top of page

బిలియన్ల భవంతుల్లో ఆ కుటుంబాలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 3 min read

పాలకులు సంపద సృష్టిస్తామంటున్నారు. ప్రజలందరినీ సంపన్నులను చేస్తామంటూ వీలు చిక్కినప్పుడల్లా ఊదరగొడుతున్నారు. అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో.. వారి హామీల్లో ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియదు గానీ.. దేశంలో సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదుగుతుంటే.. పేదలు మరింత పేదలుగా పతనమవుతున్నారన్నది మాత్రం వాస్తవం. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా.. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం ముందు అవేవీ పేదలు, సామాన్యులను ధనవంతుల కేటగిరీలోకి నడిపించలేకపోతున్నాయి. కాగా ధనవంతుల్లో కూడా కొందరు మాత్రమే ఇంతింతై.. అన్నట్లుగా కోట్ల స్థాయి దాటి బిలియన్లు కూడబెట్టే స్థాయికి ఎగబాకుతున్నారు. బార్‌క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా తాజా నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెసెస్ లిస్ట్ పేరుతో రూపొందించిన ఈ జాబితా ప్రకారం రెండేళ్ల వ్యవధిలోనే మన దేశానికి చెందిన 300 పారిశ్రామిక కుటుంబాలు ఏకంగా నాలుగు సంపన్న దేశాల జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి) కంటే అధిక సంపదను సృష్టించాయంటే ఆ కుటుంబాల ఆస్తులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే.. గత రెండేళ్లలో స్టాక్ మార్కెట్‌కు చెందిన సెన్సెక్స్, నిప్టీ`50 సూచీలు నష్టపోయాయి. కానీ అదే సమయంలో ఈ కుటుంబాల సంపద మాత్రం 27.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఈ 300 కుటుంబాలు ఏకంగా రూ.138 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్లు హురున్ నివేదిక వెల్లడించింది. ఇది నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, పోలాండ్ దేశాల మొత్తం జీడీపీతో సమానమని లెక్కగట్టింది. గత రెండేళ్లలో నిఫ్టీ 1.1 శాతం, సెన్సెక్స్ 3.7 శాతం నష్టపోయాయి. కానీ ఈ కుటుంబాలు మాత్రం రెండంకెలా వృద్ధి నమోదు చేశాయి. ఈ కుటుంబాల రోజువారీ సగటు సంపాదన రూ.4076 కోట్లుగా అంచనా వేశారు. కాగా ఈ 300 కుటుంబాల జాబితాలో తొలి పది స్థానాల్లో(టాప్ 10) ఉన్న కుటుంబాల ఆస్తుల విలువే మొత్తం కుటుంబాల ఆస్తుల్లో 51 శాతం.. అంటే రూ.71 లక్షల కోట్లుగా తేల్చారు. ఈ టాప్ 300 జాబితాలో కనీసం రూ.1300 కోట్ల సంపద ఉన్న కుటుంబాలకే చోటు దక్కిందంటే.. వారంతా ఎంత రిచ్చో వేరే చెప్పనక్కర్లేదు. ఇక కుటుంబాలపరంగా చూస్తే ముకేష్ అంబానీ కుటుంబమే మొదటి స్థానంలో నిలిచింది. ఈ కుటుంబానికి చెందిన రిలయన్స్ గ్రూప్ నెట్‌వర్త్ (నికర విలువ) గత ఏడాది 8.5 శాతం తగ్గినప్పటికీ మొత్తంగా రూ.25.82 లక్షల కోట్లతో ఆ కుటుంబం తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. వారి తర్వాత కుమారమంగళం బిర్లా కుటుంబం రూ.8.