అపరిచితుడి చేతిలో ఉద్యమ రాయి!
- DV RAMANA

- 3 days ago
- 3 min read

ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి అపరిమితంగా పెరిగినప్పుడు దానికి ఒక బలమైన సిద్ధాంతం తోడైనప్పుడు, దానికి ఒక సమర్థమైన నాయకత్వం లభించినప్పుడు వాటి నుంచి ఒక బలమైన ఉద్యమం పుడుతుంది. కానీ అదేం చిత్రమో గానీ.. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఉద్యమం వెనుక యువజనుల్లో పేరుకుపోయిన కొండంత అసంతృప్తి కనిపిస్తున్నా.. దానికి ఒక సైద్ధాంతికత గానీ, ప్రముఖ నాయకత్వం గానీ కనిపించడం లేదు. దీన్ని నడుపుతున్న అభిజిత్ దిబ్కే గానీ.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ గానీ ప్రజలకు చిరపరిచితమైనవి కావు. ఆ పార్టీ, దాని నాయకుడు కూడా సోషల్ మీడియా ద్వారా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాల పుణ్యమా అని రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవారే. నిన్న మొన్నటి వరకు దిప్కే ఇండియాలో కూడా లేరు. విదేశీ గడ్డపై నుంచే కాక్రోచ్ పార్టీకి ప్రాణం పోసి భారత్‌లోని జెన్ జెడ్‌లో పేరుకుపోయిన అసంతృప్తిని ఉపయోగించుకుని ఉద్యమాలు, రాజకీయాలు అంటూ యువతను ఆకట్టుకున్నారు. దేశంలోని పలువురు మేథావులు కూడా దిప్కేకు వత్తాసు పలకడం ప్రారంభించారు. పార్టీకి ప్రాణం పోసిన తర్వాతే ఇండియాకు వచ్చిన దిప్కే నీట్ పేపర్ల లీకేజీని ఉద్యమాస్త్రంగా మలచుకున్నారు. ఢిల్లీలో ఉద్రిక్తతలకు, అరెస్టులకు, లాఠీఛార్జీలకు, చర్చలకు ప్రభుత్వం సిద్ధం కావడానికి కారణమైన నీట్ ఉద్యమాన్ని ఇంత తీవ్రస్థాయికి తీసుకురాగలిన అభిజిత్ దిప్కే ఎవరని ప్రశ్నిస్తే మాత్రం కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు అని మాత్రమే చెప్పగలరు తప్ప.. ఆయన నేపథ్యం, ఉద్యమానికి నిధులను ఎలా సమీకరిస్తున్నారన్నది మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేరు. ఆయన గురించిన వివరాలు కూడా అంతగా అందుబాటులో లేవు. ఉన్న కొద్దిపాటి వివరాల ప్రకారం.. ఈయన మహారాష్ట్రలో పెరిగాడు. కొంతకాలం ఆమఆద్మీ పార్టీలో పని చేశాడు. అలాగే బోస్టన్‌లో పబ్లిక్ రిలేషన్స్ కోర్సు చేశాడన్న పొడి సమాచారం తప్ప ఇతర వివరాలేవీ ఎవరికీ తెలియవు. ఆయన వెనుక ఉద్యమ నేపథ్యం గానీ, ప్రజాసేవ చేసిన దాఖలాలు గానీ అస్సలు లేవని తెలుస్తోంది. అయినా నిన్న మొన్నటి వరకు ఇండియాలో లేకుండానే, ఇక్కడి ఎవరితోనూ కనీస పరిచయడం లేకుండా అపరిచితంగానే ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నా కూడా ఇప్పటికీ ఆయన పూర్వాపరాలు గోప్యమే. అభిజిత్ నేపథ్యం, అతని ఆశయాల గురించి లేశమాత్రమైనా అవగాహన లేకుండా దేశయువత, సోకాల్ మేథావి వర్గం ఆయన వెనుక వేలంవెర్రిగా పరుగులెత్తడమే పెద్ద విడ్డూరం. ఈ ఉద్యమ కార్యాచరణ ఏమిటో.. దాన్ని భవిష్యత్తు ప్రణాళికలేమిటో.. వీటికి నిధులు ఎలా సమకూరుతున్నది కూడా ఎవరూ ఆలోచించడం లేదు. తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అందువల్ల దీన్ని ఒక అపరిచిత ఉద్యమంగా, యువజనంలో ఉన్న ఆవేశాన్ని వాడుకోవడంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఒకరకంగా మన నాయకులనే చెప్పాలి. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. రాజకీయంగా ఆ పార్టీలు పరస్పరం విభేదించుకోవచ్చు గానీ.. ఆ పార్టీల సిద్ధాంతాల మÖల సూత్రం మాత్రమే ప్రజాసంక్షేమం, దేశాభివృద్ధే. ఆ పార్టీలు నేతృత్వం వహిస్తున్న నాయకులు గురించి, ఆయా పార్టీల సిద్ధాంతాల గురించి దాదాపు దేశప్రజలందరికీ తెలుసు. అందువల్ల ఆయా పార్టీలను నడిపే ఉద్యమాల్లో జనం ఎక్కువగా పాల్గొన్నారంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న కాక్రోచ్ ఉద్యమం ఎవరి కోసం, ఎవరి వలన, ఎందువలన, ఎవరి నిధులతో జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. ఢిల్లీలో జరుగుతున్న ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారికి జునైద్ అనే వ్యక్తి ఉచితంగా ఆహారం సరఫరా చేస్తే ఆబగా తీసేసుకున్నారే తప్ప.. ఆ ఖర్చుల స్పాన్సరర్ ఎవరని కనీసం ప్రశ్నించలేదు. కాక్రోచ్ పార్టీని, ఉద్యమం వెనుక పాకిస్తానీ మద్దతుదారుల ముఠాలు ఉన్నట్లు ఇప్పటికే కొన్ని ఆరోపణలు వచ్చాయి. జరుగుతున్న పరిణామాలు వీటిని బలపరిచేవిగా ఉన్నాయి. కాగా ప్రస్తుత ఉద్యమాన్ని 2011 నాటి లోక్‌పాల్ ఉద్యమంలో కొందరు పోల్చుతున్నారు. కానీ దానికీ, దీనికి హస్తిమసకాంతరం తేడా ఉంది. లోక్‌పాల్ ఉద్యమంలో అన్నాహజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్ వంటివారు పాల్గొన్నారు. వారంతా ప్రజలకు పరిచితమైన ప్రజానాయకులు, మేథావులు. వారందరికి సమాజంలో ఎంతో గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుత కాక్రోచ్ ఉద్యమానికి నాయకుడే ఒక అపరిచితుడు. తాను ఒక్కడుగా వెళితే ప్రజల అంగీకరించరన్న ఉద్దేశంతో కాబోలు.. సోనమ్ వాంగ్‌చుక్ వంటి నాయకులను తెచ్చుకున్నారు. ఆమరణ దీక్ష చేసేలా వారిని ప్రేరేపించారు. ఈ ఆమరణ దీక్షలతో యువతలో కొంత నమ్మకం కలిగించారు. అంతేతప్ప అభిజిత్ దిప్కేపైనో.. అతను పెట్టిన కాక్రోచ్ పార్టీపైనో పెల్లుబికిన అభిమానమని చెప్పడానికి లేదు. ఇది నిర్థారణ కావాలంటే కాక్రోచ్‌ల స్టాండ్ ఏమిటో.. అవి ప్రజాజీవనంలో ఎన్నాళ్లు నిలబడతాయన్నదానిపైనే ఆధారపడి ఉంది. ఆ సంగతి పక్కనపెడితే.. ఇలా అపరిచితుల హడావుడికి ప్రతిపక్షాల వైఫల్యమే కారణమని చెప్పవచ్చు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు, ఇతర లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీసి, గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే. కానీ ఆ బాధ్యతను అవి సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీయే గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆ కూటమికి లభించిన ఓట్లు 43 శాతమే. మిగిలిన 57 శాతం ఓట్లు ప్రతిపక్షాలకు లభించినట్లే కదా!. అవన్నీ కలిసికట్టు ఉండి ప్రజాసమస్యలపై ఉమ్మడిగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఆటోమేటిగ్గా దిగివస్తుంది. కానీ మన ప్రతిపక్షాల్లో అదే ఐక్యత, ఏకాభిప్రాయాలే కొరవడ్డాయి. కారణం.. ఒక్కో పార్టీది ఒక్కో సిద్ధాంతం, ఒక్కో కార్యాచరణ. ప్రతి పార్టీకి సొంత అజెండాలు ఉంటాయి. ప్రజాక్షేమం కోసం వాటన్నింటినీ కాసేపు పక్కన పెట్టడానికి ఈ పార్టీలేవీ ఇచ్చగించవు. కొన్ని పైకి ప్రతిపక్షంగా పోరాడుతున్నట్లు కలరింగ్ ఇచ్చినా తెరవెనుక ప్రభుత్వపక్షంతో అంటకాగుతుంటాయి. ఇది కొనసాగినంతకాలం అపరిచిత నేతలు పుట్టుకొస్తూనే ఉంటారు.






