top of page

బానకచర్ల వెనుకబాట!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 2 min read

వృథాగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసేందుకు దశాబ్దాలనాటు ప్రతిపాదించిన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు ఇప్పటికీ వివాదాల ఉచ్చు నుంచి బయటకు రాలేకపోతున్నది. దశాబ్దాలపాటు ప్రతిపాదనల్లో మగ్గిపోయిన ఈ ప్రాజెక్టుకు 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞంలో చేర్చి, నిర్మాణానికి అంకురార్పణ చేసింది. తర్వాత ఏపీ పునర్విభజన చట్టంలో ఈ భారీ బహుళార్థసాధక పథకానికి జాతీయ హÃదా కల్పించడంతో పాటు నిర్మాణానికి అవసరమైన నిధులు అందించేందుకు అంగీకరించింది. ఎట్టకేలకు పోలవరం పట్టాలు ఎక్కిందనుకుంటే ఇప్పుడు మరో రూపంలో ప్రాజెక్టు లక్ష్యానికి గండిపడే ప్రమాదం కనిపిస్తున్నది. లోక్‌సభలో ఏపీకి చెందిన ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం కొత్త అనుమానాలు రేపుతోంది. పోలవరం ప్రాజెక్టులో గరిష్టంగా 45.72 మీటర్ల ఎత్తువరకు 194.6 టీఎంసీల నీరు నిల్వ చేసేలా స్పిల్‌వే నిర్మాణాన్ని 2021లలోనే పూర్తిచేశారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చెప్పినదాని ప్రకారం 41.15 మీటర్ల ఎత్తు వరకే నీరు నిల్వ చేసేందుకు అనుమతి ఉందట! అంటే ముందు ప్రతిపాదించినట్లు 194.6 టీఎంసీలకు బదులు 119.4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేయగలుగుతారు. ఆ మేరకు ముందు నిర్దేశించిన 7.20 లక్షల ఎకరాల్లో కోత విధించి కేవలం 1.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించగలుగుతారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మరో శరాఘాతం కూడా తగిలింది. పోలవరం నీటి నిల్వ సామర్థాన్ని, గోదావరి పరివాహక రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం`బానకచర్ల అనుసంధాన(లింక్) ప్రాజెక్టును తిరస్కరించి వెనక్కి పంపినట్లు కేంద్రం తాజాగా రాజ్యసభలోనూ వెల్లడించింది. ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. పరస్పరం సహకరించుకుంటున్నాయి. అటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒకప్పుడు చంద్రబాబు శిష్యుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టుతో పాటు పోలవరం`బానకచర్ల సహా నదుల అనుసంధాన ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 2024లో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలన్న ఉద్దేశంతో పోలవరం`బానకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నందున రాష్ట్రంలోని ఆ కూటమి ప్రభుత్వమే పంపిన ప్రతిపాదన కనుక కేంద్రం ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఆమోదిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావించాయి. అయితే దీనిపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాýనే కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తున్నది. అవే కారణాలతో ఆ ప్రాజెక్టు ప్రతిపాదనలను రాష్ట్రానికి తిప్పి పంపింది. ఈ పరిణామం ఒక విధంగా కూటమి సర్కారుకు రాజకీయ ఓటమిగా విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. పోలవరం`బానకచర్ల లింకు ప్రాజెక్టులో అంతర్ రాష్ట్ర సమస్యలు ఇమిడి ఉన్నందున దీనిపై కేంద్ర జలవనరుల సంఘం(సెంట్రల్ వాటర్ కమిషన్) లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని భావించినందునే కేంద్రం ఆ ప్రతిపాదనలను వెనక్కి పంపిందని సమాచారం. ఏపీ ప్రభుత్వం పంపిన ఈ ప్రతిపాదనలు గత ఏడాది జూన్ 17న ఎక్స్‌పర్ట్ అప్రయిజల్ కమిటీ ముందుకు వెళ్లాయి. ప్రాజెక్టుకు చెందిన ప్రాథమిక ఎంక్వైరీ రిపోర్టు, టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌లను అప్పట్లోనే కేంద్రం వెనక్కి పంపిందని చెబుతున్నారు. తాజాగా రాజ్యసభలో కేంద్రం ఇదే విషయాన్ని వెల్లడించింది. పోలవరం నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లకు తగ్గిస్తూ 2024 ఆగస్టులోనే కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో కేంద్రానికి అభ్యంతరాలు చెప్పని రాష్ట్ర ప్రభుత్వం.. అదే పోలవరం ఆధారంగా రూపొందించిన బానకచర్ల లింకు ప్రాజెక్టును కేంద్రానికి పంపి భంగపడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల తాగు, సాగునీటి అవసరాలతో పాటు గోదావరి`పెన్నా నదుల అనుసంధానానికి వీలుగా రూపొందించిన ఈ ప్రాజెక్టును తెలంగాణ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే తమ రాష్ట్ర సాగునీటి హక్కులు ప్రమాదంలో పడతాయని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీని ఫలితంగానే ఈ ప్రాజెక్టుపై మరింత లోతుగా అధ్యయనం చేయాలంటూ తిప్పి పంపింది. గోదావరి వాటర్ డిస్‌ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఉన్నాయని ఎక్స్‌పర్ట్ కమిటీకి కూడా ఫిర్యాదులు అందాయి. దాంతో కేంద్ర జలసంఘం అధ్యయనం అవసరమని కేంద్రం భావించడంతో పాటు పర్యావరణపరంగా ఎన్‌వోసీ అవసరమని స్పష్టంచేసింది. గతంలోనే కేంద్రం దీన్ని తిరస్కరించినప్పటికీ తాజాగా రాజ్యసభలో ఒక సభ్యుడు వేసిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం బయటపడింది. కాగా అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా గోదావరి నీటితో ఏ ప్రాజెక్టులు చేపట్టడానికి వీల్లేదని తెలంగాణ గట్టిగా వాదిస్తున్నది. అంతర్ రాష్ట్ర జలవివాదాలకు తావులేకుండా చూడాలని కోరుతోంది. తెలంగాణ వాదనను బలపరిచేలా కేంద్రం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను తిప్పిపంపడం ఒకరకంగా తెలంగాణ విజయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు బానకచర్ల ప్రాజెక్టుపై ఏపీలోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నీటిపారుదల రంగ నిపుణులతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటివారు బానకచర్ల ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పెద్ద ఉపయోగం లేకపోగా, ఆర్థికంగా పెనుభారమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వృథా అవుతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందన్నది ఆసక్తికరం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page