ఆస్తులు అమ్మేసుకుంటున్న NRIలు!
- DV RAMANA

- 2 days ago
- 3 min read

దూరపు కొండలు నునుపు అని అంటారు. మనదేశపు శ్రీమంతులు కూడా అదే అభిప్రాయంతో విదేశాల పట్ల మక్కువ చూపిస్తుండటం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఉన్నత చదువుల పేరుతో విదేశాలకు వెళ్తున్న చాలామంది యువత చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఇండియాకు తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయి ఉద్యోగాల, వృత్తి వ్యాపకాల్లో స్థిరపడిపోతున్నారు. యువత పరిస్థితి ఇలా ఉంటే.. విదేశాల్లో వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి అవకాశాలు చూసుకుని కుటుంబాలతో అక్కడే స్థిరపడుతున్నవారు ఇంకొందరు. ఇక స్వదేశమైన ఇండియాలో అనేక రంగాల్లో బాగా రాణించి, విపరీతంగా ఆస్తులు కూడగట్టిన ఆనేకమంది సెలబ్రిటీలు పైస్థాయికి చేరిన తర్వాత భారత్‌కు బైబై చెప్పేసి విదేశాలకు చెక్కేస్తున్నారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా క్రీడా జీవితానికి రిటైర్‌మెంట్ ఇచ్చిన తర్వాత సొంత ఊరైన హైదరాబాద్‌ను వీడి దుబాయి లో సెటిలయ్యారు. అలాగే ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు లండన్‌కు ఎగిరిపోయారు. వీరే కాకుండా అనేకమంది సినీనటులు, ఇతర రంగాల ప్రముఖులు ఒకస్థాయికి చేరిన తర్వాత ఎమిరేట్స్ లేదా ఇతర యారప్ దేశాలకు వెళ్లిపోతున్నారు. అనేకానేక కారణాలతో విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు (NRI) ఈమధ్య కొత్త ఆలోచనలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు NRI లు భారత్‌లో తమ కార్యకలాపాలను పూర్తిగా వైండప్ చేసేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆస్తులను కూడా అమ్మేసి (లిక్విడ్ క్యాష్‌గా మార్చి) తాము స్థిరపడిన దేశంలో ఆస్తుల కొనుగోలు, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీని ఫలితంగా మన దేశంలోని నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీస్థాయిలో లావాదేవీలు జరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. విదేశాల్లో స్థిరపడిన భారతీయ ప్రముఖుల ఆస్తులు రీసేల్ మార్కెట్లోకి భారీగా వస్తున్నాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. వాంకోవర్ కేంద్రంగా పనిచేస్తున్న వెల్త్‌టెక్ స్టార్టప్ రెమిటర్ విడుదల చేసిన వార్షిక NRI వెల్త్ రిపోర్టు-2026 ప్రకారం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ ఆస్తుల నిర్వహణలో భారీ మార్పుల దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా 2010-2019 మధ్య కాలంలో సినీ, క్రీడా, తదితర రంగాల్లో సెలబ్రిటీ హాదా పొందినవారు తాము సంపాదించిన ఆస్తులను ఎక్కువగా లిక్విడేట్ చేస్తున్నారని అంచనా. ఇదే అంశంపై జరిపిన సర్వేలో పాల్గొన్న NRI ల్లో 46.4 శాతం మంది ఇండియాలోని తమ ఆస్తులను తక్షణమే విక్రయించాలని భావిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే 26.2 శాతం మంది ఆరు నెలల వ్యవధిలో ఆస్తులు అమ్మేసి దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాలను కుంటున్నారట! విదేశాలకు వెళ్లి స్థిరపడటం భారతీయులకు కొత్త కాదు. అయితే అలా