top of page

పెట్రోల్ కార్ల అమ్మకాలకు ఈ20 సెగ

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 2 min read

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తయారైంది ఆటోమొబైల్ పరిశ్రమ పరిస్థితి. తమ ప్రమేయం ఏమీ లేకపోయినా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఎదురవుతున్న దుష్పరిణామాల బాధితులుగా మారాల్సి వస్తున్నది. దేశంలో వాహన తయారీదారులు ముఖ్యంగా పెట్రోల్ వెర్షన్ వాహనాల తయారీ పరిశ్రమలు మార్కెటింగ్ సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఇది చదివిన వెంటనే ఎవరికైనా అర్థమైపోతుంది.. ఇప్పుడు ప్రస్తావిస్తున్న సమస్య ఈ20 కారణంగా ఉత్పన్నమైనదని! ఎస్.. మన దేశ ఆటోమొబైల్ రంగం ఇప్పుడు అదే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. చేయని తప్పు బారిన పడి అమ్మకాలను కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నది. ఈ పరిణామం మొత్తం ఆ పరిశ్రమల మనుగడను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆటోమొబైల్ రంగానికి చెందినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగిన పరిశీలనలు, అధ్యయనాలు చేయకుండానే, వాహనాల్లో తగిన మార్పులు చేయడానికి గడువు ఇవ్వకుండానే కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్(ఈ20)ను అమ్మకానికి పెట్టేసింది. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఇది తప్ప ఇప్పటివరకు వినియోగిస్తున్న ఈ10 పెట్రోల్‌గానీ, ప్యూర్ పెట్రోల్‌గానీ అందుబాటులో లేకుండా చేసింది. ఈ20 పెట్రోల్ పాత వాహనాల పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుందని, వాహనాల్లోని విడిభాగాలు తప్పు పట్టిపోతాయని ఆటోమొబైల్ నిపుణులు, ఆ రంగ వ్యాపారులు చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఎటువంటి ముప్పు ఉండదని, అలాంటి ప్రమాదం ఉన్నట్లు ఇంతవరకు ఎవరూ నిర్థారించలేదు.. దానికి ఆధారాలు, ఫిర్యాదులు కూడా లేవని ఒకవైపు ఆయిల్ కంపెనీలు బహిరంగంగా ప్రకటిస్తే.. మరోవైపు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ స్వయంగా పార్లమెంటులో చెప్పారు. ఇక లభించేదంతా ఈ20 పెట్రోల్ మాత్రమేనని.. ఇతర పెట్రోల్ వెర్షన్ల గురించి మర్చిపోవాల్సిందేనని తెగేసి చెప్పేశారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఇప్పటికే పాత వాహనాల యజమానులు, మెకానిక్‌లు ఈ20 పెట్రోల్ వల్ల కలిగే నష్టాలను స్వానుభవంతో, ససాక్ష్యంగా చెబుతూ సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వీడియోలు పెడుతున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమలు కూడా ఇదే విషయం చెబుతున్నా ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతింటాయన్న భయంతో గట్టిగా చెప్పలేకపోతున్నాయి. అయితే ఈ20 ప్రభావం ఇప్పుడు ఆ పరిశ్రమలపై నేరుగా పడుతోంది. ముఖ్యంగా పెట్రోల్ కార్ల అమ్మకాలు బాగా దెబ్బతింటున్నాయి. ఈ20 దెబ్బకు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ కార్ల అమ్మకాలు భారీగా పడిపోతున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల తమ వాహనాల ఇంజిన్లు పాడవుతాయన్న భయంతో చాలామంది కొనుగోలుదారులు పెట్రోల్ వాహనాల జోలికి వెళ్లేందుకు జంకుతున్నారు. దాని బదులు డీజిల్, సీఎన్‌జీ, ఈవీ వాహనాలను ఎంచుకుంటున్నారు. ఫలితంగా షోరూముల్లో పెట్రోల్ కార్లు, ఇతర వాహనాలు అమ్మకాలు లేక భారీగా నిల్వ ఉండిపోతున్నాయి. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం డీలర్ల ఇన్వెంటరీ కాలపరిమితి సాధారణంగా 30 నుంచి 33 రోజులే ఉంటుంది. కానీ ఇప్పుడది ఏకంగా రెట్టింపై 60 నుంచి 70 రోజులకు పెరిగింది. జూలై నెలలో రిటైల్ విక్రయాలు తగ్గడంతో డీలర్ల వద్ద 52 వేలకుపైగా వాహనాలు ఉండిపోయాయి. ఒకప్పుడు కార్ల మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన పెట్రోల్ వాహనాలు ఇప్పుడు సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాయి. గతంలో పెట్రోల్ కార్ల మార్కెట్ వాటా అధికంగా ఉండేది. ఇప్పుడది 41.68 శాతానికి పడిపోగా ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల మార్కెట్ పెరుగుతూ ఇప్పటికే 40.59 శాతానికి చేరింది. అంటే రెండింటి మధ్య తేడా ఒక్క శాతానికి తగ్గిపోయింది. మరోవైపు డీజిల్ కార్ల అమ్మకాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇథనాల్ బ్లెండింగ్ ప్రభావం ప్రస్తుతానికి డీజిల్‌పై లేకపోవడంతో సీఎన్‌జీ, ఈవీ వాహనాలు ఇష్టపడని వాహనదారులు పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా డీజిల్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఒక్క జూలై నెలలోనే డీజిల్ వాహనాల మార్కెట్ వాటా 17.73 శాతానికి పెరడగమే దీనికి నిదర్శనం. డీజిల్ కార్ల అమ్మకాలు పెరిగాయని ప్రముఖ బ్రాండ్ అయిన టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఉత్పత్తికి తగిన అమ్మకాలు లేక పేరుకుపోతున్న పెట్రోల్ కార్ల స్టాకును వదిలించుకునేందుకు వాహన తయారీ సంస్థలు, డీలర్లు ఎవరి స్థాయిలో వారు రకరకాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తయారీ పరిశ్రమలు పెట్రోల్ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఐ20. టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి మోడళ్లపై ఆయా కంపెనీలు ఇప్పటికే రూ.95వేల భారీ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్నాయి. పాత స్టాక్‌తోపాటు ఎంపిక చేసిన మరికొన్ని కొత్త మోడళ్లపైనా కొన్ని సంస్థలు రూ.1.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు భారీ రాయితీలు ప్రకటించి కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పెట్రోల్ వెర్షన్ కార్ల తయారీని తగ్గిస్తూ.. మరోవైపు డీలర్లపై నష్టాల భారాన్ని తగ్గించేందుకు వీలుగా.. అదే సమయంలో వినియోగదారుల నమ్మకాన్ని కాపాడుకునేందుకు సీఎన్జీ, ఈవీ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. పెట్రోల్ కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గడానికి ఈ20 పెట్రోల్ మాత్రమే ఏకైక కారణం కాదన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఇంధనాన్ని ఆదా చేసి సీఎన్జీ, ఈవీ వాహనాలను ప్రోత్సహించడం కూడా కారణమే అయితే ప్రస్తుతం సంక్షోభానికి ఈ20 పెట్రోల్ ప్రధాన కారణమని మాత్రం చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page