నగర జీవనానికి ట్రాఫిక్ బ్రేకులు!
- DV RAMANA

- 2 days ago
- 3 min read

పెద్ద నగరాల్లో ఉదయం ఎనిమిది నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు ప్రధాన రహదారులు విపరీతమైన రద్దీగా ఉంటాయి. ఆ సమయంలో ప్రయాణించేవారు గంటల తరబడి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోవడం వంటి సమస్యలను తరచూ ఎదుర్కొంటూనే ఉంటారు. ఇక భారీవర్షాలు పడినప్పుడైతే పరిస్థితి నరకం కంటే దారుణంగా ఉంటుందనడం అతిశయోక్తి కాబోదు. ఫలితంగా నగరాల్లో జీవిస్తున్నవారు ప్రతిరోజూ నాలుగోవంతుకు పైగా సమయాన్ని ప్రయాణానికే వెచ్చించాల్సి వస్తున్నది. పెరుగుతున్న నగరీకరణ, జనాభా, వలసలు.. అందుకు తగినట్లు జరగని రోడ్డు విస్తరణలు, డ్రైనేజీ సమస్యలు వంటివి నగర ప్రజల సమయాన్ని హరించి వేస్తున్నాయి. నగరాల్లో ట్రాఫిక్ చిక్కులు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో ఇటీవలే విడుదలైన టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్`2025 నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని మహానగరాల్లోనూ ట్రాఫిక్ రద్దీ సహజమే గానీ.. మనదేశం మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ పద్మవ్యూహంగా మారిపోయిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరాల్లో ట్రాఫిక్ రద్దీ, దాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజలు ప్రభావితమవుతున్న తీరు ఆధారంగా ఈ ఇండెక్స్ నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రపంచంలో అత్యంత రద్దీతో కిటకిటలాడుతున్న టాప్ 50 నగరాల్లో ఎనిమిది భారతదేశంలోనే ఉన్నట్లు తేలింది. ఇంకే దేశానికి చెందిన ఇంత పెద్దసంఖ్యలో నగరాలు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. ఇంకో విశేషమేంటంటే.. ప్రపంచంలో అత్యధిక రద్దీ ఉన్న నగరాల జాబితాలో మన టెక్ హబ్ బెంగళూరు నగరం ఏకంగా రెండో స్థానంలో ఉంది. దాంతోపాటు పూణే, కోల్‌కతా, జైపూర్, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. ఈ అధ్యయన వివరాలను మెన్లో వెంచర్స్ అనే సంస్థ ప్రకటించింది. ప్రపంచంలో టాప్`2గా నిలిచిన బెంగళూరు నగరంలో సగటు ప్రయాణ వేగంగా దారుణంగా తగ్గిపోయిందని అధ్యయనం ద్వారా తెలిసింది. ఒక మనిషి పరిగెత్తే వేగం కంటే కేవలం 1.4 రెట్ల వేగంతో మాత్రమే ఈ మహానగర రోడ్లపై వాహనాలు పరుగులు తీయగలుగుతున్నాయంటే.. వాహనాల పరుగులకు ట్రాఫిక్ ఏ స్థాయిలో అవాంతరాలు కలిగిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇండెక్స్ ప్రకారం మెక్సికో నగరం 78 శాతం రద్దీతో అగ్రస్థానంలో నిలవగా.. బెంగళూరు నగరంలో 74 శాతం రద్దీతో దీని తర్వాత రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరు నగర రోడ్లపై ఏదైనా వాహనంలో ఒక కిలోమీటరు ప్రయాణించడానికి సగటున 3.37 నిమిషాలు వెచ్చించాల్సి వస్తోంది. ట్రాఫిక్ జాప్యం కారణంగా ప్రయాణికులు సగటున ప్రతిరోజూ 39 నిమిషాలు నష్టపోతున్నారని నివేదిక అంచనా వేసింది. బెంగళూరులో ఈ నష్టం 40 నిమిషాలు ఉండగా, దేశంలోని ఇతర పెద్ద నగరాల్లో ఈ జాప్యం అక్కడి పరిస్థితులను బట్టి 30 నుంచి 40 నిమిషాల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ప్రపంచ టాప్`50 జాబితాలో ఉన్న భారతీయ నగరాల్లో ట్రాఫిక్ రద్దీని ఈ నివేదిక అంచనా వేసింది. 