వెళ్లినవారు ఇండియాలో ఉన్న తమ ఆస్తులను రిటైర్‌మెంట్ అనంతరం వినియోగించే ప్రణాళికల్లోనూ, వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రుల నివాసాలుగాను, స్వదేశంతో భావోద్వేగ బంధం కొనసాగించాలన్న భావంతో ఉండేవారు. కానీ మారిన పరిస్థితుల్లో ఇక్కడి ఆస్తులను ఆర్థికంగానే చూస్తున్నారు. మెజారిటీ ఎనఆరఐలు ఆస్తి విక్రయాల ద్వారా లభించిన సొమ్మును ఇక్కడ కాకుండా విదేశాల్లో పెట్టుబడులు, కుటుంబ ఖర్చులకు వినియోగిస్తున్నారు. రీసేల్ మార్కెట్లోకి వస్తున్న ఆస్తుల్లో నివాస గృహాలే అధికంగా ఉంటున్నాయి. మొత్తం ఆస్తుల్లో నివాస గృహాలు 88.8 శాతం మేరకు ఉంటే వాటిలో 63.2 శాతం అపార్ట్‌మెంట్లేనని సర్వే ద్వారా వెల్లడైంది. రేరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనలు, సులభమైన రీసేల్ సౌకర్యం ఉండటం వల్ల అపార్ట్‌మెంట్ల రీసేల్ పెరిగింది. అదే సమయంలో వాణిజ్య ఆస్తులు, వ్యవసాయ భూముల లావాదేవీలు తక్కువగా జరుగుతున్నట్లు స్పష్టమైంది. ఈ విషయంలో 26.8 శాతంతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా, ఢిల్లీ- ఎన్‌సీఆర్, కేరళ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో పైన పేర్కొన్న ప్రాంతాల్లో ఆస్తుల విలువలు గణనీయంగా పెరగడంతో ఆ లాభాలను స్వీకరించేందుకు కూడా ఎనఆరఐలు ఆసక్తి చూపుతుండటం కూడా రీసేల్ పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మార్పు ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చిన సంక్షోభం కాదని, సంపద పున:సృష్టి మాత్రమేనని నివేదిక స్పష్టం చేసింది. అయితే ఆస్తుల అమ్మకం అనుకుంత సానుకూలంగా జరగడం లేదు. విక్రేతల్లో 81.4 శాతం మందికి సరైన కొనుగోలుదారులు అంత వేగంగా లభించడంలేదని కూడా తేలింది. ఇక్కడ ప్రత్యక్షంగా లేకుండానే ఆస్తులను అమ్మాలనుకోవడం, టైర్-1, 2 నగరాల్లోని ఆస్తుల విషయంలో యజమానుల ఊహాజనిత అంచనాలకు.. నిపుణులు కట్టే వాస్తవ విలువలకు మాధ్య భారీ వ్యత్యాసాలు ఉండటం కూడా రీసేల్ వ్యవహారాలు సజావుగా సాగకపోవడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. పదులు, వందల కోట్ల విలువైన ఆస్తులకు ఆస్థాయి స్తోమత ఉన్న కొనుగోలుదారులు పరిమిత సంఖ్యలోనే ఉంటారు. మరోవైపు పాత ఆస్తులకు బదులు కొత్త ఆస్తులు కొనాలన్న ఆలోచన కూడా చాలామందిని రీసేల్ లావాదేవీల వైపు మొగ్గుచూపనివ్వదు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 18.5 మిలియన్ల భారతీయులు ప్రవాస జీవనం కొనసాగిస్తున్నారు. వీరిలో అధికశాతం మంది భారత్‌కు శాశ్వతంగా వీడ్కోలు చెప్పి విదేశాల్లో స్థిరపడుతున్నారు. దానికి అనుగుణంగానే వారి ఆర్థిక ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. స్వదేశంలో ఆస్తులను కూడబెట్టడం కంటే తాము నివసిస్తున్న దేశంలోనో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కొత్త ఆస్తులను కూడబెట్టడం, ఆర్థిక లావాదేవీలను ప్రత్యక్షంగా, పటిష్టంగా నిర్వహించుకోవడానికే ఎక్కువ మంది ఎనఆరఐలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిణామాల ఫలితంగానే భారత్‌లోని మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఆ రంగాల నిపుణులు చెబుతున్నారు.






Comments