top of page

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సరికొత్త రికార్డు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 hours ago
  • 2 min read

ఎట్టకేలకు ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ప్రపంచాన్ని వణికించిన ఈ యుద్ధం ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలై.. నాలుగు నెలల్లో ఒక ముగింపునకు వచ్చింది. శాంతి ఒప్పందం షరతులేమిటి? వాటిని అన్ని పక్షాలు తూచా తప్పకుండా అనుసరిస్తాయా.. లేదా?? అన్న సందేహాలను పక్కనపెడితే ప్రస్తుతానికైతే యుద్ధం ఆగింది. ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ దీనికంటే చాలాముందు నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా`ఉక్రెయిన్ యుద్ధానికి మాత్రం తుది ఎప్పుడో అంతుచిక్కడం లేదు. పలుమార్లు చర్చలు జరిగినా.. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత జోక్యం చేసుకున్నా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయే తప్ప శాశ్వత ముగింపునకు అవకాశం లేకపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా తరచూ ఉల్లంఘనకు గురవడంతో వాటికి విలువ లేకుండా పోయింది. ఇప్పటికీ ఇరుదేశాలు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా`ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న యుద్ధంగా నిలిచింది. ఇంతవరకు మొదటి ప్రపంచ యుద్ధం ఒక్కటే అతి సుదీర్ఘకాలం జరిగిన యుద్ధంగా చరిత్ర రికార్డుల్లో నమోదైంది. రష్యా`ఉక్రెయిన్ యుద్ధం దాన్ని దాటేసింది. అయినా సమీప భవిష్యత్తులో ముగిసే సూచనలు అసలు కనిపించకపోవడంతో ప్రపంచమంతా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా పేర్కొనదగిన ఉక్రెయిన్-రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో మొదలైంది. రష్యా సైన్యం సరిహద్దులు దాటి ఉక్రెయిన్ భూభాగంలోకి ప్రవేశించడంతో మొదలైన ఈ యుద్ధం కొద్ది రోజుల్లోనే ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని చర్చలు, రాయబారాలు నడిచినా ఫలితం కనిపించకపోగా.. చూస్తుండగానే నాలుగేళ్లకుపైగా గడిచిపోయింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించని వివరాల ప్రకారం ఇప్పటికే 1,575 రోజులు పూర్తి చేసుకున్న ఈ యుద్ధం స్టిల్ నాటౌట్ అన్నట్లు కొనసాగుతున్నది. దాంతో మొదటి ప్రపంచ యుద్ధం రికార్డును దాటేసింది. 1914 నుంచి 1918 వరకు సాగిన మొదటి ప్రపంచ యుద్ధ కాలపరిమితి కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.. ఇంకా కొనసాగుతుండటం విశేషం. ఒక చిన్న దేశాన్ని లొంగదీసుకోవడం చిట్టెలుకను పట్టుకున్నంత సులభం అనుకుని దాడులకు శ్రీకారం చుట్టిన రష్యా అంచనాలను తలకిందులు చేసి ఉక్రెయిన్ తన శక్తియుక్తులన్నీ ఒడ్డి ఎదురుదాడులు చేస్తూ తన ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతున్నది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా గడ్డపై సాగుతున్న అత్యంత సుదీర్ఘమైన రక్తపాత యుద్ధంగా ఇది నిలిచిపోతుంది. ఇదే సమయంలో గత శతాబ్దపు యుద్ధాలకు.. ఆధునిక యుగంలో జరుగుతున్న ఈ యుద్ధానికి మధ్య పోలికలను, వ్యత్యాసాలను రక్షణరంగ నిపుణులు నిరంతరం విశ్లేషిస్తున్నారు. ఇరవయ్యే శతాబ్ద యుద్ధాల్లో మెషిన్‌గన్లు, ట్యాంకులు, సైనిక విమానాలు వాటిని నడిపే సైనిక బలగాలు యుద్ధ గమనాన్ని నిర్దేశిస్తే.. నేటి సాంకేతిక యుగంలో డ్రోన్లు, ప్రిసిషన్ గైడెడ్ మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ యుద్ధతంత్ర వ్యవస్థలు ప్రస్తుత యుద్ధాలను శాసిస్తున్నాయి. అయినప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం మాదిరిగానే ఇప్పటి రష్యా`ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాల సైనికులు భూగర్భ బంకర్లలో ఉంటూ నెలల తరబడి పోరాడటం, భారీగా ప్రాణనష్టం జరగడం వంటి పరిణామాలు నాటి భయానక పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి. ఉక్రెయిన్ సైనికవర్గాల అభిప్రాయం ప్రకారం ఈ యుద్ధం 2022లో మొదలైనట్లు కనిపిస్తున్నా వాస్తవానికి 2014లోనే ప్రారంభమైందని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. తన సరిహద్దులో ఉన్న ఉక్రెయిన్ భూభూగంలోని అత్యంత కీలకమైన క్రిమియా ప్రాంతాన్ని రష్యా ఆనాడు ఆక్రమించింది. దాన్ని రష్యా చెర నుంచి తప్పించేందుకు అప్పటి నుంచి ఉక్రెయిన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నది. దాంతో తరచూ రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ లెక్కన చూస్తే అప్పుడే ఇరుదేశాల యుద్ధానికి పునాది పడినట్లని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ కోణంలో చూస్తే ఇది దశాబ్ద కాలపు పోరాటం. యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయంగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చారు. అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రెడ్ కార్పెట్ పరిచి మరీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. విలేకరుల సమావేశాల్లో శాంతి ప్రకటనలు చేసినా, చేతులు కలిపినా.. యుద్ధక్షేత్రంలో మాత్రం కాల్పుల ీVAరు ఆగలేదు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ పశ్చిమ దేశాల మద్దతు కోసం నిరంతరం పర్యటనలు చేస్తూనే ఉన్నారు. అమెరికా ఆర్థిక సాయం, నాటో దేశాల ఆయుధాలే ఇన్నాళ్లూ రష్యా దాడులను తట్టుకొని యుక్రెయిన్ నిలబెట్టాయన్నది వాస్తవం. ది ఎకనామిస్ట్ పత్రిక ప్రకారం యుద్ధానికి ముగింపు పలకడం అంత సులువు కాదు. 1919లో జరిగిన వెర్సైల్స్ ఒప్పందం మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించినప్పటికీ అది జర్మనీలో రేపిన అసంతృప్తి రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే రష్యా పూర్తిగా లొంగిపోయే దేశం కాదు. అలాగని ఉక్రెయిన్ తన భూభాగాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి భవిష్యత్తులో కుదిరే శాంతి ఒప్పందం తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేసేదిగా కాకుండా శాశ్వత రక్షణ హామీ ఇచ్చేదిగా ఉండాలి. కాగా ఈ సుదీర్ఘ యుద్ధం ఐరోపా రక్షణ నమూనాను పూర్తిగా మార్చేసింది. పశ్చిమదేశాల ఐక్యతకు, రష్యా సైనిక వ్యూహాలకు ఇదో పెద్ద పరీక్షగా మారింది. ఈ అనుభవాలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో యుద్ధం జరగకుండా అందరూ చూడాల్సిన అవసరం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page