మారుతున్న జెన్‌జీ ఉద్యోగుల దృక్పథం!
- DV RAMANA

- 6 hours ago
- 3 min read

ఇప్ప్పుడు ఎక్కడ చూసినా జెన్‌జీ ముచ్చట్లే. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో జెన్‌జీగా పిలిపించుకున్న యువతరం ఉద్యమ కెరటాల్లా ఉవ్వెత్తున ఎగసి అక్కడి ప్రభుత్వాలనే ముంచేశాయి. పరిపాలనను తమ చెప్ప్పుచేతల్లోకి తీసుకున్నాయి. ఆ తర్వాత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో తెరపైకి వచ్చిన జెన్‌జీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై సమర శంఖం పూరించి అనూహ్య విజయం సాధించింది. సుమారు నెలరోజుల ఈ ఉద్యమం ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేలా కేంద్రం మెడలు వంచడంలో విజయం సాధించారు. ఇంటాబయటా జెన్‌జీ సాధిస్తున్న విజయాలు చూసి భవిష్యత్తు రాజకీయ అధికారం వారిదేనన్న చర్చలు కూడా సాగుతున్నాయి. ఈ తరుణంలో ఒక తాజా అధ్యయనం జెన్‌జీ తరానికి చెందిన యువ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఒక రకమైన అనాసక్తిని వెల్లడించి ఆశ్చర్యానికి, కాస్త ఆందోళనకు గురిచేసింది. పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు అదనంగా అందుబాటులోకి వస్తున్న అనేక కొత్త రంగాల్లో మెజారిటీ ఉద్యోగాలను జెన్‌జీ తరమే చేస్తోంది. అయితే గతంలో మాదిరిగా యువ ఉద్యోగులు తమ అధికారిక విధుల విషయంలో అంత చొరవ చూపడంలేదని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది. ఉద్యోగ బాధ్యతల విషయంలో వార దృక్పథం మారుతున్నట్లు ఇది అంచనా వేసింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా`2026 పేరుతో నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతీయ సంస్థల్లో అదనపు బాధ్యతలు స్వీకరించే తత్వం కొరవడుతున్నదట. దీన్నే ఎఫర్ట్ రీసెషన్ అంటారు. దీని అర్థం ఏమిటంటే.. ఉద్యోగులు తమకు అప్పగించిన రెగ్యులర్ విధులు తప్ప ఇతరత్రా అదనపు బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. అత్యవసరమై.. పై అధికారుల నుంచి ఒత్తిడి, ఆదేశాలు ఉంటే తప్ప తమ విధుల్లో భాగం కాని ఇతర పనులను నెత్తిన వేసుకునేందుకు ఆసక్తి చూపడంలేదని ఆ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఇదే అంశంపై 380 సంస్థల్లో సర్వే నిర్వహించగా, వాటిలో 63 శాతం అంటే 240 కార్యాలయాలు, సంస్థýకు చెందిన ఉద్యోగులు తమ విధుల్లో నిర్దేశిత పనికి మించి అదనపు కృషి చేయడంలేదని స్పష్టమైంది. సగటున ఈ తగ్గుదల ఐదు శాతంగా నమోదైంది. ఈ నివేదిక ప్రకారం.. ఎవరూ చెప్పకుండానే పనివేళల కంటే అదనపు సమయం పనిచేయడం, విధులకు మించి అదనపు బాధ్యతలు స్వీకరించడం వంటి చర్యలను డిస్క్రీషనరీ ఎఫర్ట్‌గా పరిగణిస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుత యువ ఉద్యోగుల్లో గణనీయంగా తగ్గిపోతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం మనదేశ ఉద్యోగుల్లో జెన్‌జీ తరం వాటా 26 శాతానికి చేరుకుంది. 