నెలన్నరగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
- DV RAMANA

- 7 hours ago
- 3 min read

ప్రస్తుతం దేశం దృష్టంతా దేశ రాజధాని ఢిల్లీపై ఉంది. చర్చంతా కాక్రోచ్ పార్టీపైన.. అది చేస్తున్న ఉద్యమంపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ ఉద్రిక్తతలు, వివాదాల జడిలో దేశంలో జరుగుతున్న ఇతర పరిణామాలు ఎవరికీ పట్టడం లేదు. ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరిగితే పదేపదే దాన్ని ప్రొజెక్టు చేస్తూ.. మిగితా అంశాలను గాలికొదిలేసే మన మీడియా తీరు కూడా దీనికి ఒక కారణం. పాకిస్తాన్‌లోన, శ్రీలంకలోనూ పెట్రోల్, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు తారాజువ్వల్లా ఎగసిపడుతున్నాయని ఆ మధ్య జాతీయ మీడియాలో కోకొల్లలుగా వార్తలు వచ్చాయి. కానీ మనదేశంలోనే ఒక రాష్ట్రంలో అదే దుస్థితి ఉన్న విషయం మాత్రం మనకు తెలియకపోవడం విచారకరం. అవును.. ఇది ముమ్మాటికీ నిజం. కీలకమైన ఈశాన్య భారతదేశంలో భాగమైన మణిపూర్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రూ.250, వంటగ్యాస్ సిలిండర్ రూ.5వేలు, 50 కిలోల బియ్యం బస్తా రూ.3వేలు పలుకుతూ సామాన్య జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడ దశాబ్దాలుగా కొనసాగుతున్న కుకీ, నాగా గ్రూపుల ఆధిపత్య పోరు మరోసారి రాజుకోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. కుకీ తెగకు చెందనివారు ఆరుగురు పౌరులను చంపారనే ఆరోపణతో నాగా గ్రూపులు నెలన్నర రోజులుగా ఆర్థిక దిగ్బంధనం అమలు చేస్తున్నాయి. కుకీ, జో తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసించే కాంగ్‌పోక్పి జిల్లాతో పాటు మరికొన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు ఆర్థిక దిగ్బంధనంలో భాగంగా నిత్యావసర వస్తువులు సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఫలితంగా స్థానిక వ్యాపారులు తమ వద్ద ఉన్న నిల్వలను బ్లాక్ చేసి ధరలు పెంచి అమ్ముతున్నారు. హింసకు ఆలవాలమైన మణిపూర్‌లో స్వేచ్ఛగా రాకపోకలు సాగేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినా నిత్యవసరాల సరఫరా స్తంభించిపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలన్నర నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో సరుకుల నిల్వలు తరిగిపోతున్నాయని, రాబోయే రోజుల్లో ఆకలికేకలు తప్పేలా లేవని స్థానిక ప్రజలు ఆవేదనతో వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్‌పోక్పి జిల్లా ప్రధానంగా రెండు మార్గాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి కాంగ్లాటోంగ్బీ మీదుగా రాజధాని ఇంఫాల్‌ను కలిపేది కాగా.. రెండోది సేనాపతి జిల్లా మీదుగా నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు తీసుకెళ్లేది. అయితే ఈ రెండు మార్గాలను నాగా గ్రూపులు మÖసివేయడంతో ఆహారధాన్యాలు, పెట్రో ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా స్తంభించిపోయింది. రాజకీయ వివాదాలు, తెగల మధ్య పోరాటాలు తమ మనుగడను దెబ్బతీస్తున్నాయని, తమది జీవనపోరాటంగా మారిందని కాంగ్‌పోక్పి జిల్లా ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో అనేకమంది కట్టెల పొయ్యిలు, ఇండక్షన్ స్టౌలను ఆశ్రయిస్తుండగా, ఆ పని చేయలేని వారిని పలు స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాయి. ఈ ప్రాంతాలకు మే 13 నుంచి వంటగ్యాస్ సరఫరా జరగడం లేదు. ఇది క్రమంగా జిల్లా మొత్తంపైన ప్రభావం చూపడం ప్రారంభించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో జాతులు, తెగల మధ్య ఆధిపత్య పోరాటాలు కొత్త కాదు. 