసిఫిక్ ప్రాంతంలో శాంతి పరిరక్షణే ధ్యేయంగా తన అత్యంత శక్తివంతమైన బ్రీహస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఇప్పటికే సరఫరా చేసింది. ఈ క్షిపణి వ్యవస్థలు ఫిలిప్పిన్స్ నేరుగా తీసుకెళ్లి చైనా కళ్లెదుటే దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో మోహరిస్తున్నది. ఈ జలాల్లో విదేశీ నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి వీలు కల్పిస్తూ భారత యుద్ధనౌకలు నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి. మరోవైపు క్వాడ్ కూటమి ద్వారా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. అలాగే ఇండోనేషియాతో కలిసి హిందూ మహాసముద్రం నుంచి దక్షిణచైనా సముద్ర జలాల్లోకి దారితీసే మలక్కా జలసంధిపై పూర్తిస్థాయి నిఘా పెట్టింది. ఫిలిప్పిన్స్ లేదా తైవాన్‌పై చైనా యుద్ధానికి దిగితే మలక్కా జలసంధిలో దాని వాణిజ్య కారిడార్‌ను పూర్తిగా దిగ్బంధించే విధంగా పావులు కదుపుతున్నది.






Comments