2023 గణాంకాలతో పోలిస్తే ఇది దాదాపు రెండింతలు. ఈ తరం ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేయడం కంటే విధులు, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత (బ్యాలెన్స్) సాధించడం, అనువైన పని విధానం, నిరంతర నైపుణ్యాభివృద్ధి, కెరీర్ డెవలప్‌మెంట్, అర్థవంతమైన ఇతర పనులు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధిక శాతం యువత చెబుతున్నారని అధ్యయనం పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుతం అన్ని రంగాల్లో ప్రాముఖ స్థానం ఆక్రమిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కూడా యువ ఉద్యోగులపై గణనీయ ప్రభావం చూపిస్తున్నది. దీని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని పనిల ఉత్పాదకతను నిర్థారించే విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయి. కాగా అదనపు పని స్వీకరించే విషయంలో అన్ని రంగాల్లోనూ ఒకేరకమైన పరిస్థితి లేదని అధ్యయనం పేర్కొంది. అదనపు బాధ్యతలు తీసుకోకపోవడం అనే దృక్పథం మిగతా రంగాల కంటే రిటైల్ రంగంలో అత్యధికంగా 88 శాతం వరకు ఉంది. దీని తర్వాత ఐటీ, ఇతర ప్రొఫెషనల్ సర్వీసుల్లో 77 శాతం వరకు కనిపిస్తోంది. ఇక నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లో దీని ప్రభావం 71 శాతం వరకు, తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగంలో అతి తక్కువగా 44 శాతం ప్రభావం చూపుతున్నదని అధ్యయనం తేల్చింది. అయితే యాజమాన్యం గానీ తమ పైఅధికారులు గానీ తమ సంక్షేమాన్ని, అవసరాలను పట్టించుకుంటున్నారని భావిస్తే మాత్రం అదనపు పనులను భుజాన వేసుకోవడానికి ఏమాత్రం వెనుకాడటంలేదని.. ఇలా ఏకంగా 99 శాతం మంది అదనంగా పనిచేయడానికి సిద్ధమేనని అంటున్నారు. అదే నాయకత్వం నమ్మకం లేకపోతే లేదా వారు తమను విశ్వసించని పరిస్థితుల్లో అది 29 శాతానికి పడిపోతున్నది. అలాగే నాయకత్వం, యాజమాన్యాలు తమతో కలివిడిగా ఉంటూ స్ఫూర్తినిచ్చే రీతిలో వ్యవహరించే పరిస్థితుల్లో కూడా రెగ్యులర్ విధులతో పాటు అదనపు పని నిర్వహించేందుకు 98 శాతం ఉద్యోగులు ముందుకొస్తున్నారు. అలాంటి పరిస్థితి లేకపోతే అది 32 శాతానికి మాత్రమే పరిమితమవుతుందని నివేదిక వెల్లడించింది. ఒక సైకాలజిస్ట్ విశ్లేషణ ప్రకారం ఈ రకమైన ధోరణిని పని పట్ల నిబద్ధత తగ్గిపోవడంగా పరిగణించడానికి లేదు. పనిని చూసే విధానం మారుతుండటానికి సంకేతం. పని పట్ల నిబద్ధత చూపడం అంటే ఎక్కువ గంటలు పనిచేయడం లేదా నిరంతరం బిజీగా ఉండటం మాత్రమే కాదు. సమస్యలను సమర్థంగా పరిష్కరించడం, సహచరులతో సమన్వయం చేసుకుని పనిచేయడం, నాణ్యమైన ఫలితాలు సాధించడం వంటి అంశాలను నిబద్ధతకు కొలబద్దగా, నిజమైన వర్క్ ఎథిక్‌గా పేర్కొంటున్నారు. కాగా ఏఐ కారణంగా ఉద్యోగాల స్వరూపం మారుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ (ప్రారంభస్థాయి) ఉద్యోగాల్లో గంటలతరబడి పని చేయడం కంటే సృజనాత్మక ఆలోచనలు, పరిష్కార నైపుణ్యాలు, సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడం కీలకంగా మారుతోంది. వర్క్ ఫ్రం హÃమ్, హైబ్రిడ్ వర్క్, మానసిక ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన కారణంగా ఉద్యోగులు వ్యక్తిగత అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గుర్తింపు, విశ్వాసం, అర్థవంతమైన పని ఉన్నప్పుడే అదనపు శ్రమకు సై అంటున్నారు.






Comments