చిన్నబోనున్న పెద్దన్న డాలర్!
- DV RAMANA

- 16h
- 3 min read

ఒకవైపు బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తుంటే మరోవైపు బ్రిక్స్ దేశాలు సొంత చెల్లింపు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ హవా నడుస్తోంది. దానికితోడు రెండోసారి అమెరికా అధ్యక్షపగ్గాలు చేపట్టిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట’ అన్న నినాదాన్ని అందుకుని తన నిర్ణయాలతో ప్రపంచ వాణిజ్య రంగాన్ని కకావికలం చేస్తున్నారు. అనేక దేశాలపై సుంకాల భారం మోపుతూ ఇబ్బందిపెడుతున్నారు. అంతర్జాతీయ విపణిలో డాలర్ ఆధిపత్యానికి చూసుకునే ఈ మిడిసిపాటు అని ప్రపంచ దేశాలు భావిస్తున్నా.. అమెరికాకు ఎదురుచెప్పలేని పరిస్థితి ఉంది. కానీ ఎట్టకేలకు అమెరికా పెత్తనానికి, గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలు) దేశాలు ముగింపు పలకాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న బ్రిక్స్ సమ్మిట్‌లో తుదిరూపు సంతరించుకోనున్న ‘డిజిటల్ పేమెంట్ సిస్టమ’ ఒక సంచలనంగా కానుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం కొత్త కరెన్సీ కాదు.. ఒక కొత్త వ్యవస్థ. చాలా కాలంగా బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ తెస్తాయని ప్రచారం జరిగింది. కానీ చైనా యువాన్ ఆధిపత్యం పెరుగుతుందన్న భయం, దేశాల మధ్య ఆర్థిక అసమానతల వల్ల అది సాధ్యం కాలేదు. అందుకే ఇప్పుడు ఒక మెట్టు దిగి, కరెన్సీకి బదులుగా ఏకంగా ఉమ్మడి డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నారు. ఈ వ్యవస్థ మన దేశంలోని యూపీఐ తరహాలో సభ్య దేశాల డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానిస్తుంది. అంటే భారత్ తన డిజిటల్ రూపాయిని, చైనా తన డిజిటల్ యువాన్‌ను నేరుగా వాడుకోవచ్చు. మధ్యలో డాలర్ ప్రసక్తి ఉండదు. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యం, చెల్లింపులన్నీ అమెరికన్ డాలర్ రూపంలోనే జరుగుతున్నాయి. దీనివల్ల అదనపు భారం మోయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య ఉండదు. మన దేశంలో యూపీఐ సాధించిన విజయం దీనికి స్ఫూర్తిగా నిలుస్తోంది. రష్యా నుంచి గతంలో చమురు కొన్నప్పుడు ‘రూపీ ట్రాప’ (భారీగా రూపాయలు పేరుకుపోవడం) సమస్య తలెత్తిన విషయాన్ని గుర్తుచేస్తున్న ఆర్థిక నిపుణులు అటువంటి సమస్యలను అధిగమించడానికి కొత్త సిస్టమ్ ఉపయోగపడుతుందంటున్నారు. రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా కొత్త వ్యవస్థ పనిచేస్తుంది. చిన్న చిన్న లావాదేవీలను ఎప్పటికప్పుడు సెటిల్ చేయకుండా ఒక నిర్ణీత కాలం తర్వాత నికర వ్యత్యాసాన్ని (నెట్ అమౌంట్) మాత్రమే బదిలీ చేస్తారు. దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. ఒక దేశానికి మరో దేశ కరెన్సీ అత్యవసరంగా కావాల్సి వచ్చినప్పుడు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు నేరుగా కరెన్సీలను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. కాగా అమెరికా అప్పులు దాదాపు 39 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడటం ప్రమాదకరమని