top of page

కాక్రోచ్ విజయానికి కాంగ్రెస్ బాజాలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 5 hours ago
  • 3 min read

ఎవరో.. ఏదో సాధిస్తే.. దాన్ని మనమే సాధించినట్లు చంకలు గుద్దుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోంది. తన చేష్టలతో ప్రజల్లో మరింత చులకన అవుతున్నది. సుమారు నెలరోజులుగా దేశంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉద్యమం కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని, అసలు ప్రజల్లోనే లేని కొందరు వ్యక్తులు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియా వేదికగా నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లీకేజీ బాధిత విద్యారులకు, వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న డిమాండ్లతో కాక్రోచ్‌లో ఉద్యమ శంఖారావడం పూరించారు. ఈ డిమాండ్లకు మద్దతుగా లడ్డాఖ్‌కు చెందిన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా విద్యావంతులను, జెన్‌జీ తరాన్ని ఉత్తేజపరిచింది. ఇదే అదనుగా ఈ నెల 20న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజు ఛలో పార్లమెంటుకు కాక్రోచ్ పార్టీ పిలుపునివ్వడంతో దేశం నలుమÖలల నుంచి బాధితులు, ఉద్యమ మద్దతుదారులు ఢిల్లీకి పోటెత్తారు. అడ్డుకున్న పోలీసు బలగాలతో ఘర్షణ పడిన యువతరం లాఠీ దెబ్బలు, పెల్లెట్ గాయాలను కూడా లెక్కచేయకుండా ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసేందుకు, నీట్ బాధిత విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు కూడా కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో మంత్రుల బృందం అంగీకరించింది. దాంతో ఉద్యమకారులతో పాటు దేశవ్యాప్తంగా యువతరం విజయోత్సవ సంబరాల్లో మునిగితేలారు. అయితే వారితో పాటు కాంగ్రెస్ కూడా సంబరాలు చేసుకుంటుండటమే చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు కూడా అదే విధంగా స్పందిస్తున్నాయి. తనది కాని, తన ప్రమేయం లేని విజయానికి సంబరాలు చేసుకోవడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతున్నది. ఉద్యమకారులు పెట్టిన డిమాండ్లకు కేంద్రం తలొగ్గడంతోనే.. మోదీ పతనం ప్రారంభమైందంటూ ఈ పార్టీలన్నీ ప్రచారం మొదలుపెట్టేశాయి. కానీ రాజకీయం గురించి తెలిసినవారికి ఇది ఒక ఎత్తుగడగానే కనిపిస్తుంది. రాజకీయాల్లో పట్టువిడుపులు అవసరం. ఎప్పటికి ఏది అవసరమో అదే చేయాలి.. అవసరం లేనిదాన్ని పట్టుకుని వేలాడకూడదు. ఈ సూత్రం బాగా తెలిసిన నేత నరేంద్ర మోదీ. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో తలపండిపోయిన ఆయన అవసరానికి ఒక అడుగు వెనక్కి వేసినా తప్పులేదు.. ఓటమి కాబోదు.. అని తెలిసినవారు కనుకే జెన్‌జీ ఉద్యమం ప్రభుత్వాన్ని కదిలించకముందే ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించారు. మంత్రి చేత రాజీనామా చేయించి, వారి డిమాండ్లకు ఓకే చెప్పడం ద్వారా ఉద్యమ ఉదృతిపై నీళ్లు చల్లారు. ముందు ముందు ఏమవుతుందో గానీ.. ప్రస్తుతానికైతే గండం గట్టెక్కినట్లే. మోదీ రాజనీతి ఇలా ఉంటే. ప్రధాన ప్రతిపక్ష కూటమిగా ఉన్న రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పక్షాలు ఊళ్లో పెళ్లికి... హడావుడి అన్నట్లుగా ఇదంతా తమ ఘనతేనని.. ఇక మోదీ పని అయిపోయినట్లుగానే హడావుడి చేస్తున్నాయి. కేంద్రమంత్రి రాజీనామా చేయగానే కాంగ్రెస్ నేతలు దాన్ని తమ విజయంగా చూపడానికి తాపత్రయపడుతున్నారు. ఛలో పార్లమెంటు నిర్వహించిన రోజు రాహుల్‌గాంధీ జంతర్‌మంతర్ వద్దకు వెళ్లడంతో పాటు, ప్రధానమంత్రి నివాసం వద్ద కాసేపు ధర్నా చేసి.. ఆ కాస్తదానికే మొత్తం ఉద్యమ క్రెడిట్‌ను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అంతకుముందు ఇరవై రోజులకుపైగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగించినప్పుడు రాహుల్ గాంధీ కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. అలాగే కాక్రోచ్ నాయకత్వం కూడా కాంగ్రెస్‌ను ఉద్యమంలోకి ఆహ్వానించలేదు. లాఠీఛార్జి తర్వాత మాత్రమే రంగంలోకి దిగిన రాహుల్‌గాంధీ సంఘీభావంతో అక్కడికి వెళ్లి ధర్నా చేశారు. ఉద్యమం విజయవంతమైన తర్వాత కూడా ఉద్యమ నేతలు కాంగ్రెస్‌ను గానీ, రాహుల్‌ను గానీ పట్టించుకోలేదు. అయినా తగుదునమ్మా అంటూ హడావుడి చేస్తున్నది. స్వయంకృతాపరాధమే కాంగ్రెస్‌ను నేటి దుస్థితికి దిగజార్చింది. దేశంలో ప్రధాన ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహిస్తున్న.. దేశంలో అతిపెద్ద, పురాతన పార్టీగా నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వంటి సీరియస్ సమస్యలపై స్పందించి, ప్రజల పక్షాన ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత తీసుకోవాలి. కానీ ఆ పని చేయకుండా ఇన్నాళ్లూ ప్రకటనలకు, నామమాత్రపు ఆందోళనలకు పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడూ తాడూ బొంగరం లేని ఒక కొత్త పార్టీ ఆ పని చేసి విజయం సాధిస్తే దాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించడం నిజంగా సిగ్గుచేటు. వేగంగా ఎదుగుతున్న బీజేపీని, దాని నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఒంటరిగా ఎదుర్కొనే సత్తా కోల్పోయిన కాంగ్రెస్ అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించినా ఫలితం లేక గత రెండున్నర దశాబ్దాలుగా అధికారానికి దూరమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చి కేజ్రీవాల్‌ను సీఎం చేసి అక్కడా అడ్రస్ లేకుండాపోయింది. ఇలా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలను ప్రోత్సహించి తన ఉనికిని తానే దెబ్బతీసుకుంది. తర్వాత కాలంలో పలు ప్రాంతీయ, జాతీయ పార్టీలతో ఐక్య ప్రతిపక్ష కూటమిగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసి కూడా తన అనాలోచిత నిర్ణయాలు, చర్యలతో వెనుకబడిపోయింది. 2024 ఎన్నికల్లో సొంతంగా వంద సీట్లు కూడా గెలవలేకపోయింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్షం హÃదాను కూడా పొందలేకపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం లభించినా.. పట్టించుకోకుండా కాక్రోచ్‌ల నిరసనలకు చప్పట్ల తాళం వేస్తున్నది. కానీ ఉద్యమకారుల తీరు చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు, దాని కూటమికి అందకుండా చేసినా ఆశ్చర్యం లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page