74 శాతం రద్దీతో బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, 71 శాతం రద్దీతో పూణే ఐదో స్థానంలో, 63 శాతం రద్దీతో ముంబై 18వ స్థానంలో, 60 శాతం రద్దీతో ఢిల్లీ 23వ స్థానంలో, కోల్‌కతా 59 శాతం రద్దీతో 29వ స్థానంలో, అదే శాతం రద్దీతో జైపూర్ 30వ స్థానంలో, చెన్నై 32వ స్థానంలో, 56 శాతం రద్దీతో హైదరాబాద్ 47వ స్థానంలో నిలిచాయి. ప్రపంచ ర్యాంకింగుల జాబితాలో భారతీయ నగరాల ప్రాబల్యం మన వైఫల్యాలకు అద్దం పడుతోంది. రహదారుల సామర్థ్యం, ప్రజా రవాణా వ్యవస్థల విస్తరణ కంటే వాహనాల వేగం పెరుగుతున్నందున పట్టణ, నగర రవాణా వ్యవస్థలపై ఒత్తిడి బాగా పెరుగుతున్నది. ట్రాఫిక్ రద్దీని కేవలం ఒక అసౌకర్యంగా మాత్రమే పరిగణించడానికి లేదు. సుదీర్ఘ ప్రయాణాల వల్ల ఉద్యోగులు, కార్మికుల్లో ఉత్పాదక శక్తి తరిగిపోతుంది. అలాగే ప్రయాణాలే మన సమయాన్ని హరించి వేస్తే.. ఆ మేరకు ఉత్పాదకతకు కేటాయించే సమయం తగ్గిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వ్యాపారుల రవాణా ఖర్చులు పెరుగుతాయి. సరుకు డెలివరీ షెడ్యూళ్లు గతి తప్పుతాయి. అత్యవసరం పనుýపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్యోగులు ప్రతిరోజూ కోల్పోయే 30 నుంచి 40 నిమిషాల జాప్యం కారణంగా ఏడాదికి సగటున 200 పని గంటలు నష్టపోవలసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ నెమ్మదించడం వల్ల మానవ, సామాజిక ఆరోగ్యానికి కూడా గణనీయంగా నష్టం వాటిల్లుతుంది. ఎక్కువసేపు వాహనం నడపడం వల్ల వాహన చోదకులు అధిక ఒత్తిడికి, అలసటకు గురవుతారు. అదే సమయంలో ట్రాఫిక్‌లో నిలిచి ఉండే వాహనాలను మాటిమాటికి ఆఫ్ చేయలేక స్టార్టింగ్‌లోనే ఉంచడం సహజం. దీనివల్ల వాహనాలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ ఇతర కాలుష్య కారకాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో గాలి నాణ్యతను హరించేస్తాయి. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను ఏదో ఒక్క చర్యతో పరిష్కరించలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దానికి బదులు ఒకే సమయంలో బహుళ చర్యలు తీసుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. వాటిలో కీలకమైనది ప్రజా రవాణా వ్యవస్థలను బహుముఖంగా విస్తరించడం. అలాగే ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించే క్రమంలో నగరాల్లోని అన్ని ప్రాంతాలకు మెట్రో, బస్సు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను మరింత ఆధునికీకరించి.. వాహనాలు ఎక్కువసేపు నిలవకుండా చూడాలి. సైక్లింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు అభివృద్ధి చేయడం ద్వారా ప్రధాన మార్గాల్లో వాహనాలకు అడ్డంకులు ఎదురుకాకుండా చూడవచ్చు. నగరాల విస్తరణకు సమాంతరంగా మౌలిక సౌకర్యాల విస్తరణపైనా దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక గుర్తు చేస్తోంది.






Comments