చాలా దేశాలు భావిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాను ‘స్విఫ్ట’ నుంచి తొలగించి, వారి నిధులను స్తంభింపజేయడం చూసిన చైనా, ఇండియా వంటి దేశాలు తమ సొంత వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే బ్రిక్స్ తీసుకువచ్చే ఈ పేమెంట్ వ్యవస్థ భవిష్యత్తులో గ్లోబల్ షాక్ అబ్జార్బర్‌లా పనిచేసే అవకాశం ఉంది. అయితే ఇది అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే చాలా దేశాల్లో డిజిటల్ కరెన్సీలు ఇంకా ట్రయల్ దశలోనే ఉన్నాయి. అయితే భారత్ ఇప్పటికే తన యూపీఐ ని యూఏఈతో అనుసంధానించింది. ఇదే మోడల్‌ను బ్రెజిల్, చైనా వంటి దేశాలకు విస్తరిస్తూ క్రమంగా బ్రిక్స్ పేమెంట్ నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. ఇది రానున్న రోజుల్లో అమెరికాను సవాల్ చేయగలుగుతుంది. కానీ ఇప్పటికిప్పుడు అమెరికా ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్య.. బంగారం, వెండి రేట్లు పెరుగుదలే. గత కొన్ని రోజులుగా పెడుతూ లేస్తూ బంగారం, వెండి ధరలు కనబరుస్తున్న తీవ్ర ఊగిసలాట ధోరణి సాధారణమైనది కాదు. మార్కెట్‌లో గంటల వ్యవధిలోనే రేట్లు మారిపోతుండటం, ధరల మార్పుతలపై జరుగుతున్న స్పెక్యులేషన్ (అంచనాలు) ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా డాలర్ గుప్పిట నుంచి బయటపడాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీన్నే ఆర్థిక నిపుణులు ‘డీ`డాలరైజేషన’ (డాలర్ రహిత ఆర్థిక వ్యవస్థ) అని వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే డాలర్ దన్ను చూసుకుని దశాబ్దాలుగా ‘సూపర్‌పవర’గా చెలామణీ అవుతున్న అమెరికా ప్రతిష్ట మసకబారుతుంది. అమెరికా అనుసరిస్తున్న అప్పుల విధానం, ప్రపంచ దేశాల్లో తగ్గుతున్న నమ్మకం ఈ మార్పులకు మూలం. ప్రపంచ దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను సురక్షితమైనదిగా ఇన్నాళ్లూ భావించిన ప్రపంచ దేశాలు తమ డబ్బును యూఎస్ బాండ్స్(అమెరికా ప్రభుత్వ బాండ్లు)లో పెట్టుబడి పెట్టేవి. తాజా పరిణామాలతో ఆ నమ్మకం సడలుతోంది. భారత్, చైనా వంటి పెద్ద దేశాలు అమెరికా నుంచి తమ డబ్బును వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. నవంబర్ 2024 నాటికి భారత్ వద్ద సుమారు రూ.21.52 లక్షల కోట్ల విలువైన అమెరికా బాండ్లు ఉండగా 2025 నవంబర్ నాటికి వాటిలో రూ.4.36 లక్షల కోట్ల బాండ్లను భారత్ విక్రయించింది. తద్వారా అమెరికా అప్పులో తన వాటాను 20 శాతానికి పైగా తగ్గించుకుంది. చైనా కూడా గత ఏడాదిలో సుమారు 8 లక్షల కోట్ల విలువైన అమెరికన్ బాండ్లను విక్రయించింది. బ్రెజిల్, ఐర్లాండ్ వంటి దేశాలు కూడా ఇదే బాటలో సాగుతున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా వస్తున్న సొమ్మును బంగారం కొనడానికి ఉపయోగిస్తున్నాయి. విదేశీ మారక నిల్వల్లో బంగారం ప్రాముఖ్యత పెరుగుతుండటంతో అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్ స్థానంలో బంగారాన్ని కూర్చోబెడుతున్నాయి. ఈ మార్పుల నేపపథ్యంలో పెద్దన్న అమెరికా తురుపు ముక్క డాలర్ త్వరలో చిన్నబోవడం ఖాయం.










Comments