"ఆయన వెనుక ఉద్యమ నేపథ్యం గానీ, ప్రజాసేవ చేసిన దాఖలాలు గానీ అస్సలు లేవని తెలుస్తోంది. అయినా నిన్న మొన్నటి వరకు ఇండియాలో లేకుండానే, ఇక్కడి ఎవరితోనూ కనీస పరిచయడం లేకుండా అపరిచితంగానే ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నా కూడా ఇప్పటికీ ఆయన పూర్వాపరాలు గోప్యమే."
Ee generation ki avanni anavasaram. Chesthunna vudhyamam lo yentha nijayithi vundhi anedhe avasaram...
Ye raajakeeya party ki kuda prajala kastala gurinchi pattinchukune antha time lenappudu, vallu India lone vundi, ikkada yentho mandhi tho parichaayalu vundi, vaalla purvaparalu thelisina vaati tho ee generation ki avasaram ledhu...
మీ విశ్లేషణ బాగుంది కానీ ఎవరో తెలియని ఒక వ్యక్తి చేసిన ఉద్యమానికి ఇంతటి ఆదరణ వచ్చింది అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద జనాలకు ఎంత వ్యతిరేఖత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ NEET పేపర్ లేకేజీ ఎందరి పిల్లల తలరాతలు మారిపోయాయో గమనిచగలరు. కొందరు విధ్యార్డులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీనికి ప్రభుత్వ భాధ్యత లేదు అంటే ఎలా. ప్రతిష్టాత్మకమైన పరీక్ష సామరస్యంగా నిర్వహించడం చేతకాని మంత్రి వర్గం ఖచ్చితంగా రాజీనామా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఖచ్చితంగా పాలకుల వైఫల్యం.