వాయుగుండాల వెక్కిరింత!
- DV RAMANA

- 2 days ago
- 2 min read

ఆకాశం నిండా మబ్బులు కనిపిస్తున్నాయి. కానీ వాటివైపు ఆశగా చూస్తూ ముంత ఒలకబోసుకోవడమే తప్ప అవి మాత్రం చుక్క నీరైనా రాల్చడంలేదు. నైరుతి రుతుపవనాల సీజను మొదలై రెండు నెలలు గడిచినా ఒక్కటంటే ఒక్కటైనా సరైన వర్షం కురవడం లేదు. అల్పపీడనాలు, వాయుగుండాలు సంభవిస్తున్నా.. అవి మనల్ని వెక్కిరిస్తూ ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి భారీగా వర్షాలు కురిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లు ఎల్‌నినో మనదాకా వచ్చేసినట్లే ఉంది. దాని ప్రభావంతోనే మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారినా ఆంధ్రలో కాకుండా ఒడిశా, పశ్చిమబెంగాల్, అసోం తదితర తూర్పు రాష్ట్రాల్లో భారీ వర్షాల కురిపించి వరదలతో ముంచెత్తింది. మరోవైపు దీని ప్రభావంతోనే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాని మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం తీవ్ర వర్షాభావంతో అల్లాడిపోతున్నది. వ్యవసాయ పనులతో బిజీగా ఉండాల్సిన రైతులు చినుకు జాడలేక చింతాక్రాంతులవుతన్నారు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనూ లోటు వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ నిపుణులు బాంబు పేల్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఈ సీజనులో దాదాపు 50 శాతం లోటు వర్షపాతం నమోదై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షాభావం కారణంగా భూగర్భజలాలు కూడా పాతాళం వైపు చూస్తున్నాయి. గుడ్డిలో మెల్ల అన్నట్లు.. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ, గోదావరి నదులు జలకళ సంతరించుకుని ఆయకట్టు పంటలపై ఆశలు నిలుపుతున్నాయి. ఇప్పటికీ గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ధవళేశ్వరం బ్యారేజీ గుండా సాగరం వైపు పరుగులు తీస్తుంటే.. కృష్ణమ్మ కర్ణాటకలోని రిజర్వాయర్లను నింపి మన రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు ఉరకలేస్తూ వస్తోంది. పులిచింతల, శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌లు క్రమంగా నీటిని నింపుకొంటున్నాయి. ఫలితంగా వీటి పరిధిలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు భూములు పంటల సాగుకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది. కానీ వర్షాల పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల వర్షాధారంపై ఆధారపడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికీ సాగు పనులు ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు వర్షాల మీద రైతులు ఆశలు పెట్టుకున్నారు. వాతావరణ నిపుణులు ఆగస్టు నెలను వరదల నెలగా అభివర్ణిస్తుంటారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో ఈ నెలతో పాటు సెప్టెంబర్‌లోనూ భారీ వర్షాలు కురుస్తుంటాయి. దీనివల్ల చిన్నాపెద్దా రిజర్వాయర్లతో పాటు వాగులు, వంకలు, చెరువులు నిండి ఏడాది పొడవునా మన నీటి అవసరాలను తీరుస్తుంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే ఏడాదిలో 365 రోజుల అవసరాలకు కేవలం 122 రోజుల్లో కురిసే వర్షాలే ఆధారం. ఈ నీటిని పక్కాగా ఒడిసిపట్టి జాగ్రత్తగా వినియోగించుకోకపోతే భవిష్యత్తులో కరవు పరిస్థితులతో సావాసం చేయక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కృష్ణ, గోదావరి, తదితర నదులు ప్రతి ఏటా అందిస్తున్న నీటిలో మనం వినియోగించుకోగలుగుతున్నది చాలా స్వల్పం. మిగిలిన నీరంతా వచ్చింది వచ్చినట్లే వందల టీఎంసీ స్థాయిలో సముద్రం పాలవుతున్నది. జల వినియోగం విషయంలో అప్రమత్తంగా, ముందుజాగ్రత్తతో వ్యవహరించకపోతే కరువుకాటకాలతోనే కాదు.. వరదల విలయంతో కూడా అపార నష్టం ఎదుర్కోక తప్పదని గత అనుభవాలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. దీనికి గత ఏడాది అనుభవాలనే ఉదాహరణగా పేర్కొనవచ్చు. 2025 ఏడాది పొడవునా ఏదో ఒక వైపరీత్యం జరుగుతూనే ఉంది. దేశంలో ఎక్కడో ఒకచోట జలవిలయం భారీ నష్టం కలుగుజేస్తూనే వచ్చింది. భారీవర్షాలు, వరదల ధాటికి దేశవ్యాప్తంగా 4421 మంది ప్రాణాలు కోల్పోతే.. 1.74 కోట్ల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 1.81 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఏడాది కూడా కొన్ని ప్రాంతాల్లో వరదలు విలయం సృష్టిస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. జలంతోనే ప్రాణికోటి జీవనం సాధ్యమవుతుంది. నీరు కేవలం వ్యవసాయానికే అవసరం అనుకుంటే పొరపాటే.. సకల ప్రాణికోటి దాహం తీర్చేది నీరే. మన అవసరాలతో పాటు లక్షలాది పరిశ్రమల చక్రాలు తిరగడానికి అవసరమైన ఉద్యుత్ ఉత్పత్తిలో దాదాపు సగం జలవనరుల ఆధారంగానే జరుగుతున్నదన్నది వాస్తవం. ఇంకా చెప్పాలంటే ఒక ప్రాంతం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే శక్తి జలానికి ఉంది. నీరు ఉంటే వ్యవసాయం సాగుతుంది. పంటలు పుష్కలంగా పండుతాయి. ఆహారధాన్యాలు సమృద్ధిగా అందుబాటులోకి రావడం వల్ల ధరలు కూడా తగ్గుతాయి. పంటలు పండకపోతే కొరత ఏర్పడి ఆహారధాన్యాల ధరలకు రెక్కలు తొడుక్కుంటాయి. నీరు పుష్కలంగా లేకపోతే విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయి కోతలు అనివార్యమవుతాయి. దీనివల్ల పరిశ్రమలు సక్రమంగా నడిచే పరిస్థితి లేక పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా దెబ్బతుంటుంది. ఫలితంగా ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో పాటు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల వరదలు, కరువు, వలసలు.. అన్ని వర్షాలపైనే ఆధారపడి ఉంటాయి. ప్రపంచ వాతావరణ పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. కర్బన ఉద్గారాలు పెరిగిపోతుండటం వల్ల భూతాపం పెరగడం, వర్షాలు తగ్గడం వంటి అననుకూల పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అవకాశం ఉన్నప్పుడే ప్రకృతి వనరులను కాపాడుకుంటూ.. అవసరమైన సందర్భాల్లో వాడుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను పరిరక్షించుకునేందుకు అవసరమైన ప్రాజెక్టుల నిర్మాణాలు వివాదాలు, పాలకుల నిర్లక్ష్యం, నిధుల కొరత వంటి కారణాల వల్ల సకాలంలో పూర్తికాక దాదాపు ప్రతి ఏటా వరదలు, వర్షాభావం వంటి పరిస్థితులతో పోరాడాల్సి వస్తోంది.






Comments