బైక్ ట్యాక్సీలపై వివాదం ఎందుకు?
- DV RAMANA

- 1 day ago
- 2 min read

ప్రయాణికుల వాహనాýను సాధారణంగా రెండు రకాలుగా పరిగణిస్తుంటారు. ఒకటి ప్రైవేటు, రెండు వాణిజ్య రకంగా వర్గీకరిస్తుంటారు. ప్రైవేటు సేవలకు అంటే ఒక కుటుంబానికి లేదా ఒక సంస్థకు మాత్రమే సేవలు అందించే వాహనాలను ప్రైవేట్ సర్వీసుగా పరిగణిస్తుంటారు. అదే నిర్ణీత రుసుముతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే సర్వీసులు నిర్వహించే వాటికి వాణిజ్య వాహనాలుగా పరిగణిస్తుంటారు. ఈ వర్గీకరణ ఆధారంగానే ఆయా వాహనాలకు విధించే పన్నులు, బీమా ప్రీమియంలు ఖరారు చేసి ప్రభుత్వం వసూలు చేస్తుంటుంది. రవాణా శాఖ ద్వారా ఈ ప్రక్రియలన్నీ జరుగుతుంటాయి. దీనికి సంబంధించి పలు చట్టాలు కూడా అమల్లో ఉన్నాయి. వీటి ప్రకారం చూస్తే వ్యక్తిగత అవసరాలకు కాకుండా డబ్బుల సంపాదనకు వినియోగించే వాహనాలన్నింటినీ బైకుల(ద్విచక్ర వాహనాలు)తో సహా వాణిజ్య(కమర్షియల్) వాహనాలుగానే పరిగణించాల్సి ఉంటుందా? లేక బైకులకు ఇలాంటి చట్టాలు వర్తించవా?? అన్న ధర్మసందేహం కాస్త ఇప్పుడు జాతీయస్థాయిలో పెద్ద న్యాయ వివాదంగా మారి.. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, గిగ్ వర్కర్స్ సంఘాల మధ్య తలెత్తిన ఈ వివాదం అక్కడి హైకోర్టుకు వెళ్లింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఏం నిర్దేశిస్తుందా? అని సంబంధిత వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లో ఇటీవలి కాలంలో కాల్ ట్యాక్సీ ఆన్‌లైన్ సర్వీసులు బాగా పెరిగిపోయాయి. ప్రజలు కూడా వీటికి బాగా అలవాటు పడిపోయారు. నేరుగా ఆటోలు, ట్యాక్సీలు బుక్ చేసుకుంటే ఛార్జీలు తడిసిమోపెడవుతాయన్నది తెలిసిందే. ఈ భారం తగ్గించి క్షణాల్లో అందుబాటులోకి వచ్చేలా ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాలు ట్యాక్సీ సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే సింగిల్ ప్రయాణికులకు ఉపయోగపడేలా బైక్ ట్యాక్సీలను కూడా రంగంలోకి దించాయి. దేశమంతటా ఆదరణ పొందుతున్న బైక్‌ట్యాక్సీలు కర్ణాటకలో మాత్రం వివాదానికి తెరలేపాయి. వీటి నిర్వహణలోని చట్టబద్ధత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ సర్వీసుల నిర్వహకులు మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలు వివాదాన్ని పెద్దది చేశాయి. బైకులు, స్కూటీలు వంటి ద్విచక్ర వాహనాలు వ్యక్తిగత సర్వీసులకు మాత్రమే ఉద్దేశించినవన్నది కర్ణాటక ప్రభుత్వ వాదన. రోడ్డు రవాణా చట్టాలు దాన్నే స్పష్టం చేస్తున్నాయని, ఆ మేరకే వాటికి రోడ్డు ట్యాక్స్, చోదకుడికి వాణిజ్యేతర డ్రైవింగ్ లైసెన్స్, బీమా ప్రీమియాలు వంటి వాటిని అమలు చేస్తున్నారని.. వీటికి విరుద్ధంగా ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే వాణిజ్య సర్వీసులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది. తన వాదనకు విరుద్ధంగా ఆరు నెలల క్రితం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. బైక్‌లను ప్యాసింజర్ ట్యాక్సీలుగా నడపడానికి ముందు భద్రత, ఇన్సూరెన్స్, ఆపరేషనల్ ప్రమాణాలతో కూడిన సమగ్ర విధానం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానంగా ప్రయాణికుల భద్రత గురించి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఆటోలు, క్యాబ్‌లతో పోలిస్తే మోటార్‌సైకిళ్లలో ప్రయాణికులకు ప్రత్యేక భద్రతా సౌకర్యాలు ఉండవని, ప్రమాదాలు జరిగినప్పుడు గాయాలు, మరణాల ముప్పు ఎక్కువగా ఉంటుందన్నది ప్రభుత్వ ఆందోళన. ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా వర్తిస్తుంది, మహిళా ప్రయాణికుల భద్రతను ఎలా నిర్ధారించాలనే అంశాలపై స్పష్టమైన నిబంధనలు ఉండాలని పేర్కొంది. రోడ్డు రద్దీ, కాలుష్యం, ప్రయాణికుల సేఫ్టీ, టూవీలర్ ప్రమాదాల్లో అధిక మరణాల రేటు వంటి అంశాలను కూడా ప్రభుత్వం తన పిటిషన్‌లో ప్రస్తావించింది. అంతకుముందు కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ సరైన విధానం రూపొందించే వరకు బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని ఆదేశించారు. దీనిపై ఓలా, ఉబర్, ర్యాపిడో, బైక్ యజమానులు, బైక్ ట్యాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అప్పీళ్లపై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ద్వాచక్ర వాహనాలను ట్రాన్స్‌పోర్ట్ వాహనాలుగా నమోదు చేసి బైక్ ట్యాక్సీలుగా నడిపేందుకు అనుమతి కోరుతూ అందే దరఖాస్తులను పరిశీలించాలని సూచించింది. ట్యాక్సీ వ్యాపారం కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) కింద వృత్తి హక్కులో భాగమేనని అభిప్రాయపడింది. కర్ణాటక ప్రభుత్వం మాత్రం మోటార్ వెహికిల్స్ యాక్ట్`1988 ప్రకారం ప్రతి వాహనాన్ని ట్యాక్సీగా నడిపే హక్కు లేదని వాదించింది. కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్ ఇవ్వడం రవాణా చట్టాలకు లోబడి ఉంటుందని తెలిపింది. మోటార్‌సైకిళ్లను మోటార్ క్యాబ్ లేదా కాంట్రాక్ట్ క్యారేజ్‌గా పరిగణించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటక ఆన్ డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్ రూల్స్` 2016 కూడా ప్రత్యేకించి నాలుగు చక్రాల క్యాబ్‌ల కోసమే రూపొందించారని, అందులో మోటార్‌సైకిళ్లను చేర్చలేదని గుర్తుచేసింది. అంతేకాకుండా బైక్ ట్యాక్సీలను అడ్డుకోవడం వల్ల డ్రైవర్లకు పూర్తిగా ఉపాధి అవకాశాలు మూసుకుపోవడం లేదని ప్రభుత్వం వాదించింది. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల డెలివరీ, లాజిస్టిక్స్ సేవల్లో మోటార్‌సైకిళ్లను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. 2025లో అమల్లోకి వచ్చిన కర్ణాటక ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ, సంక్షేమ చట్టం ద్వారా వారికి ప్రయోజనాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఇదే వాదనతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 11నే విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ వాదనలు వినిపించేందుకు సమయం కావాలన్న కర్ణాటక ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విచారణను మళ్లీ వాయిదా వేస్తున్నది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు దేశవ్యాప్తంగా బైక్ ట్యాక్సీ రంగం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది.






Comments