చట్టం వర్సెస్ అంతరాత్మ
- DV RAMANA

- 1 day ago
- 3 min read

భారతీయ సామాజిక, చట్టపరమైన ముఖచిత్రంలో నిశ్శబ్దంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ‘వ్యభిచారం’ పట్ల సమాజం, చట్టం అవగతం చేసుకుంటున్న తీరు. ఒకప్పుడు సమాజం దృష్టిలో ‘పాపం’గా భావించబడి, ఆ తర్వాత చట్టం దృష్టిలో ‘నేరం’గా రూపాంతరం చెంది, నేడు ఇరవై ఒకటో శతాబ్దపు ఆధునిక న్యాయవ్యవస్థ పరిధిలో ‘వ్యక్తిగత హక్కు’గా చట్టబద్ధత సాధించే స్థాయికి ఈ భావన చేరుకుంది. అయితే, ఈ సుదీర్ఘ పరిణామక్రమం చట్టాల పుస్తకాల్లో స్పష్టతను తెచ్చిందేమో కానీ, మానవ మనస్సాక్షిలో, సామాజిక నైతికతలో ఒక నిరంతర అంతర్మథనాన్ని రేకెత్తిస్తూనే ఉంది. చట్టం గీసిన గీతకు, అంతరాత్మ విధించే తీర్పుకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఇది ఒక నాగరికత ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. మానవ నాగరికత తొలినాళ్లలో, వివాహ వ్యవస్థ అనే సామాజిక ఒప్పందం ఏర్పడకముందు, శారీరక సంబంధాలకు ఎటువంటి నిబంధనలు లేవు. మహాభారత ఆదిపర్వంలో ఉద్దాలక మహర్షి, శ్వేతకేతువుల వృత్తాంతం ఆనాటి ప్రకృతిసహజ స్వేచ్ఛను ప్రతిబింబిస్తుంది. తన తల్లిని మరొకరు పిలుచుకువెళ్తుంటే ఆగ్రహించిన శ్వేతకేతువుకు, అతని తండ్రి ఉద్దాలకుడు సనాతన ప్రకృతి ధర్మాన్ని గుర్తుచేస్తూ.. ‘యథా గావః స్థితాస్తాత స్వకర్మణి తథా ప్రజాః’ (ఆవులు తమ ఇష్టానుసారంగా ఎలా ప్రవర్తిస్తాయో, మనుషులు అలాగే జీవించడం లోకసహజం) అని సర్దిచెప్పడం కనిపిస్తుంది. అయితే, ఆ స్వేచ్ఛ కాలక్రమేణా స్త్రీల ఆత్మగౌరవానికి భంగంగా, సంతతి గుర్తింపునకు సమస్యగా, సామాజిక అస్థిరతకు హేతువుగా మారుతున్న తరుణంలోనే శ్వేతకేతువు వివాహ నియమాలను, కట్టుబాట్లను శాసించాల్సి వచ్చింది. వైదిక యుగంలో ఈ నియమం విశ్వక్రమమైన ‘రుతం’తో ముడిపడి పవిత్రతను సంతరించుకోగా, పురాణ ఇతిహాస కాలానికి వచ్చేసరికి పరస్త్రీ వ్యామోహం సామ్రాజ్యాల వినాశనానికి కారణమవుతుందనే కఠిన హెచ్చరికలను సమాజం ముందుంచింది. రావణుడి పతనం, కీచక వధ వంటి ఉదాహరణలు దీనికి సాక్ష్యాలు. భీష్ముడు శాంతిపర్వంలో చెప్పిన కఠిన శిక్షల వెనుక ఉద్దేశం వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూడటమే. ఇక ఇతిహాసాలలో ప్రస్తావించిన ‘పంచకన్యల’ (అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి) పవిత్రతను పరిశీలిస్తే, అక్కడ శారీరక పతివ్రత్యం కంటే వారి అంతరంగ పవిత్రతను, సంకల్ప బలాన్ని, వారు ఎదుర్కొన్న క్లిష్ట సామాజిక పరిస్థితులను బట్టి సమాజం వారిని పూజనీయులుగా చూసింది తప్ప, వారిని సంకుచిత కోణంలో విమర్శించలేదు. కాలం గడుస్తున్న కొద్దీ, వ్యభిచారం అనే భావన కేవలం భౌతిక శరీరం నుంచి మానసిక, ఆధ్యాత్మిక తత్వానికి విస్తరించింది. ఉపనిషత్తులు, గీతా చైతన్యం బాహ్య కర్మల కంటే అంతరంగ ఆలోచనలకే ప్రాధాన్యతనిచ్చాయి. ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ అన్నట్లు, శరీరం కంటే ముందే మనసులో పాపం పుడుతుందని తాత్వికులు గుర్తించారు. ఆధునిక ఆధ్యాత్మికవేత్తలు సైతం దీన్ని మూడు అంచెలుగా విభజించి విశ్లేషించారు. శారీరక స్థాయి.. సమాజం లేదా చట్టం గుర్తించే బాహ్య సంబంధం, భావోద్వేగ స్థాయి.. జీవిత భాగస్వామితో కాకుండా, మరొకరితో మానసిక సాన్నిహిత్యాన్ని, ప్రేమాభిమానాలను పంచుకుంటూ భాగస్వామిని వంచించడం, మానసిక స్థాయి.. ఆలోచనల్లో, ఊహల్లో పరవ్యక్తుల పట్ల రహస్య ఆకర్షణలను పెంచుకోవడం. ఈ తాత్విక కోణంలో చూసినప్పుడు, సమాజం ముందు పవిత్రంగా నటిస్తూ మనసులో కలుషిత ఆలోచనలు కలిగి ఉండటం కూడా వ్యభిచారమే అవుతుంది. అంటే, నిజమైన నైతికత అనేది కేవలం బాహ్య ప్రవర్తన కాదు, అది అంతరంగ చైతన్యానికి సంబంధించిన అంశం. నేటి ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో చట్టం నైతికతకంటే ‘వ్యక్తిగత స్వేచ్ఛ’, ‘పరస్పర అంగీకారం’ అనే సూత్రాలకే పెద్దపీట వేసింది. రాజ్యాంగంలోని జీవించే హక్కు ప్రకారం, సెక్స్ వర్కర్లకు గౌరవంగా బతికే హక్కు ఉందని, వారిని వేధించరాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జీవనోపాధి కోసం చేసే ఈ వృత్తిని చట్టం ఒక వ్యక్తిగత హక్కుగా గుర్తించింది. 2018లో చారిత్రాత్మక తీర్పు ద్వారా ఐపీసీ సెక్షన్ 497ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాలను క్రిమినల్ నేరం కాదని తేల్చిచెప్పింది. ‘భార్య భర్తకు ఆస్తి కాదు’ అని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ చట్టబద్ధమైన స్వేచ్ఛ విచ్చలవిడితనానికి లైసెన్స్ కాదు. ఈ నాణేనికి మరోవైపు ఉన్న కఠిన వాస్తవాలను మనం మర్చిపోకూడదు. బలవంతపు వ్యభిచారం, వేశ్యాగృహాల నిర్వహణ, దళారీ వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, మైనర్లను ఈ రొంపిలోకి దించడం ఇప్పటికీ కఠినమైన నేరాలుగానే పరిగణించబడుతున్నాయి. అలాగే, వివాహేతర సంబంధం క్రిమినల్ నేరం కాకపోయినప్పటికీ, అది కుటుంబ వ్యవస్థను కూల్చేస్తుంది కాబట్టి ఇప్పటికీ విడాకులకు బలమైన చట్టపరమైన కారణంగానే కొనసాగుతోంది. చట్టం ఇక్కడ కేవలం ‘శిక్షించే అధికారాన్ని’ వదులుకుందే తప్ప, దాన్ని సామాజికంగా సమర్థించలేదు. సహజమైన స్వేచ్ఛ నుంచి మొదలైన ఈ ప్రయాణం సామాజిక కట్టుబాట్లు, ఆధ్యాత్మిక అంతరంగ శుద్ధిని దాటుకుంటూ నేడు వ్యక్తిగత హక్కుల చౌరస్తాలో నిలబడింది. ఈ పరిణామ క్రమం మన ముందు ఒక పెద్ద యక్షప్రశ్నను ఉంచుతోంది.. చట్టం అనుమతించిన ప్రతిదీ సామాజికంగా, నైతికంగా సరైనదేనా? ‘చట్టం శరీరాన్ని నేరం చేయకుండా ఆపగలదేమో కానీ, మనసులో పుట్టే ఆలోచనలను నియంత్రించలేదు. న్యాయస్థానాలు హక్కులను రక్షించగలవు కానీ, సామాజిక సమతుల్యతను, కుటుంబ వ్యవస్థల పవిత్రతను కాపాడలేవు.’ నిజమైన నైతికత అనేది చట్టాల భయం వల్లనో, శిక్షల వల్లా వచ్చేది కాదు. అది వ్యక్తిగత నిగ్రహం, భాగస్వామి పట్ల గౌరవం, అంతరాత్మ నైర్మల్యం నుంచి ఉద్భవించాలి. చట్టం పరిధిని దాటి మనిషి తన విచక్షణను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక దేశం కేవలం చట్టాల వల్లే కాదు, అక్కడ నివసించే ప్రజల నైతిక విలువల వల్లే బలంగా ఉంటుంది. చివరగా.. చట్టం స్వేచ్ఛను ఇచ్చింది సరే.. మరి నీ అంతరాత్మ ఏమని తీర్పు ఇస్తోంది? నైతికత లేని స్వేచ్ఛ సామాజిక విచ్ఛిన్నతకు, పతనానికి దారితీస్తుందనే సత్యాన్ని గ్రహించినప్పుడే నిజమైన నాగరికత విరాజిల్లుతుంది. చట్టం సమాజానికి ఒక బాహ్య కవచం మాత్రమే, కానీ అంతరాత్మ నైర్మల్యమే సమాజానికి జీవనాడి.






Comments