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ కుటుంబం 26 శాతం వృద్ధి నమోదు చేస్తే మÖడో స్థానంలో నిలిచిన జిందాల్ ఫ్యామిలీ 40 శాతం వృద్ధితో రూ.8.02 లక్షల కోట్ల సంపద సృష్టించింది. రూ.7.7 లక్షల కోట్లతో బజాజ్ కుటుంబం నాలుగో స్థానంలో, రూ.5.5 లక్షల కోట్లతో మహీంద్రా గ్రూప్ ఫ్యామిలీ ఐదో స్థానంలో నిలిచాయి. అయితే సాధారణంగా ఒకటి, రెండు స్థానాల్లో నిలిచే అదానీ గ్రూప్ టాప్`5లోనే లేకపోవడం అనుమానం రేపవచ్చు. కానీ ఈ నివేదికను సంపన్న కుటుంబాలను రెండు కేటగిరీలుగా వర్గీకరించి రూపొందించడమే దీనికి కారణం. బహుళ తరాల వ్యాపార కుటుంబాలు, తొలి తరం వ్యాపార కుటుంబాలుగా విభజించారు. పైన పేర్కొన్నవన్నీ మల్టీ జనరేషన్.. అంటే కొన్ని తరాలుగా పారిశ్రామిక దిగ్గజాలుగా కొనసాగుతున్న కుటుంబాల వివరాలు. తొలిసారి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించి వందల కోట్ల ఆస్తులు సంపాదించిన కుటుంబాలతో రూపొందించిన తొలితరం సంపన్న కుటుంబాల జాబితాలో అదానీ గ్రూప్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కుటుంబ సంపద రూ.19.6 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఎయిర్‌టెల్‌కు చెందిన సునీల్ మిట్టల్ కుటుంబం రూ.12.1 లక్షల కోట్లతో రెండో స్థానంలో, సన్ ఫార్మాకు చెందిన దిలీప్ సంఘ్వి కుటుంబం రూ.4.55 లక్షల కోట్లతో తృతీయ స్థానంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ పూనావాలా కుటుంబం రూ.2.98లక్షల కోట్లతో నాలుగో స్థానంలో, డీమార్ట్ అధినేత రాధాకిషన్ ధమానీ కుటుంబం రూ.2.86 లక్షల కోట్లతో ఐదో స్థానంలో నిలిచాయి. హురున్ టాప్`300 జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది పారిశ్రామిక కుటుంబాలు కూడా చోటు సంపాదించాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కుటుంబం. ఈ కుటుంబం రూ.1.13 లక్షల కోట్ల ఆస్తులతో 24వ స్థానంలో నిలిచింది. బయలాజికల్ ఇ సంస్థ యజమానులైన దాట్ల కుటుంబం రూ.22 వేల కోట్లతోనూ, నవయుగ గ్రూపునకు చెందిన ప్రసాద్`దేవినేని ఫ్యామిలీ రూ.17,200 కోట్లతో, అమరరాజా బ్యాటరీస్‌కు చెందిన గల్లా రామచంద్రనాయుడు కుటుంబం రూ.15,500 కోట్ల సంపదతో ఈ జాబితాల్లో చోటు సంపాదించాయి. తొలితరం తెలుగు వ్యాపార కుటుంబాల్లో దివిస్ ల్యాబ్స్ కుటుంబం రూ.1.75 లక్షల కోట్లు, అరబిందో ఫార్మా కుటుంబం రూ.95,200 కోట్లతో, మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ కుటుంబం రూ.90,100 కోట్లతో ఈ జాబితాలో ఉన్నాయి. ఇదే కాకుండా దేశంలో బిలియన్ డాలర్లకు మించి సంపద సృష్టించిన కుటుంబాల సంఖ్య దేశంలో గణనీయంగా పెరిగినట్లు ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతున్నది. గత ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 48 శాతం పెరిగి 230కి చేరుకుంది. మరో విశేషం ఏమిటంటే.. ఈ 300 వ్యాపార కుటుంబాలు గణనీయంగా ఆస్తులు సంపాదించడంతో పాటు ఏకంగా 54 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. వీటన్నింటి ఉమ్మడి ఆదాయం రూ.56 లక్షల కోట్లుగా ఉంటే.. లాభం రూ.5.6 లక్షల కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. ఈ కుటుంబాల ఆస్తులు పెరగడమే కాకుండా ఆ మేరకు ప్రభుత్వాలకు వారు చెల్లిస్తున్న పన్ను మొత్తాలు కూడా గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, దేశ ఖజానాకు భారీగా పన్ను ఆదాయం పెంచడం రెండూ కూడా దేశాభివృద్ధికి దోహదం చేసేవే కావడం విశేషం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page