‘నీట్ ’గా ఇరుక్కున్న కేంద్రం!
- DV RAMANA

- 9 hours ago
- 2 min read

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం అనంతరం మళ్లీ నీట్ పరీక్షలు నిర్వహించడం, ర్యాంకర్లకు సీట్లు కేటాయించడం.. అన్నీ జరిగిపోవడంతో ఇక లీకేజీ ఉదంతం తెరమరుగైపోయినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో ఉరుము లేని పిడుగులో సోషల్ మీడియా ప్లాట్‌ఫారంపై పురుడు పోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా మళ్లీ తెరపైకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ పార్టీని నిర్వాహకులు ప్రకటించినప్పుడు అదేదో ప్రభుత్వాలపై సెటైర్లు వేసి నాలుగు లైక్‌లు, షేర్లు పొందే పోస్టు అని అనుకున్నారు. కానీ అదే ఏకు మేకై దేశవ్యాప్తంగా జెన్ జడ్ తరాన్ని కార్యోన్ముఖులను చేసింది. దేశ రాజధాని వైపు నడిపించి.. ఉద్యమించేలా ప్రేరేపించింది. ఫలితంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి ఇరకాటంలో పడింది. ఉద్యమానికి తలవంచినట్లు కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా లడ్డాఖ్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం, ఆయనకు మద్దతుగా అలాగే నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఛలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. అయితే ఈ ఉద్యమంలో దేశవ్యతిరేక శక్తులు చొరబడ్డాయని, భారత్‌ను ముక్కలు చేయాలన్న లక్ష్యంతో విదేశీ శక్తులు దీన్ని తెర వెనుక నుంచి నడిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి. వాటిని బలపరుస్తూ ఆందోళనకారులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు పార్లమెంటు భవనాన్ని ధ్వంసం చేస్తామని, దేశాన్ని మరో నేపాల్ చేస్తామని హెచ్చరించడం, కెనడా కేంద్రంగా పని చేస్తున్న ఖలిస్తానీ మద్దతుదారుడు, మనదేశ వాంటెడ్ లిస్టులో ఉన్న గురుపత్వంత్ సింగ్ పన్నున్ నీట్ ఉద్యమానికి రూ.పది కోట్లు ఇస్తానని ఆఫర్ చేసినట్లు వీడియోలు, వార్తలు వైరల్ కావడంతో.. ఇదేదో వేర్పాటువాదుల ప్రేరేపితమన్న అభిప్రాయాలు కూడా పెరిగాయి. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతాల వల్ల యువతరం తీవ్రంగా నష్టపోతున్నదని గుర్తించిన దేశంలోని మేధావివర్గం, యువతరం ఢిల్లీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా దానికి సంఘీభావంగా కాంగ్రెస్, కమÖ్యనిస్టు పార్టీల పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. మొదట్లో కేంద్రం దీన్ని తేలిగ్గా తీసుకుంది. సాయుధ పోలీసు బలగాలతో జంతర్ మంతర్ వద్ద తిష్ట వేసిన ఉద్యమకారులను చెదరగొడితే ఉద్యమం నిలిచిపోతుందని భావించింది. అయితే ఆ క్రమంలో సాయుధ బలగాలు లాఠీఛార్జీ చేయడం, పిల్లెట్లు ప్రయోగించడం, మహిళల పట్ల అమర్యాదగా వ్యవహరించడం వంటి ఘటనలు ఉద్యమానికి మరింత బలం చేకూర్చాయి. చెదిరిపోయిన ఆందోళనకారులందరూ మళ్లీ జంతర్‌మంతర్‌ను చుట్టుముట్టడంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగిరాక తప్పలేదు. ఆ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్‌లు ఉద్యమకారుల ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిపి వారి డిమాండ్లపై సంప్రదింపులు జరిపారు. ఉద్యమకారులు ప్రధానంగా నాలుగు డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టగా.. వాటిలో రెండు.. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయడం, నీట్ ప్రశ్నపత్రాల లీకేజీతో మనస్తాపానికి గురై మరణించినవారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్లకు ప్రభుత్వం స్థూలంగా సమ్మతించింది. అయితే డిమాండ్లలో అతికీలకమైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. ఉద్యమకారులు కూడా దాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. మంత్రి రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగించి తీరుతామని కూడా చర్చల అనంతరం ఉద్యమ ప్రతినిధులు ప్రకటించరు. అయితే పరిస్థితి ఒక కొలిక్కి వస్తున్నందున, ఆరోగ్యరీత్యా ఆమరణ దీక్ష విరమించాలన్న విజ్ఞప్తిని సోనమ్ వాంగ్‌చుక్ అంగీకరించారు. కేంద్రమంత్రులే ఆయనతో దీక్ష విరమింపజేశారు. ఈ పరిణామాలు చూసి ఉద్యమ సానుకూలంగా ముగిసే అవకాశం ఉందని భావించడానికి లేదు. ఎందుకంటే.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటిస్తే.. దానికి అదనంగా ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం ప్రశ్నపత్రాల లీకేజీపై తీవ్రంగా స్పందించడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. శుక్రవారం ఇదే కేసుపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నీట్`యÖజీ ప్రశ్నపత్రాల లీకేజీలు భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చట్టం తీసుకొస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా వ్యవస్థాగతంగా శాశ్వత ప్రాతిపదికన ఎటువంటి సంస్కరణలు చేపడుతున్నారో వివరిస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ధర్మాసనంలో ఉన్న జస్టిస్ పి.ఎల్.నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలు స్పందిస్తూ ప్రశ్నపత్రాల రవాణాకు వైమానికదళాన్ని వినియోగించడం వంటివి తాత్కాలిక చర్యలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ఉండేందుకు ప్రతిపాదించిన గవర్నింగ్ బాడీ, నిపుణుల బృందాలు, హైపవర్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏవిధంగా అమలు చేస్తున్నారో వివరిస్తూ నివేదిక కోరారు. అలాగే పరీక్షలకు మౌలిక వసతులపై పది కీలక అంశాలకు సంబంధించి పురోగతి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే)ని కోర్టు ఆదేశించింది. పరీక్షల నిర్వహణకు ప్రతి దశలోనూ తీసుకుంటున్న రక్షణ చర్యలపైన, ఈ అంశాల్లో డైరెక్టర్ జనరల్ పాత్రపై రిపోర్టు ఇవ్వాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్‌లో వివరాలు స్పష్టంగా లేవని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంస్కరణల అమలు తీరును నిరంతరం పరిశీలిస్తుంటామని స్పష్టం చేసింది. దీంతో కేంద్రం ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు.






padavi kanksha yentha yekkuvaindi antay nayakula lo desanni thagabettina paravaledu padavulu maatram vadalaru , okappudu vundedi oka rail durghatana jarigithy ayipoyadu ra railway manthri anukunay vallam ippudu intha jaruguthunna asalu yenduku vidya manthri ni kapaduthunnaro theliyatam ledu leakage vishayam lo andina dabbulu vaatalu andariki vunnayemo.