2023లో మొతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణ జరిగి హింస ప్రజ్వరిల్లినప్పటినుంచీ ఇది కొనసాగుతున్నది. హింస, ఘర్షణలు కొత్త కాకపోయినా ఆర్థిక దిగ్బంధనం పేరుతో నిత్యావసర వస్తువులను స్తంభింపజేయడం గతంలో ఎప్పుడూ జరగలేదని ఈ తెగలతో సంబంధంలేని ఒక స్థానిక వ్యాపారి వ్యాఖ్యానించారు. నెలన్నర రోజులుగా పౌర జీవనం స్తంభించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నాయని ఆయన ఆగ్రహంతో ప్రశ్నించారు. మరో వ్యక్తి మాట్లాడుతూ రెండు వర్గాల ఆధిపత్య ప్రాంతాల మధ్య ఒక సరిహద్దు ప్రాంతాన్ని అమలు చేస్తున్నారని.. దాన్ని దాటి ఇతర ప్రాంతాల నుంచి ఆహారధాన్యాలు తెచ్చుకునే వెసులుబాటును నెలకు ఒకసారే అనుమతి ఇస్తున్నారని చెప్పాడు. రెండోసారి వెళ్లడానికి ప్రయత్నిస్తే సరిహద్దులో కాపాలా ఉన్న నాగా దాడిచేసి కొడతారని ఆందోళనతో చెప్పాడు. మణిపూర్ అంతటా స్వేచ్చాయుత రాకపోకలను పునరుద్ధరిస్తున్న గత ఏడాది మార్చిలో కేంద్ర HOME మంత్రి అమిత్‌షా ప్రకటించారు. కానీ కాంగ్‌పోక్పీలో మాత్రం అది అమలుకు నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో చిరువ్యాపారులు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. హÃటల్ వ్యాపారం చేస్తున్న ఒకాయన మాట్లాడుతూ తమ వద్ద చికెన్‌కు కొరత లేకపోయినా.. దాంతో బిర్యానీ, ఇతర వంటకాలకు అవసరమైన పదార్థాల నిల్వలు అడుగంటాయి. తెచ్చుకోవడానికి గానీ, రప్పించుకోవడానికి గానీ వీలుపడటంలేదని, ఫలితంగా తమ వ్యాపారం మొత్తం పడకేసిందని ఆవేదనతో చెప్పాడు. పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా.. ఆర్థిక దిగ్బంధనాన్ని ఆపేదిలేదని యునైటెడ్ నాగా కౌన్సిల్ స్పష్టం చేసింది. కుకీల చేతిలో హతమైన ఆరుగురు నాగా పౌరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో కుదిరిన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఒప్పందం కింద కుకీ గ్రూపులపై చర్యలు తీసుకోవాలని ఒక నాగా గ్రూపు నాయకుడు డిమాండ్ చేశారు. సరిహద్దు రాష్ట్రంలో కొండ ప్రాంతాలు, లోయల మార్గాల్లో కొన్ని వర్గాలు మాత్రమే స్వేచ్ఛగా సంచరించగలవు. వీరిలో మొతేయి పాంగల్, నేపాలీలు, ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన మణిపూరేతరులు కొండ ప్రాంతాల ప్రజలకు మధ్యవర్తులుగా మారారు. వీరు ఇంఫాల్‌లో సరుకులు కొనుగోలు చేసి చెక్ పాయింట్లు, దిగ్బంధనాలను అతికష్టం మీద దాటుకుని కొండలపై ఉన్న కాంగ్‌పోక్పికి చేరుకుంటారు. ఈ ప్రయాణంలో చాలాచోట్ల మామÖళ్లు సమర్పించుకోవాల్సి వస్తుంది. రవాణాలో వారు వేసే ప్రతి అడుగు, దాటే ప్రతి చెక్‌పాయింట్ నిత్యావసరాల ధరలపై అదనపు భారం మోపుతున్నాయి. ఆ భారాన్ని చివరికి కొనుగోలుదారులైన సామాన్య ప్రజలే భరించాల్సి వస్తున్నది. ఫలితంగా నిత్యావసరాలే విలాస వస్తువులుగా మారిపోయాయి.






Comments