top of page

నేరచరితుల ఏలుబడిలో సగం రాష్ట్రాలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 2 min read

మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకున్నవారే ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి అడుగుపెట్టి వ్యవస్థలు సక్రమంగా సాగడానికి అవసరమైన చట్టాలు చేస్తుంటారు. ఇక అదే ప్రజాప్రతినిధుల్లో మెజారిటీ పార్టీకి చెందినవారు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా గురుతరమైన రాష్ట్ర పరిపాలన బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అటువంటి ముఖ్యమంత్రులు పూర్తిగా సచ్ఛీలురు, ఏ రకమైన మచ్చలేని చరిత్ర కలిగినవారై ఉండాలని కోరుకోవడం సహజం. కానీ ప్రస్తుత కాలంలో అది అత్యాశగానే మిగిలిపోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దేశంలోని రాష్ట్రాల కు ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్నవారిలో దాదాపు సగం.. అంటే 14 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారే. ఇదేదో గిట్టనివారు చేస్తున్న ఆరోపణ కాదు. ఉబుసుపోని నాయకులు చేసిన ప్రకటనా కాదు. ఒక కేసు విచారణలో అమికస్‌క్యూరీగా వ్యవహరిస్తున్న ప్రముఖ న్యాయవాది గణాంకాలతో సహా దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు) ముందుంచిన కఠిన వాస్తవం. కేసు కూడా ప్రజాప్రతినిధుల్లో అవినీతికి సంబంధించిందే. రాష్ట్రాలను పాలించే ముఖ్యమంత్రులే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుంటే.. వారు నేరాలను ఎలా అరికట్టగలరు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నేరచరితులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడమే ఒక తప్పు అయితే.. అలా పోటీ చేసిన వారు నిజాయితీగా, స్వేచ్ఛాయుత ఎన్నికలకు దోహదపడతారన్నది అనుమానమే. ఇక ఎన్నికల్లో నెగ్గినవారు అధికార పదవులు చేపట్టకుండా నిరోధించే విషయంలో చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని హత్య, తదితర తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నవారు సైతం ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికవుతున్నారు. అధికార పార్టీల్లో ఉన్నవారైతే మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా దర్జా వెలగబెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మన నేరసామ్రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం, ఆందోళన కలగకమానవు. ఇటువంటివారు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండాలంటే వారిపై నమోదైన కేసులను పరిష్కరించి, దోషిత్వం నిర్థారించడం, శిక్షలు విధించడం ద్వారా నేరచరితులను ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించవచ్చు. ఎందుకంటే.. నిందితులపై నమోదైన కేసుల్లో వారు దోషులని తేలేవరకు, శిక్షలు పడేవరకు ఎన్నికల్లో పాల్గొనవచ్చని ప్రస్తుత చట్టాలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన క్రిమినల్ కేసులను త్వరత్వరగా పరిష్కరించాలని కోరుతూ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ అనే వ్యక్తి 2016లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దురదృష్టం ఏమిటంటే.. కారణాలు ఏవైనా గానీ ఈ కేసు విచారణ దశాబ్దం గడిచిన తర్వాత కూడా ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇదే కేసు తాజాగా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల చిట్టా కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వచ్చింది. కీలకమైన ఈ కేసు విచారణలో కోర్టు సహాయకుడి(అమికస్‌క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా ఈ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ నివేదిక ద్వారా దేశంలోని 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 14 మందిలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏకంగా 89 కేసులతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి 29 కేసులతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు చెరో 19 కేసులతో సంయుక్తంగా మÖడో స్థానంలో నిలిచారు. కేరళం ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ 18 కేసులతో వారి తర్వాత స్థానంలో ఉన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, హిమాచల్‌ప్రదేశ్ సీఎ సుఖ్వీందర్ సింగ్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, బీహార్ సీఎం సమ్రాట్ చౌదరీలతోపాటు సిక్కిం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక దేశంలో ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే.. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 58 శాతం ఎమ్మెల్యేలపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. కేరళంలో 57 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 56 శాతం, తెలంగాణలో 49 శాతం మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎంపీలు కూడా ఈ విషయంలో తక్కువ కాదు. లోక్‌సభలో మొత్తం 543 మంది సభ్యుల్లో 170 మంది(31 శాతం)పై క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. తెలంగాణలో 11 మంది, కేరళంలో 11 మంది, బీహార్‌లో 19 మంది, ఉత్తరప్రదేశ్‌లో 34 మంది లోక్‌సభ సభ్యులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక పెద్దల సభగా పేరొందిన రాజ్యసభ సభ్యుల్లోనూ 75 మంది(33 శాతం) నేరచరిత్ర కలిగినవారే కాగా వారిలో 40 మందిపై ఐదేళ్లకు మించి జైలుశిక్ష పడే కేసులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై మొత్తం 4192 క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి. జిల్లా నుంచి సుప్రీంకోర్టు వరకు ఇవన్నీ వివిధ విచారణ దశల్లో ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఏకంగా 1171 కేసులు పెండింగులో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా నివేదిక వెల్లడించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అమికస్‌క్యూరీ విజయ్ హన్సారియా తాజా విచారణ సందర్భంగా ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్రాల స్థాయిలో హైకోర్టులు కేసుల విచారణ పురోగతిని పర్యవేక్షిస్తూ జాప్యాన్ని నివారించేలా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేసులు పెండింగులో ఉన్నాయన్న సాకుతో ఎన్నికల్లో పాల్గొన్న నేతలు అధికారంలోకి వచ్చాక సాక్షులను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడటమే కాకుండా.. అధికారాన్ని దుర్వినియోగం చేసి తమపై ఉన్న కేసులను ఉపసంహరించేలా మేనేజ్ చేస్తున్న ఘటనలు ఇప్పటికే జరుగుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page